నాయుడు @ 50

ABN , First Publish Date - 2021-04-19T05:44:42+05:30 IST

వొరేయ్‌ నిర్‌ వాక్య కవీ నిన్నే ఎందుకు బతుకు కరుణించింది నిన్నే ఎందుకు పరమపద వాక్యం...

నాయుడు @ 50

వొరేయ్‌ నిర్‌ వాక్య కవీ  

నిన్నే ఎందుకు బతుకు కరుణించింది 

నిన్నే ఎందుకు పరమపద వాక్యం 

గట్టిగా వూపిరి ఆరేట్టుగా 

              కాగలించుకుందీ 

నిన్నే... నిన్నే.. నా నిన్నే ఎందుకు 

      అర్థరహిత జ్ఞానం అలుముకుంది 

కాలుతూ.. కారే... మదినది కాల్వ 

      నిన్నే ఎందుకు వదిలి పారేసిందీ... 

      ముంచకుండా.. ముద్దువెట్టుకొని 

      సరిహద్దులమీద పంచనామా చేయకుండా 

      వొక్కడ్నీ వదిలేసిందీ 

వొరేయ్‌.. బతక నేర్వనోడా... స్వకవీ 

అవునిది కవిత్వం... జగన్నిద్రట నీది 

దొరకకుండా జారిపోయే వానపామట 

చీలికలూ... నీలికలూ అయ్యి.. తప్పిపోయే 

                           కాంతి అట 

అనుభవమే చేజిక్కుతుంది 

అర్థం పారిపోతుంది... 

కుంటుకుంటూ... నీ కొరకేనా 

               నీ కొరకేనా 

నాయనా...  

వానపాముల హారం నీ మెడలో 

గాలిపగుళ్ల అద్దం నీ గదిలో 

అప్పగించరా నీ దయ్యాలని 

తురుముకొని తిరిగే రాత్రినీ... 

పూవుల్ని దడికట్టరా... 

నాయుడో... నాయుడా...   

బతక నేర్వనోడా... 

బతుక మర్వనోడా ...

నేను పాఠకుడ్ని 

తిరుగుబోతు పతిమాతను 

ఎంత తెంపినా.. తెగినా.. అతికే 

తలరాత బోడిగుండును 

వాడని సీమ సింతకాయను 

ఎండని సప్ప బెండును 

రాయీ రప్పల మాటను  

నేను పాతకుడ్ని భాషను వంచిస్తాను 

వొరేయ్‌

వింటున్నవా... 

కతలు చెప్పుకునే చింత తోపును 

నిద్రను కలగనే ఈత చాపను 

వొరేయ్‌... బతక నేర్వనోడా 

నీ కవిత్వం..  అద్దంలోని సుద్దుల

                       సొద.. రొద 

నన్నొదిలెయ్‌ రా 

గాలోడా...

సిద్ధార్థ

73306 21563

Updated Date - 2021-04-19T05:44:42+05:30 IST