Abn logo
Sep 27 2021 @ 01:01AM

నగరంలో కుంభవృష్టి

చావులమదుం బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు

ఈదురు గాలులతో భారీ వర్షం

రాత్రి 10 గంటల తరువాత మరింత ఉధృతం

లోతట్టు ప్రాంతాలు జలమయం

కొండవాలు ప్రాంతాలకు పొంచిఉన్న కొండచరియల ముప్పు


విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ ప్రభావంతో నగరంలో ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మొదలైన వర్షం... గంట గంటకు పెరుగుతూ అర్ధరాత్రికి మరింత పెరిగింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికితోడు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తుండడంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి, కొమ్మలు విరిగిపడ్డాయి.  రాత్రి 11.30 గంటలకు అందిన సమాచారం మేరకు అడవివరంలో 13.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. టీటీడీ కల్యాణమండం ప్రాంతంలో 12.3 సెం.మీ., టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద 11.5  సెం.మీ., రైల్వే న్యూకాలనీ 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం ప్రారంభమైన వాన సాయంత్రానికి పెరిగి రాత్రికి మరింత ఎక్కువైంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో జోరున వర్షం కురుస్తోంది. రాత్రి 8.30 గంటల నుంచి గాలుల తీవ్రత క్రమేపీ పెరిగింది. వాల్తేర్‌ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రంలో గాలుల వేగం గంటకు 70 నుంచి 80 కి.మీ.లుగా నమోదైంది. తీర ప్రాంతంలో గాలుల వేగం ఇంకా ఎక్కువగా ఉందని అంచనావేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. రహదారులు వర్షపు నీటితో పంట కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు.. ముఖ్యంగా  రైల్వేన్యూకాలనీ, జ్ఞానాపురం, చావులమదుం, ప్రసాద్‌ గార్డెన్స్‌, రామకృష్ణాపురం, కల్లుపాకలు, తదితర ప్రాంతాలు నీటమునిగాయి. చావులమదుం వంతెన కింద వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా గాలుల కారణంగా అనేకచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగరం లోని కొండవాలు ప్రాంతాల్లో నివాసం వుంటున్న ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. మట్టి, రాళ్లుతోపాటు కొండచరియలు  విరిగిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే రాత్రి 11 గంటల వరకు నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.