బహుళార్థ సాధకం

ABN , First Publish Date - 2022-08-04T04:37:35+05:30 IST

22 లక్షల ఎకరాలకు సాగునీరు... లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్‌.

బహుళార్థ సాధకం
నాగార్జున సాగర్‌ డ్యాం

ఇంజనీర్ల కలకు ప్రతిరూపం

జిల్లా దశను మార్చిన ఎన్నెస్పీ జలాలు

సాగర్‌నీటి విడుదలకు నేటితో 55 ఏళ్లు

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు3: 22 లక్షల ఎకరాలకు సాగునీరు... లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్‌. అన్నపూర్ణ... భారతదేశ భాండాగారం... అన్నదాతల ఆత్మబంధువు.. ఇలా ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నా దాని పరిధిలోని వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నాగార్జునసాగర్‌ పరిధిలోని  ఎడమకాలువ కింద ఖమ్మం, నల్లగొండ, కృష్ణా జిల్లాలోని సుమారు 11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుండగా, కుడికాలువ పరిధిలో 203 కిలోమీటర్ల పరిఽధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 15లక్షలకు పైగా ఎకరాల్లో సాగునీరందిస్తూ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా అలరారుతోంది. శనివారం నాటికి ఈ ప్రాజెక్టు ప్రారంభమై 55 ఏళ్లు కావస్తుంది. 

సాగర్‌ నీటితో  జలసిరి

జిల్లాలో నాగార్జున సాగర్‌ డ్యాం నుంచి ఖమ్మం జిల్లా వరకు (మున్నేరు వరకు) 180 కిలోమీటర్ల ప్రధాన ఎడమ కాలువ ఉంది. మున్నేరు ఆక్విడెక్టు నుంచి కృష్ణాజిల్లా నూజివీడు వరకు 117 కిలోమీటర్ల మేర ఈ కాలువను నిర్మించారు. 1967 నుంచి కాలువల నిర్మాణం కొనసాగినా 1980 వరకు పూర్తి స్థాయిలో నిర్మితమయ్యాయి. జిల్లాకు 1983 నుంచి సాగర్‌ నీళ్లు విడుదలయ్యాయి. సాగర్‌ జలాల రాకతో జలసిరి సంతరించుకుంది. జిల్లా లో 17 మండలాల్లో 3లక్షల హెక్టార్ల సాగుభూమికి నీళ్లందాయి. ఫలితంగా జిల్లాలో వ్యవసాయరంగానికి ఊతం వచ్చింది. నేలకొండపల్లి,  కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, ఖమ్మం అర్భన్‌, కొణిజర్ల, వైరా, ఏన్కూరు,తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, చింతకాని మండలాలకు సాగర్‌జలాలతో సాగు భాగ్యం లభించింది. సుమారు 132 టీఎంసీల నీటిని ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు వినియోగించేందుకు ఈ కాలువను డిజైన్‌ చేయగా జిల్లాలో సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని భూములన్నీ సస్యశామలం అయ్యాయి. అప్పటి వరకు జొన్న, సజ్జలు వంటి పంటలకే అవకాశం ఉన్న చేలన్నీ ‘ వరి’ పంటకు అవకాశం లభించింది.  

రెండు దశాబ్దాల  కాలంలో ఆరుసార్లు....!

దశాబ్ధన్నర కాలం నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఆరు సార్లు కరువు వచ్చింది. 2002, 2003, 2004, 2012, 2014,2015 సంవత్సరాల్లో నాగార్జున సాగర్‌ పరిథిలో కరువు వచ్చింది. సాగునీరు విడుదల చేయలేని స్థితిలో కేవలం తాగునీటిని శ్రీశైలం నుంచి తీసుకుని విడుదల చేయాల్సి వచ్చింది. వరసగా కరువు పరిస్థితులు అధికంగా వస్తుండడంతో రైతులు సాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. 2005లో ఉచిత విద్యుత్‌ పథకం వచ్చిన తర్వాత రైతులు సాగర్‌ ఆయకట్టు కింద స్థిరీకరించిన తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు 2002, 2003, 2004, 2015 సంవత్సరాల్లో కన్పించింది. ప్రస్తుత తాజా పరిస్థితుల్లో  సాగర్‌ జలాశయానికి జలాలు చేరనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో జలశయం నిండింది. త్వరలో నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు.అయితే వర్షాలు ఇలాగే కురిస్తే నాగార్జున సాగర్‌కు జలాలు చేరితే ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగ ర్‌ జలాలు విడులవనున్నాయి... దీంతో ఆయకట్టు రైతులు నీటి విడుదలైతే పంటలు పండే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-04T04:37:35+05:30 IST