తరగతింతేనా!

ABN , First Publish Date - 2022-06-29T06:20:56+05:30 IST

అంతన్నారు.. ఇంతన్నారు.. తీరా చూస్తే ఏమీ లేకుండా చేసేశారు..

తరగతింతేనా!
రాజమహేంద్రిలో ఒక స్కూల్‌ భవనంపై పిల్లర్లకు సిద్ధం చేసిన మెటీరియల్‌

19 శాతమే పూర్తయిన నాడు నేడు పనులు

జిల్లా వ్యాప్తంగా కదలని రెండో దశ పనులు

పాఠశాలల్లో ఇప్పుడిప్పుడే ఆరంభం

మరో వారం రోజుల్లోనే బడులు

చదువుల చెప్పిస్తారా.. పనులు చేస్తారా?

442 స్కూళ్లకు రూ. 161 కోట్లు అంచనా

156 బడుల్లో 811 అదనపు గదులు

ఇంకనూ పిల్లర్ల దశ దాటని వైనం

నిర్లక్ష్యంపై కలెక్టర్‌ మాధవీలత ఆగ్రహం


అంతన్నారు.. ఇంతన్నారు..   తీరా చూస్తే ఏమీ లేకుండా చేసేశారు.. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎయిడెడ్‌ స్కూళ్ల విలీనం చేసేశారు.. అదనపు తరగతి గదులు చూస్తే ఇంకా నిర్మాణమే ప్రారంభమే కాలేదు..జిల్లా వ్యాప్తంగా కేవలం  19 శాతం పనులు మాత్రమే జరిగాయి. పెరవలిలో అయితే మరీ దారుణం.. ఇప్పటి వరకూ ఒక్క శాతమే జరిగాయి.. నాయకులు చేసే ప్రసంగాలు చూస్తే మాత్రం నాడు నేడు పనులు వేగంగా జరిగిపోతు న్నాయనిపిస్తుంది.. తీరా క్షేత్రస్థాయిలో చూస్తే నిధులున్నా  పనులు కదలక నాడు నేడు ఉత్తి మాటలేనా అనిపిస్తోంది.. 


    (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 నాడూ నేడూ అన్నారు.. ఎయిడెడ్‌ స్కూళ్లను మూసేసి ప్రభుత్వ పాఠశాలలో కలిపారు. ఇవాళ పాఠశాలలు అదనపు గదులు పూర్తికాలేదు. విద్యార్థులకు సరిపడా  తరగతి గదులు లేవు. ఈ నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.  మంగళవారం నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారు. మరి ఈసారి విద్యాసంవత్సరం గడిచేదెలా? అసలే కోవిడ్‌ వల్ల గత ఏడాది వరకూ పాఠశాలల ముఖం చూడని విద్యార్ధులకు ఈసారైనా పాఠాలు సక్రమంగా సకాలంలో అందించగలరా? వాస్తవానికి నాడు-నేడూ రెండో పనులు వేసవి సెలవులోనే పూర్తి చేసి, పూర్తి సౌకర్యాలతో  విద్యాసంవత్సరం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హడావిడిగా కొన్ని పనులు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఒక పక్క తరగతి గదుల కొరత, మరో పక్క పాఠశాలలకు విద్యార్థులు హాజరవుతారు.. దీంతో పాఠాలు చెబుతారా? పనులు చేయిస్తారా అనేది సమస్యగా మారింది. ఒక పాఠాలు చెబుతూనే పనులు చేయిస్తామంటే పిల్లలు స్కూల్‌లో ఉండగా పనులు చేయడం సాధ్యమేనా? పైగా వానాకాలం .. పనులు ఎలా పరుగెడతాయి.  మరి ఈపరిస్థితికి కారణాలేంటో చూద్దాం. 


442 పాఠశాలల్లో పనులు


 జిల్లాలో 564 పాఠశాలల్లో పనులు చేయాల్సి ఉంది. ఇంత వరకూ 442 పాఠశాలల్లో పనులకు ప్రతిపాదనలు వేశారు.  వీటికి రూ.161 కోట్లు అవసరం. కానీ ఇంత వరకూ ప్రభుత్వం  విడుదల చేసిన సొమ్ము కేవలం రూ.24 కోట్లు. ఇందులో ఖర్చుచేసింది కూడా తక్కువే. ఈ సొమ్ములు రావడం జాప్యం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. జిల్లాలోని 156 స్కూళ్లలో 811 అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. వీటికి రూ.97.32 కోట్లు మంజూరు చేశారు. ఈ పనుల్లో కొన్ని పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల మెటీరియల్స్‌ సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కాంట్రాక్టర్లకే అప్పగించారు. మిగతా పాఠశాలల్లో పది కాంపోనెంట్స్‌ పనులు చేయాల్సి ఉంది. వీటికి సుమారు రూ.40 కోట్లు కేటాయించారు. ఈ పనులు చాలా చోట్ల మొదలు కాలేదు. ఇతర పనుల ఊసే లేదు.  పనులకు అవసరమైన  సిమ్మెంట్‌, స్టీల్‌, ఇసుక వంటివి ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కానీ దీనిలో కూడా స్పష్టత లేదు. ప్రభుత్వ స్టీల్‌ కాస్త తక్కువ ధరకు వస్తుంది. కానీ కొందరు మీరే స్టీల్‌ కొనుక్కోవాలని కమిటీలకు చెబుతున్నట్టు సమాచారం. ఇంతవరకూ చాలా పాఠశాలలకు సిమ్మెంట్‌ ,స్టీలు సరఫరా కాలేదు.పనులు చేయడానికి కమిటీలు సిద్ధంగా ఉన్నా వీటి సరఫరా ఆలస్యం అవుతోంది.


 811 అదనపు గదులు


 జిల్లాలో 156 పాఠశాలలో 811 అదనపు గదులు మంజూరయ్యాయి. కొవ్వూరు నియోజకవర్గంలో 16 పాఠశాలల పరిధిలో 85 అదనపు తరగతి గదులకు (ఏసీఆర్‌),కు రూ.10.20 కోట్లు,గోపాలపురం నియోజకవర్గంలో 23 పాఠశాలలలో  140 ఏసీఆర్‌కు  రూ.16.80 కోట్లు, నిడదవోలులో 12 పాఠశాలల్లో 55 ఏసీఆర్‌లకు రూ.6.6 కోట్లు,  రాజమహేంద్రవరం రూరల్‌ 23 పాఠశాలల్లో 125 అదనపు గదులకు  రూ.15 కోట్లు, రాజమహేంద్రవరం సిటీలోని 20 పాఠశాలల్లో 84  అదనపు గదులకు రూ.10.08 కోట్లు,జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో 11 పాఠశాలల్లో 48 అదనపు గదులకు రూ. 5.76 కోట్లు, అనపర్తి 14 పాఠశాల్లో 69 అదనపు గదులకు రూ. 8.28 కోట్లు, రాజానగరంలోని  37 పాఠశాలల్లో 205 అదనపు గదులకు రూ.24.60 కోట్లు కేటాయించారు. ఈ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు.


భవనాలపై షెడ్లు


గతంలో పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలాలలో అదనపు        గదుల భవనాలు నిర్మించేవారు. ఇవాళ  స్థలాన్ని వృఽథా చేయవద్దని చెబుతూ ఉన్న పాఠశాలల భవనాలపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతిచ్చారు.ఇక్కడ 1ప్లస్‌2 కు నిర్మించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పాఠశాల్లో చాలా వరకూ 1ప్లస్‌ 1 సామర్థ్యం గలవే.దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు చాలా భవనాలకు మరో అంతస్తు వేస్తే ప్రమాదమని తేల్చారు.ఈ నేపథ్యంలో అదనపు గదుల కోసం శ్లాబ్‌ భవనం మానేసి, ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనాలపై షెడ్లు నిర్మించనున్నారు. తుపాన్లు, భారీ వర్షాల వంటి సమయాలలో భవనాలమీద షెడ్లకు రక్షణ ఉండదు. మరి ఎందుకో అధికారులు షెడ్ల నిర్మాణాన్ని సిఫారసు చేశారు. రాజమహేంద్రవరంలో చాలా భవనాలపై షెడ్లు నిర్మించనున్నారు.ప్రకాశ్‌నగర్‌ రౌండ్‌పార్కు వద్ద మునిసిపల్‌ స్కూల్‌పై ఓ షెడ్‌ నిర్మించడానికి నిర్ణయించారు. 


పనులపై కలెక్టర్‌ మాధవీలత ఆగ్రహం


 జిల్లాలో నాడు-నేడు పనులపై కలెక్టరేట్‌ మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 564 పాఠశాలలకు 442 పాఠశాలలకు  98 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌  ఇచ్చినా..ఆ స్థాయిలో ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు.  కేవలం 19 శాతం మాత్రమే పనులు చేయడం ఏంటని ఆగ్రహించారు. మొక్కుబడిగా పనులు ప్రారంభించి 90 శాతం పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని చెప్పడం ఏంటని అధికారులను నిలదీశారు. బిక్కవోలు మండలంలో  39.31 శాతం ఖర్చుచేయగా, అత్యంత తక్కువగా పెరవలిలో కేవలం ఒక్క శాతం మాత్రమే పని కావడంపై వివరణ కోరారు. వచ్చే సోమవారం నాటికి ప్రగతి కనిపించాలన్నారు.


Updated Date - 2022-06-29T06:20:56+05:30 IST