‘తరిమెల’కు ఖ్యాతి తెచ్చిన నాగిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-28T10:12:55+05:30 IST

భారత విప్లవోద్యమ నాయకుడు తరిమెల నాగిరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా తరిమెల. నాగిరెడ్డికి పేరు ప్రఖ్యాతులు తరిమెల గ్రామం నుంచే...

‘తరిమెల’కు ఖ్యాతి తెచ్చిన నాగిరెడ్డి

భారత విప్లవోద్యమ నాయకుడు తరిమెల నాగిరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా తరిమెల. నాగిరెడ్డికి పేరు ప్రఖ్యాతులు తరిమెల గ్రామం నుంచే ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి గ్రామంలోనే తగాదాలు పరిష్కరించుకునే విధానం అమలుపరిచారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే తరిమెల, ఇల్లూరు గ్రామాల్లో కల్లు, సారాయి అంగళ్లను శాశ్వతంగా నిషేధించేందుకు కృషి చేశారు. చదువుకునే రోజుల్లో నాగిరెడ్డి సెలవులకు స్వగ్రామం వచ్చినపుడు యువకుల చేత అమ్మ, మాలపల్లి మొదలగు విప్లవ సాహిత్యాన్ని చదివించేవాడు.


రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ దశలో ‘యుద్ధము దాని పర్యవసానాలు’ పేరుతో కరపత్రాన్ని నాగిరెడ్డి, విశ్వం పేర్లతో ప్రచురించి ప్రచారం చేశారు. దీనిపై ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వీరికి తొమ్మిది నెలలు శిక్ష విధించింది. గాంధీ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో తరిమెల గ్రామం ముఖ్య పాత్ర నిర్వహించింది. నాగిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక అప్పటి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావుతో బహిరంగసభ నిర్వహించారు. ఆ తరువాత వావిలాల గోపాలకృష్ణయ్య, తదితర ప్రముఖులతో గ్రామస్తులకు రాజకీయ అవగాహన పెంపొందించే కార్యక్రమాలను రూపొందించేవారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు నాగిరెడ్డి ఓడిపోయినా తరిమెల గ్రామంలో మాత్రం మెజారిటీ ఓట్లు సాధించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో నాగిరెడ్డి జైల్లో ఉన్నప్పటికీ సంజీవరెడ్డిపై 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మద్రాస్ అసెంబ్లీలో నాగిరెడ్డిని ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. 1957లో నాగిరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. మార్క్సిస్ట్ పార్టీగా విడిపోయాక అనంతపురం నుంచి నాగిరెడ్డి గెలిచారు. 1969లో సిపిఎం రివిజినిస్ట్ విధానాలతో విభేదించి నక్సల్బరీ విప్లవ పోరాట వెలుగులో కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడిగా నాగిరెడ్డి ముందు పీఠాన నిలబడ్డారు. ఎమర్జెన్సీలో 1976 జూలై 28న అనారోగ్యంతో మరణించే వరకు విప్లవోద్యమ నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. 


ఆ విధంగా తరిమెలలో పుట్టి భారత విప్లవోద్యమంలో మహాకవి శ్రీశ్రీ వర్ణించినట్లు వజ్రకరూరు వైడూర్యంగా నాగిరెడ్డి వెలుగొందారు. తనకు జన్మనిచ్చిన గ్రామం తరిమెలను ప్రపంచపటంలో గొప్పగా నిలబెట్టారు. పూర్వం కంచిరెడ్డి పేరుతో ఉన్న గ్రామం సుబ్బారెడ్డి హయాంలో తరిమెలగా మారి చివరికి అదే ఇంటిపేరుగా స్థిరపడి నేడు ఆ గ్రామం నాగిరెడ్డి విప్లవ రాజకీయ ప్రస్థానం ఫలితంగా విశ్వవిఖ్యాతిని పొందింది.

ముప్పాళ్ళ భార్గవశ్రీ

సిపిఐ ఎంఎల్ నాయకులు


Updated Date - 2022-07-28T10:12:55+05:30 IST