Jul 24 2021 @ 19:59PM

యండమూరి చిత్ర ఓపెనింగ్‌కి హాజరైన మెగాబ్రదర్

ఇటీవల యండమూరి వీరేంద్రనాధ్, మెగాబ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. తాజాగా యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్ర ఓపెనింగ్ ఫంక్షన్‌కు నాగబాబు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక చిత్ర ఓపెనింగ్ విషయానికి వస్తే.. రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకుడిగా ‘నల్లంచు తెల్లచీర’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇటీవలే గుమ్మడికాయ కొట్టిన టీమ్ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘అతడు-ఆమె-ప్రియుడు’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘మర్యాద రామన్న’ సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా.. మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ‘మాతృదేవోభవ’ ఫేమ్ అజయ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అంబికా రాజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా నటుడిగా నాగబాబు ప్రస్థానం తన ‘రాక్షసుడు’ చిత్రంతోనే మొదలైందని యండమూరి గుర్తు చేసుకోగా.. భారతదేశం గర్వించదగ్గ గొప్ప రచయితల్లో ఒకరైన యండమూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అతడు..ఆమె.. ప్రియుడు’ చిత్రం అసాధారణ విజయం సాధించి.. దర్శకుడిగానూ ఆయన పేరు మారుమ్రోగాలని నాగబాబు, కోదండరామిరెడ్డి, అజయ్ కుమార్ ఆకాంక్షించారు.