15 నిమిషాల్లో 35 సార్లు దాడి

ABN , First Publish Date - 2022-05-07T08:48:54+05:30 IST

‘‘నడి రోడ్డుపైన నా భర్త నాగరాజును హత్య చేస్తుంటే అక్కడే ఉన్న జనం వీడియోలు తీసుకున్నారు తప్ప అడ్డుకోలేదు.

15 నిమిషాల్లో 35 సార్లు దాడి

దారుణాన్ని చూస్తూ.. జనం వీడియో తీస్తూ ఉండిపోయారు

వారిని వేడుకుంటూ విలువైన సమయాన్ని నేను వృథా చేశా

అన్న కనికరించలేదు.. అక్కడే ఉన్న ప్రజలు పట్టించుకోలేదు

మీడియాతో వాపోయిన నాగరాజు భార్య ఆశ్రిన్‌ సుల్తానా

హత్యపై నివేదికివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్‌ 

నేడు మర్పల్లికి జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సాంప్లా


వికారాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘నడి రోడ్డుపైన నా భర్త నాగరాజును హత్య చేస్తుంటే అక్కడే ఉన్న జనం వీడియోలు తీసుకున్నారు తప్ప అడ్డుకోలేదు. ఇనుపరాడ్లతో దారుణంగా దాడి చేస్తుంటే ఆదుకోవాలని ఎంత వేడుకున్నా స్పందించలేదు. నా భర్తను ఏమీ చేయొద్దంటూ ప్రాథేయపడినా మా అన్న,అతడి గ్యాంగ్‌ కనికరం చూపలేదు.


10 నుంచి 15 నిమిషాల్లో 30- 35 సార్లు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక  పారిపోయారు. ప్రజలను సాయం అడిగి సమయం వృథా చేశా. అదే వ్యవధిని నేను ఉపయోగించుకుని ఉంటే భర్త ప్రాణాలు దక్కించుకుని ఉండేదాన్ని’’ అని హైదరాబాద్‌లో బుధవారం హత్యకు గురైన నాగరాజు భార్య ఆశ్రీన్‌ సుల్తానా కన్నీటి పర్యంతమైంది. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలోని నాగరాజు నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడింది. వివాహమయ్యాక.. అశ్రీనా గురువారం తొలిసారి అత్తవారింటికి వచ్చింది. ఇదే రోజు నాగరాజు అంత్యక్రియలు జరగడం గమనార్హం. కాగా, మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ ప్రేమ విషయంలో కుటుంబం ఎలా స్పందించింది..? బుధవారం రాత్రి ఏం జరిగిందో వివరించింది. తన భర్తను హత్య చేసిన అన్న, అతడి స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

‘‘నన్ను ఇంటికి తీసుకుని వెళ్తూ నాగరాజు.. రోడ్డు దాటడానికి బైక్‌ వేగం కొంచెం తగ్గించాడు. అంతలోనే రెండు బైక్‌లు దూసుకొచ్చాయి. వాటిలో ఒకదానిపై ఉన్న మా అన్నను గుర్తించలేదు. ఇంతలోనే వారు నాగరాజును నెట్టేశారు. కిందపడిపోయాక రాడ్లతో కొట్టడం ప్రారంభించారు. నేను అడ్డుకోబోగా సోదరుడి స్నేహితులు పక్కకు నెట్టేశారు’’ అని వాపోయింది. 


బెదిరించేవారు.. చంపేందుకు యత్నించారు

నాగరాజుతో పెళ్లిని తమ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిందని, సోదరుడు చంపేస్తాడని తన అమ్మ హెచ్చరించిందని అశ్రీన్‌ తెలిపింది. సోదరుడు తనను రెండుసార్లు ఉరి తీయడానికి యత్నించాడని చెప్పింది. వివాహానికి ముందే ఎన్నో రకాలుగా బెదిరించారని పేర్కొంది.  పెళ్లికి ముందు రోజు (జనవరి 30) అన్న బాగా కొట్టాడని, గదిలో  బంధించి ఉరివేసుకోమని చెప్పాడని, ఎలాగోలా తప్పించుకున్నానని వివరించింది. వేరే పెళ్లి చేసుకోమని నాగరాజును ఒప్పించేందుకు రెండు నెలలు విఫల ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది. కాగా, రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే కుటుంబానికి దూరంగా వెళ్లాలంటూ వారు సలహా ఇచ్చారని చెప్పింది. తాను చనిపోయే వరకూ నాగరాజు ఇంట్లో, అతడి జ్ఞాపకాలతో జీవిస్తానని తెలిపింది. తన అన్నను చంపినవారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని నాగరాజు చెల్లెలు రమాదేవి డిమాండ్‌ చేసింది. ఇతర కులాల వారు హత్యకు గురైతే హడావుడి చేసే ప్రభుత్వం, పోలీసులు.. దళితుడి విషయంలో మూడు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.


నాగరాజు కుటుంబానికి పలువురి పరామర్శ 

నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి పరామర్శించారు. ఆశ్రీన్‌ సుల్తానాతో పాటు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాగరాజు హత్యను నిరసిస్తూ శుక్రవారం వికారాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Read more