Nagalandలో 15కు పెరిగిన మృతుల సంఖ్య, నేడు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-12-06T15:42:47+05:30 IST

నాగాలాండ్‌లో భద్రతా దళాలు జరిపి కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య సోమవారం నాటికి 15కి పెరిగింది...

Nagalandలో 15కు పెరిగిన మృతుల సంఖ్య, నేడు కర్ఫ్యూ

కోహిమా : నాగాలాండ్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య సోమవారం నాటికి 15కి పెరిగింది. శనివారం రాత్రి నాగాలాండ్‌లోని మోన్ జిల్లా పరిధిలోని ఓటింగ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్‌ జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. ఈ ఘటన తర్వాత సోమవారం కర్ఫ్యూ విధించారు. బొగ్గుగని కార్మికులను తిరుగుబాటుదారులుగా భావించిన ఆర్మీ పికప్ వ్యాన్ పై కాల్పులు జరిపింది. మోన్ జిల్లాలో సోమవారం 144 సెక్షన్ ను విధించారు.కాల్పుల ఘటన కారణంగా మొబైల్ ఇంటర్నెట్, బల్క్ మెసేజింగ్ సేవలు కూడా నిలిపివేశారు.కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆర్మీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 


ఈ ఘటనపై అత్యున్నత స్థాయిలో విచారణ జరుపుతున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్మీ విభాగం వివరించింది. తిరుగుబాటు దారుల కదలికలపై తమకు అందిన విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్లాన్ చేశామని, కాని దురదృష్ట వశాత్తూ పౌరులు మృతి చెందారని ఆర్మీ తెలిపింది.నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో కాల్పుల ఘటన తర్వాత ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి.నాగాలాండ్‌లోని అత్యంత ప్రభావవంతమైన సంస్థ నాగా మదర్స్ అసోసియేషన్  కూడా ఈ సంఘటనను ఖండించింది. 


ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘనలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేసింది.నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ​​సోమవారం ప్రభావిత జిల్లాను సందర్శించనున్నారు. ఈ సంఘటన ఖండించదగినదని,దీనిపై ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేస్తుందని సీఎం చెప్పారు.ఈ కాల్పుల సంఘటన తర్వాత కోహిమా హార్న్‌బిల్ ఫెస్టివల్ రద్దు చేశారు.నాగాలాండ్ కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలని పలువురు ప్రతిపక్ష ఎంపీలు సోమవారం నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం కోరారు.



నాగాలాండ్‌లో శనివారం సాయంత్రం పౌరులపై కాల్పులు జరిపి 15 మంది గ్రామస్థుల మృతికి కారణమైన భారత సైన్యానికి చెందిన 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌పై సుమోటోగా నాగాలాండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కాల్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు సైనికులను కోరారు. 

Updated Date - 2021-12-06T15:42:47+05:30 IST