ఆదివాసీల ఆధ్మాత్మిక సంబరం

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో ప్రతి సంవత్సరం జరిగే నాగోబా జాతర వందల ఏళ్ళ నాటిది. శేషనారాయణుణ్ణి సర్ప దేవతగా గిరిజనులు పూజిస్తారు. పుష్యమాసం చివరి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే నాగోబా జాతరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో

ఆదివాసీల ఆధ్మాత్మిక సంబరం

31 నుంచి నాగోబా జాతర 

ఇరవై ఆదివాసీ తెగలు ఒక చోట చేరి... సర్పరూపంలో ఉన్న తమ ఆరాధ్యదైవం 

నాగోబాను కొలిచే అతి పెద్ద సంబరం... నాగోబా జాతర. ప్రపంచంలోనే అతి పెద్ద 

గిరిజన జాతరల్లో ఒకటిగా ఖ్యాతి పొందిన ఈ వేడుక ఎన్నో విశేషాల సమ్మేళనం.


తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో ప్రతి సంవత్సరం జరిగే నాగోబా జాతర వందల ఏళ్ళ నాటిది. శేషనారాయణుణ్ణి సర్ప దేవతగా గిరిజనులు పూజిస్తారు. పుష్యమాసం చివరి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే నాగోబా జాతరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పుష్య మాసంలో పౌర్ణమి రాగానే... ఒక మాసం రోజుల ముందుగానే ఈ జాతరకు సన్నాహాలు ఆరంభమవుతాయి. మెస్రం వంశానికి చెందిన వారు పుష్య పౌర్ణమి రోజున పూజలు చేసి, ప్రధాన జాతర కోసం గోదావరి జలాలను తీసుకురావడానికి బయలుదేరుతారు. కాలినడకన వారు ప్రయాణం చేసి, జన్నారం మండలం కలమడుగుకు సమీపంలో ఉన్న గోదావరి హస్తిన మడుగులో జలాలను తీసుకుంటారు. ఇంద్రాయి గ్రామంలో... ఇంద్రాయి దేవతకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ యాత్ర కేస్లాపూర్‌ చేరుకుంటుంది. 


మెస్రం వంశానికి చెందిన రాణికి సర్పరూపంలో దేవుడు దర్శనమిచ్చి, ఆమె కడుపున పుడతాననీ, ఆ వంశంలోని కుటుంబాల్లో నూతన వధూవరులను తన దగ్గరకు తెచ్చి, పరిచయం చేసి, ఆశీర్వాదాలు తీసుకోవాలనీ,  ప్రతి ఏటా పుష్య అమావాస్య నాడు స్వయంగా దర్శనమిస్తాననీ చెప్పినట్టు గిరిజనుల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ ప్రకారం...పుష్య మాసంలోని అమావాస్య నాటి రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తరువాతి రోజున జాతర మొదలుపెడతారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. మహిళలు కొత్త కుండల్లో జలాలను తెచ్చి, ఆలయాన్ని శుభ్రపరుస్తారు. ఆ తరువాత గోదావరి జలాలను ఊరేగించి, ఆలయానికి తీసుకువచ్చి, నాగోబాకు అభిషేకిస్తారు. నాగదేవత ఆదేశం ప్రకారం... మెస్రం కుటుంబాలకు చెందిన కొత్త కోడళ్ళను నాగోబా దర్శనానికి తీసుకువస్తారు. వారిని నాగోబాకు పరిచయం చేసే కార్యక్రమాన్ని ‘భేటింగ్‌’ అంటారు. ఆ తరువాత మాత్రమే తమ వంశంలోని మిగిలిన వారికి కొత్త కోడళ్ళను పరిచయం చేస్తారు. నాగోబాకు పూజలు చేసే అర్హత వారికి అప్పుడే లభిస్తుంది. 


నాగోబా జాతరలో పూజలు జరిపేది మెస్రం వంశీయులే. ఈ వంశంలో ఇరవై తెగలు ఉన్నాయి. వారు ఏడుగురు దేవతలను పూజిస్తారు. నాగోబా జాతరలో తమ సంప్రదాయాలన్నిటినీ వారు కచ్చితంగా పాటిస్తారు. వీటిలో పితృదేవతల పూజలు ప్రధానంగా జరుగుతాయి. పూజ కోసం, వంటల కోసం అవసరమైనవన్నీ ఎడ్ల బండ్ల మీద వారే తెచ్చుకుంటారు. వాద్య ఘోషల మధ్య ఆలయానికి చేరుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో మెస్రం వంశీయులు ఎక్కువగా ఉన్నారు. ఈ వంశీయులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా.... పుష్య అమావాస్య నాటికి మెస్లాపూర్‌కు వేలాదిగా తరలివస్తారు. జాతర జరిగినన్ని రోజులూ అక్కడే బస చేస్తారు. స్వామిని కొలిచి, మొక్కులు తీర్చుకుంటారు. వారి పూజల తరువాత ఇతరులను ఆలయంలోకి అనుమతిస్తారు. గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో నాగోబాను దర్శించుకుంటారు. జాతరలో నాలుగో రోజున నాగోబా దర్బార్‌ నిర్వహిస్తారు. నాగోబాను పూజిస్తే ఆరోగ్యం చేకూరుతుందనీ, పంటలు పుష్కలంగా పండుతాయనీ, పశు సంపద క్షేమంగా ఉంటుందనీ భక్తుల నమ్మకం. ఈ ఏడాది జనవరి 31వ తేదీ అర్థరాత్రి మహా పూజతో నాగోబా జాతర ఆరంభమవుతుంది.

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST