నాగపట్టినం స్ట్రాంగ్‌రూంపై డ్రోన్‌ కెమెరా !

ABN , First Publish Date - 2021-04-21T16:30:31+05:30 IST

నాగపట్టినంలో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంపై డ్రోన్‌ కెమెరా ఎగరటం మరో వివాదానికి కారణమైంది. దీంతో అక్కడున్న ప్రతిపక్షాలకు

నాగపట్టినం స్ట్రాంగ్‌రూంపై డ్రోన్‌ కెమెరా !

- ముగ్గురు చెన్నైవాసుల అరెస్టు 

- విరుదాచలంలో లారీ సంచారం 

- కంటైనర్లే ఎందుకొస్తున్నాయి? 

- ఈసీకి కమల్‌ ఫిర్యాదు


చెన్నై: నాగపట్టినంలో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంపై డ్రోన్‌ కెమెరా ఎగరటం మరో వివాదానికి కారణమైంది. దీంతో అక్కడున్న ప్రతిపక్షాలకు చెందిన ఏజెంట్లు, నేతలు ఎన్నికల పరిశీలకులతో  వాగ్వివాదానికి దిగడం ఉద్రిక్తతకు కారణమైంది. మరోవైపు కడలూరు జిల్లా విరుదాచలం స్ట్రాంగ్‌ రూం వద్ద ఓ భారీ కంటైనర్‌ ఆగడం దుమారం రేపుతోంది. దీంతో స్ట్రాంగ్‌ రూంల వద్దకు కంటైనర్లే ఎందుకొస్తున్నాయో చెప్పాలంటూ మక్కల్‌నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌ ఈసీని నిలదీశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు అందజేశారు. నాగపట్టినం సమీపంలోని కెత్తి ప్రాంతంలోని ఇజీఎస్‌ పిళ్లై ప్రైవేటు కళా శాలలో నాగపట్టినం, కీళ్‌వేలూరు, వేదారణ్యం శాసనసభ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున స్ట్రాంగ్‌ రూములున్న భవనంపై అనుమానాస్పదంగా ఓ డ్రోన్‌ ఎగిరింది. దానిని గమనించిన డీఎంకే సహా ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన ఏజెంట్లు భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న నాగపట్టినం డీఎంకే జిల్లా కార్యదర్శి గౌతమన్‌ సహా ఆ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శరవణన్‌ పర్యవేక్షణలో పోలీసులు ఆ డ్రోన్‌ కెమెరాను ఎగురవేసిన చెన్నైకి చెందిన కుమార్‌, సురేష్‌కుమార్‌, బాలాజీ లను అరెస్టు చేసి నాగూరు పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. వారి నుంచి డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే జిల్లా శాఖ కార్యదర్శి గౌతమన్‌, కీళ్‌వేలూరు సీపీఎం అభ్యర్థి నాగై మాలి తదితరులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.  


విరుదాచలంలో... : కడలూరు జిల్లా విరుదాచలం స్ట్రాంగ్‌రూం వద్ద అనుమానాస్పద రీతిలో ఓ కంటైనర్‌ లారీ నిలిచి వుండటం పట్ల అభ్యర్థుల ఏజెంట్లు, పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్‌లో ఏముందో  చూపాలంటూ ధర్నాకు దిగారు. విరుదాచలం, తిట్టక్కుడి శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు విరుదాచలం కొలంజియప్పర్‌ ఆర్ట్స్‌ కళాశాల స్టాంగ్‌ రూమ్‌లో భద్ర పరిచారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆ కౌంటింగ్‌ కేంద్రానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఓ  కంటైనర్‌ లారీ ఆగింది. అది గమనించిన అభ్యర్థుల తరఫు ఏజెంట్లు, పార్టీల నాయకులు ఎన్నికల భద్రతా విభాగం అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ కంటైనర్‌ లారీని అక్కడి నుంచి పుదుకుప్పం ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విరుదాచలం కాంగ్రెస్‌ అభ్యర్థి రాధాకృష్ణన్‌, తిట్టక్కుడి డీఎంకే అభ్యర్థి గణేశన్‌ నాయకత్వంలో రెండు పార్టీల కార్యకర్తలు పుదుకుప్పం ప్రాంతానికి వెళ్ళి ఆ లారీని చుట్టుముట్టారు. ఆ లారీలో ఏముందో చూడాలని పోలీసులకు కోరారు. సమాచారం అందుకున్న విరుదాచలం సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌ హుటాహుటిన అక్కడికి చేరుకుని కంటైనర్‌  డ్రైవర్‌ను విచారించగా ఆ లారీ పొల్లాచ్చి నుంచి చెన్నై హార్బర్‌కు వెళ్తోందని, ఆ లారీలో కొబ్బరి నార విదేశాలకు ఎగుమతి చేయడానికి తీసుకెళ్తున్నారని తెలుసుకున్నారు. ఆ కంటైనర్‌లారీలో కొబ్బరి నారల లోడు ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు ధ్రువీకరించి లారీ తలుపులకు సీలుపెట్టారని, వాటిని తెరిచే అధికారం తమకు లేదని తెలిపారు. ఈ విషయాన్ని కస్టమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశామని, ఆ అధికారులు వచ్చిన తర్వాత కంటైనర్‌ లారీ తలుపులు తెరుస్తారన్నారు. అయినా అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు ఆ లారీని అక్కడి నుంచి తరలించకూడదంటూ ధర్నాకు దిగారు. దీంతో ఆ కంటైనర్‌  వద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.


స్ట్రాంగ్‌రూంల వద్దకు కంటైనర్లే ఎందుకొస్తున్నాయి?

ఈవీఎంలను పర్యవేక్షించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఆరోపించారు. సచివాలయం లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహును మంగళ వారం కలిసిన కమల్‌హాసన్‌ ఫిర్యాదు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమల్‌ మీడియాతో మాట్లాడుతూ, స్ట్రాంగ్‌రూంల్లో సీసీ కెమెరాలు మరమ్మతుకు గురికావడం, కేంద్రాల్లోకి రాత్రి వేళల్లో కంటైనర్లు వచ్చి వెళ్లడం, అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించడం పలు సందేహా లకు తావిస్తుందన్నారు. ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద తగిన భద్రత చేపట్టి ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఇప్పటికే 30 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదని, ఇలాంటి సంఘటనలు కొనసాగితే ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం లేకుండాపోతుందని ఆయన అన్నారు.

Updated Date - 2021-04-21T16:30:31+05:30 IST