నా భర్త హత్యకు వారే సూత్రధారులు

ABN , First Publish Date - 2022-05-19T06:42:54+05:30 IST

‘నా భర్త నాగేంద్ర హత్య కేసులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణలే కీలక సూత్రధారులని ఆ రోజే డీఎస్పీ పైడేశ్వరరావుకు చెప్పా. కానీ కేసులో వారి పేర్లు పెట్టలేదు.

నా భర్త హత్యకు వారే సూత్రధారులు
మాట్లాడుతున్న నాగేంద్ర భార్య జ్యోతి (సర్కిల్లో)

ఎమ్మెల్యే దూలం, ఎంపీపీ రామిశెట్టిపై వైసీపీ నేత నాగేంద్ర భార్య ఆరోపణ

కేసును నీరు కార్చేస్తున్నారు.. డీఎస్పీ అబద్దం చెబుతున్నారని ఆందోళన

న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక


 ‘నా భర్త నాగేంద్ర హత్య కేసులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణలే కీలక సూత్రధారులని  ఆ రోజే డీఎస్పీ పైడేశ్వరరావుకు చెప్పా.  కానీ కేసులో వారి పేర్లు పెట్టలేదు. ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, బలహీనులను హంతకులుగా చూపిస్తూ డీఎస్పీ అబద్ధం చెబుతున్నారు’ అని ముదినేపల్లిలో ఈ నెల 13వ తేదీ రాత్రి హత్యకు గురైన వైసీపీ ఎస్సీ సెల్‌ గ్రామ అధ్యక్షుడు వర్రే నాగేంద్ర.. భార్య జ్యోతి ఆరోపించారు. ఈ హత్యోదంతంపై ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆమె మాటల్లో.. 

(ఏలూరు–ఆంరఽధజ్యోతి) 

‘గురజ రోడ్డు సెంటర్‌లో వంగవీటి రంగా విగ్రహా విష్కరణ సమయంలో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఎమ్మెల్యే నా భర్తపై కక్ష పెట్టుకుని అరెస్టు చేయిం చారు. వివాదం రేగిన చోటే నా భర్తను బలిగొన్నారు. కేరళ నుంచి ఆన్‌లైన్‌లో కత్తులు బుక్‌ చేయించి, తెప్పించిన పెయ్యేరు వైసీపీ సర్పంచ్‌ గండి సాయి పేరును కేసులో ఎందుకు చేర్చలేదు. హత్య జరిగిన రోజున ఆ వివాదంలో అతనూ ఉన్నాడు. సాయిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్‌  గుర్తించాడు. ఎంపీపీ ప్రమాణ స్వీకారం రోజు స్థానికంగా హల్‌చల్‌ సృష్టించిన యువ నాయకులు ఈ హత్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీపీ తనను వేధించి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని నా భర్త గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా భర్త హత్యకు గల కారణాలను, ఆధారాలను డీఎస్పీకి తెలిపినా నాయకులకే మద్దతు పలికారు. ఇది కచ్చితంగా రాజకీయ హత్యే. కేసును అన్యాయంగా మార్చేశారు. నాకు న్యాయం జరగకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా. ఎస్సీల సత్తా ఏమిటో వారికి చూపిస్తా’ అంటూ హతుడు భార్య జ్యోతి హెచ్చరించారు.


మట్టి అంటకుండా చేయాలి

‘రంగా విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్యే ‘ఇప్పుడు ఎవరూ ఆవేశపడొద్దు.. మట్టి చేతికి అంటకుండా చూసుకోవాలి. నేను చూసుకుంటా’ అంటూ నాగేంద్రను హెచ్చరించారు. ఆ మాటలపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పార్టీ జెండా ఎత్తిన చేతులకు ఎందుకు బేడీలు వేయించారని ప్రశ్నించిన మాపై స్థానిక యువ నాయకులను రెచ్చగొట్టి ఈ హత్య చేయించారు. ఈ ఘాతుకంలో గాయపడ్డ నా కుమారుడు మహేష్‌కు ఛాతిపై 24 కుట్లు పడ్డాయి’ అని నాగేంద్ర మేనత్త అంటున్నారు. 


పక్కా వ్యూహంతోనే నరికి చంపారు..

‘హత్య జరిగినప్పుడు పక్కా వ్యూహంతోనే సీసీ కెమెరాలు, లైట్లు ఆపేసి మా నాన్నను నరికి చంపేశారు. నాయకుల హస్తం లేకపోతే దళిత, వైసీపీ నాయకుడు మరణించి నాలుగు రోజులైనా మమ్మల్ని పరామర్శిం చేందుకు వారు ఎందుకు రాలేదు. తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు’ అని నాగేంద్ర కుమార్తెలు నాటి ఘటనను తలుచుకుని  కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2022-05-19T06:42:54+05:30 IST