నాగపంచమి

ABN , First Publish Date - 2020-07-24T08:40:54+05:30 IST

సకల చరాచరకోటిని పరమాత్మ స్వరూపంగా భావించి పూజించే విధానం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్యగా భాసిల్లుతోంది.

నాగపంచమి

సకల చరాచరకోటిని పరమాత్మ స్వరూపంగా భావించి పూజించే విధానం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్యగా భాసిల్లుతోంది. చెట్టు, పుట్ట, గట్టు, రాయి, రప్ప.. ఇలా వస్తుస్వరూపాలన్నీ మనకు పరమేశ్వరరూపాలే. విషజంతువులుగా పరిగణించే సర్పాలను సైతం మనం దైవాలుగా కొలుస్తాం. ఆదిదేవుడైన పరమశివుడు పన్నగాలనే హారాలుగా దాల్చి ఉండటం, వేయి శిరస్సుల ఆదిశేషుడిపై విష్ణువు శయనించడం ఇందుకు కారణం. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని కంటికి రెప్పగా కాచుకొనే హరిహరులే సర్పజాతికి ప్రముఖ స్థానాన్ని కలగజేసి అవనికి ఆదర్శంగా నిలచినందువల్లనే నాగులను ఆరాధించటం ప్రజలకు పరిపాటి అయింది. ప్రత్యేకించి రెండు సందర్భాల్లో నాగులను మనం పూజిస్తాం. ఒకటి నాగుల చవితి. రెండోది నాగపంచమి.


శ్రావణమాసే పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతి

ద్వారస్యో భయతో లేఖ్యాగోమయేన విషోల్బణా:

పూజయే ద్విధివ ద్వీరలాజై: పంచామృతై: స్సహ

విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచశ్రీశ్రీ


శ్రావణ శుద్ధ చవితినాడు గృహాల ద్వారబంధాలకు ఇరువైపులా కిరువైపులా గోమయంతో అలికి, ఉపవాసం ఆచరించి పంచమి నాడు (మరునాడు) బంగారు, వెండి, కర్ర లేక మట్టితోగాని 5 పడగలపామును తయారు చేయించి పంచామృతంతో అభిషేకించాలి. పసుపుతోగానీ, చందనంతోగానీ 5 తలల నాగు చిత్రపటాన్ని గీచి జాజి, సంపెంగ, గన్నేరు మొదలుగా గల పుష్పాలతో భక్తిభావంతో పూజించి పాలు పాయసం నివేదించాలి. ఈ నియమాన్ని పార్వతీ మాతకు పరమేశ్వరుడు తెలిపినట్లు స్కాందపురాణం చెబుతోంది. నాగపంచమి సందర్భాన నాగ అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామ పారాయణం చేయాలి. ‘‘ఓం నాగరాజాయనమః’’ అనే మంత్రాన్ని 108 పర్యాయాలు జపించాలి. నాగేంద్రుడిని పూజించి పుట్టలో పాలుపోయాలి. నాగపంచమి వచ్చే శ్రావణ మాసంలో భూమిని, పుట్టలను తవ్వడం, చెట్లను నరకడం నిషేధంగా చెబుతారు.


పైర్లను నాశనం చేసే క్రిమికీటకాదులను, భూమిలో రంధ్రాలు చేసి అందులో జీవించే విషపురుగులను భక్షించడం ద్వారా నాగులు పంటలను కాపాడతాయి. సర్పారాధన చేసేవారి వంశం తామరతంపరగా వర్థిల్లుతుందంటారు పెద్దలు. ఈ పండుగనాడు ‘‘కర్కోటకస్య నాగస్య’’ అనే మంత్రాన్ని చదివితే కలి దోష నివారణ కలుగుతుందని శాస్త్రప్రవచనం. గ్రహదోషాలున్నవారు రాహుకేతువులను పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే.. యోగసాధనలో కుండిలినీ శక్తిని చుట్టలు చుట్టుకున్న పాముతో పోల్చుతారు. కుండలినీ శక్తిని ప్రేరేపించి మూలాధారం నుండి సుషుమ్న నాడిద్వారా బ్రహ్మరంధ్రం వరకు పయనింపచేయడం యోగసాధనగా గుర్తింపబడింది. అది సహస్రారాన్ని చేరుకోవడం వల్ల  జ్ఞానంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని ఆత్మతత్వవేత్తలు చెబుతారు. ఇలా నాగులు భారతీయుల జీవితాలతో ఎన్నోరకాలుగా ముడిపడి ఉన్నాయి కాబట్టే వాటిని పూజిస్తున్నాం.


                                                                

                                                       - వల్లూరు చిన్నయ్య


Updated Date - 2020-07-24T08:40:54+05:30 IST