నాడు - నేడు.. ఎప్పటికో?

ABN , First Publish Date - 2022-07-16T05:42:23+05:30 IST

బడులు గంటలు మోగి వారమవుతుంది. ఈ పాటికి సిద్ధం కావాల్సిన పాఠశాలల్లో ఇంకా నాడు - నేడు పనులు సాగుతున్నాయి.

నాడు - నేడు.. ఎప్పటికో?
పిడుగురాళ్ల విద్యాశాఖ కార్యాలయం

బడులు తెరిచి వారమైనా పూర్తికాని పనులు 

ఒకవైపు సాగుతున్న పనులు.. మరోవైపు తరగతులు

విద్యార్థులకు అందని పుస్తకాలు.. కుంటుపడుతున్న బోధన 

 

పిడుగురాళ్ల, జూలై 15: బడులు గంటలు మోగి వారమవుతుంది. ఈ పాటికి సిద్ధం కావాల్సిన పాఠశాలల్లో ఇంకా నాడు - నేడు పనులు సాగుతున్నాయి. బడులు తెరిచేప్పటికి సిద్ధం చేయడంపై విద్యాశాఖ దృష్టి సారించినా అనుకున్న ఫలితాలు రాలేదు. పనుల పరిస్థితి ఇలా ఉంటే పుస్తకాలు విద్యార్థుల చేతికి అందక బోధన కూడా కుంటుపడుతుంది. పూర్తికాని పనులతో కొన్ని పాఠశాలల తరగతి గదుల్లో సిమెంట్‌, పాత సామగ్రితో నిండిపోయి ఉన్నాయి.    సాగుతున్న పనుల మధ్యే తరగతుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోదించాల్సి వస్తోంది. పనుల కారణంగా ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాడు-నేడు రెండో విడతలో గురజాల నియోజకవర్గంలో 224 ప్రభుత్వ పాఠశాలలకు 87 పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో పనులు ప్రారంభమే కాలేదు. ఆయా పాఠశాలల్లో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. నాడు-నేడు రెండో దశ కింద అన్ని మండలాల్లో ఎంపికైన పాఠశాలల్లో ఇప్పుడిప్పుడే శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో సిమెంట్‌ పనులు జరుగుతూనే ఉన్నాయి.


పుస్తకాల సరఫరా అరకొరగానే

నేటికీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సరఫరా అరకొరగానే అందాయి. గురజాల నియోజకవర్గంలో సుమారు 2.26 లక్షల పైగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని గుర్తించారు.  పది రోజుల క్రితం మండల విద్యావనరుల కేంద్రానికి కొన్ని పాఠ్య పుస్తకాలు దిగుమతి అయ్యాయి. అవి కూడా సగం సగమే వచ్చాయని ఉపాధ్యాయులు గుర్తించారు. 8, 2వ తరగతికి ఇంగ్లీషు, తెలుగుమీడియంలకు సంబంధించిన పుస్తకాలు సరఫరా కాలేదు. అలాగే 4వ తరగతికి సంబంధించి ఇంగ్లీషు రీడర్‌, లెక్కల వర్క్‌బుక్‌లు మాత్రమే ఆయా మండలాలకు కొన్నే అందాయి.   


మొక్కుబడిగా ఒకరికో ...ఇద్దరికో.. 

ప్రారంభమైన రోజున మొక్కుబడిగా పాఠశాలలో నలుగురైదుగురు విద్యార్థులకు మాత్రమే కొన్ని కొన్ని పుస్తకాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. పుస్తకాలు ఉంటేనే అంతంతమాత్రంగా సాగే బోదన అసలు పుస్తకాలే లేకుండా  ఎలా బోదించాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా ఎలా బోధించాలో తెలియక  ఉపాధ్యాయవర్గాలు అయోమయంలో పడిపోతున్నాయి. మరో వైపు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లలకు పస్తకాలు, బ్యాగులు ఎందుకు ఇవ్వలేదని ఉపాధ్యాయులను నిలదీస్తున్నారు. సగం పుస్తకాలతోపాటు యూనిఫాం, బూట్లు కూడా రాకపోవడంతో కొందరు విద్యార్థులు వివిధ రకాల డ్రస్సులతో కొందరు చెప్పులు లేకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. పిడుగురాళ్ల సమీపంలోని జానపాడు పరిధిలో 180 మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో నలుగురు విద్యార్థులకే బ్యాగులు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు కలిగిన పాఠశాలగా గుర్తింపు పొందిన పిడుగురాళ్ల జడ్పీ హైస్కూల్లోనూ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అందక వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.


Updated Date - 2022-07-16T05:42:23+05:30 IST