Sep 25 2021 @ 01:10AM

నేను పద్యాలు పాడుతుంటే ఆయన వినేవారు -నాగూర్‌బాబు

‘బాలుగారి లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమకే కాదు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన నాలాంటి వాళ్లకు ఇది తీరని పెద్ద లోటు’ అన్నారు నటుడు, గాయకుడు నాగూర్‌బాబు. కరోనా మహమ్మారి పై సుదీర్ఘ పోరాటం చేసి ఇక సెలవంటూ  ప్రముఖ గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం తనువు చాలించి నేటికి సరిగ్గా సంవత్సరం. ఆయనతో కలసి సుదీర్ఘ సంగీత ప్రయాణం చేసిన నాగూర్‌బాబు ఈ సందర్భంగా ‘చిత్రజ్యోతి’కి ప్రత్యేకంగా చెప్పిన విశేషాలివీ...


బాలుగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఒకసారి ఆయన్ని కలిస్తే చాలు ఇక ఎప్పటికీ ఆయన్ని ఎవరూ మరిచిపోలేరు. అంత ఆప్యాయత ఆయన కనబర్చేవారు. చిన్న సంగీత దర్శకుడు అయినా, పెద్ద సంగీత దర్శకుడు అయినా ఆయన చూపే మర్యాద, వినయ విధేయతల్లో ఏ మాత్రం మార్పు ఉండదు. రికార్డింగ్‌ టైమ్‌కు పావు గంట లేట్‌గా వస్తే సంగీత దర్శకుడిని ఆయన క్షమాపణ అడిగే వారు. తను పెద్దల దగ్గర నేర్చుకున్నది మనకు నేర్పేసి వెళ్లారు. అహర్నిశలు సాధన చేస్తూ పాటకు జీవంపోస్తూ వచ్చారు. వచ్చే తరంలో కూడా ఇది కంటిన్యూ అవ్వాలి. 


ఫ మేమిద్దరం కలసి 18 ప్రోగ్రాములు దాకా చేశాం. కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు  సేకరించి కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 7200మంది సంగీత కళాకారులకు పంపించారు. అందులో నేను పాల్గొన్నాను. రెండు మూడు రోజులకొకసారి జూమ్‌లో మాట్లాడుకునేవాళ్లం.   మా అందరినీ జాగ్రత్తగా ఉండమని ఆయన ఆస్పత్రికి వెళ్లడం, ఇక అక్కడి నుంచి తిరిగి రాకపోవడం...  అంతా విధి లీల. గతేడాది జులై 20న అనుకుంటా హైదరాబాద్‌ వచ్చానని ఆయన చెప్పారు. అదే ఆఖరి ఫోన్‌కాల్‌ ఆయనతో మాట్లాడింది. దాని తర్వాత 31న చెన్నై బయల్దేరి వచ్చారు. నాలుగు రోజులు ఇంట్లో ఉండి కరోనాతో హాస్పిటల్‌లో చేరారు. హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటే ఆయన డెఫినెట్‌గా బతికేవారని అందరూ అంటున్నారు. అలాగని ఇంట్లో ఉండి వైద్యం వికటిస్తే అది మరింత డేంజర్‌ కదా? దేనికీ సమాధానం దొరకకుండా చేస్తాడు కదా భగవంతుడు. 


ఆయనది గంధర్వ అంశ. పాటనే శ్వాసగా చేసుకొని బతికారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పాడాక కూడా ఆయన ఫ్రెష్‌గా ఉండేవారంటే... పాట మీద ఉన్న వ్యామోహమే కారణం. వర్క్‌ శాటిస్‌ఫిక్షన్‌ అనేది ఆయన దగ్గర చాలాకాలం చూశాను. 


1979లో నేను ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ గారి దగ్గర అసిస్టెంట్‌గా జాయినయ్యాను. అప్పుడు నాకు 14 ఏళ్లు. అప్పటి నుంచి నేనంటే బాలుగారికి ప్రేమ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఏనాడూ జూనియర్‌ సింగర్‌గా చూడలేదు.  ఆయన ఎంటరైన 22 ఏళ్ల తర్వాత నేను వచ్చాను. అయినా ఆయన తనతో  సమానంగా చూసుకొనేవారు. అందరినీ సమానంగా చూసే మనస్తత్వం ఆయనది. 


బాలు అన్నయ్యను తలుచుకుంటే చాలు  ఆయన డెడికేషన్‌ గుర్తుకొస్తుంది. మేమిద్దరం  కలసి 2020 జనవరి 20న చివరి ప్రోగ్రామ్‌ కోయంబత్తూరులో ఇచ్చాం. ఇళయరాజాగారితో వివాదం ముగిసిన తర్వాత చేసిన ఐదో ప్రోగ్రామ్‌ ఇది. ఆ రోజు ఆయన స్నేహితుడు అక్కడ ఉన్నాడు. వాళ్లింటికి భోజనం కోసం వెళ్తూ ‘అరేయ్‌... ముక్క పెట్టలేం కానీ వస్తావా?’ అని అడిగారు. ‘అలాగే అన్నా వస్తాను’ అని రాత్రి 12 గంటలకు ఆయన రూమ్‌కి వెళ్లాను. అప్పుడు ఆయన హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటను ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ‘ఏమిటన్నా ఏదన్నా కొత్త పాట ప్రోగ్రామ్‌లో యాడ్‌ చేస్తున్నారా’ అని అడిగాను.  ‘లేదురా... ఈ పాట పాడి 30 సంవత్సరాలు అయింది. జనంలో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి కదా. అందుకే ఒకసారి విని ప్రాక్టీసు చేస్తున్నాను’ అన్నారు. ‘నీ డెడికేషన్‌లో 10పర్సంట్‌ ఉన్నా చాలా గొప్ప పొజిషన్‌కి వచ్చేవాళ్లం’ అని అంటే నవ్వి ‘అందరూ చేయాల్రా. పాట మీద మనకున్న ఇష్టాన్ని ప్రదర్శించి... అలాగే పాడడానికి ట్రై చేయాలి కదా! అది ధర్మం కూడా’ అని అన్నారు. ఆ రోజు కచేరిలో వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌ వేసి చాలా అందంగా కనిపించారు.  ‘అన్నా మీ వయసు పదేళ్లు తగ్గిపోయింది’ అని అంటే  ముసిముసి నవ్వులు నవ్వారు. 


ఒక గాయకుడిగా గాక  ఇంట్లో వ్యక్తిలా, సొంత తమ్ముడిలా ఆయన నన్ను చూశారు. మంచీ చెడూ అన్నీ నాతో డిస్కస్‌ చేసేవారు. నా సమస్యలు ఆయన వినేవారు. తన సమస్యలు నాకు చెప్పేవారు. బాగా స్ట్రిక్‌గా ఉండే తండ్రి చనిపోతే ముందు బాధ పడినా,  రెండు మూడు నెలలు తర్వాత ఏ కొడుకు అయినా మామూలు అవడానికి ట్రై చేస్తాడు. అదే తండ్రి ఒక స్నేహితుడిలా మెలిగితే ఆయన చనిపోయాక ఒకటి రెండేళ్లకు కానీ మాములు మనిషి కాలేడు. నాకు తండ్రి లాంటి వ్యక్తి బాలుగారు. నాకు తెలిసి చరణ్‌ కన్నా నేనే ఎక్కువ సమయం ఆయనతో గడిపాను. ‘సినిమాల్లో ఉన్నాడు ఈ కుర్రాడు ఎట్లాంటివాడో’ అని మా మామగారు పిల్లను ఇవ్వడానికి సందేహిస్తుంటే... చక్రవర్తిగారు, బాలుగారు నా పెళ్లికి తెనాలి వచ్చి దగ్గరుండి పెళ్లి జరిపించారు. అప్పుడప్పుడు ‘అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా?’ అని అడిగేవారు. ‘మనవళ్లు పుట్టాక కూడా ఇదేం ప్రశ్న అన్నా’ అనేవాడిని. 


‘సతీ లీలావతి’ సినిమాలో కమల్‌హాసన్‌ కోయంబత్తూరు స్లాంగ్‌లో మాట్లాడారు. అది కూడా మన గోదావరి భాషలా ఒక రాగంలో  ఉంటుంది. ‘ఈ సినిమాకు నేను డబ్బింగ్‌ చెప్పడం  కన్నా నాగూర్‌బాబు చెబితేనే అద్భుతంగా ఉంటుంది. వాడు ఆ డ్రామా పండిస్తాడు’ అని ప్రొడ్యూసర్స్‌కు అన్నయ్య చెప్పారు. గోదావరి స్లాంగ్‌ జోడించి ఆ చిత్రంలో కమల్‌గారికి డబ్బింగ్‌ చెప్పాను. అలాగే ఆయన నటించిన ‘బహ్మచారి’ చిత్రానికి కూడా. ఈ రెండు చిత్రాల్లో నేను డబ్బింగ్‌ చెప్పడానికి బాలు అన్నయ్యే కారణం.  


ఒక్కోసారి మనసు బాగోకపోతే ఫోన్‌ చేసి నా దగ్గరకు వచ్చేసేవారు. చెన్నైలో నాకు  గెస్ట్‌ హౌస్‌ ఉంది. అక్కడ తబలా, హార్మోనియం ఉంటాయి. నేను డ్రామా పద్యాలు పాడుతూ ఉంటే చిరునవ్వుతో వినడం ఆయనకు చాలా చాలా ఇష్టం.