సాగర్‌.. సోయగం

ABN , First Publish Date - 2022-08-14T05:29:10+05:30 IST

ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటివిడుదల కొనసాగుతోంది.

సాగర్‌.. సోయగం
సాగర్‌ నీటి విడుదల

26 క్రస్ట్‌గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

విజయపురిసౌత్‌, ఆగస్టు 13: ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటివిడుదల కొనసాగుతోంది.  శ్రీశైలం నుంచి 4,09,963 క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కూడా 4,09, 963 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం శనివారం నాటికి 586.30 అడుగులు ఉంది. ఇది 301.87 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, ఎడమ కా లువ ద్వారా 8,193, కుడి కాలువ ద్వారా 8,105, వరద కాలువ ద్వారా 300, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,845, 26 క్రస్ట్‌గేట్లలో రెండు గేట్లను 5 అడుగుల మేర, 24 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,58,120 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 4,09,963 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లోవాటర్‌గా 4,09,963 క్యూసె క్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.30 అడుగులుంది. ఇది 211.47 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 2,68,109 క్యూసెక్కులు, రోజా నుంచి 90,942 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 3,59,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  


పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో శనివారం 35.45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు పులిచింతల ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. 13 గేట్ల ద్వారా 3,34,230 క్యూసెక్కుల నీరు, పవర్‌ జనరేషన్‌ ద్వారా ఆరు వేలు, మొత్తం 3,40,230 క్యూసెక్కుల నీరు దిగువ కృష్ణకు విడుదల అవుతుందన్నారు. ఎగువ నుంచి 3,87,423 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు.


బ్యారేజి దిగువకు 3,29,000 క్యూసెక్కులు 

తాడేపల్లి టౌన్‌: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రానికి 3లక్షల 44వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 14,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 65 గేట్లను 8అడుగుల మేర 5 గేట్లను పూర్తిగా ఎత్తి 3లక్షల 29వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-08-14T05:29:10+05:30 IST