నాడు - నేడులో అవినీతి!

ABN , First Publish Date - 2021-07-24T06:41:51+05:30 IST

నాడు - నేడులో అవినీతి!

నాడు - నేడులో అవినీతి!
మధ్యలో వదిలేసిన నిర్మాణ పనులు

ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాలలో పనులు

   చేపట్టకుండానే  రూ. 5 లక్షల మేర బిల్లులు

  లెక్క తేల్చిన స్కూల్‌ యాజమాన్య కమిటీ

 ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఇష్టారాజ్యంపై నిలదీత

ప్రొద్దుటూరు (కంకిపాడు), జూలై 23 : ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాల అభివృద్ధిలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు దోచేసుకుంటారన్న అనుమానంలతో విద్యార్థుల తల్లిదండ్రులకే బాధ్యతలు అప్పగించారు. అయినా అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోయారు.  దాదాపు రూ. 10 లక్షల మేరకు అవినీతి జరిగిందంటూ స్కూల్‌ యాజ మాన్య కమిటీ సభ్యులే ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ యాజమాన్య కమిటీ చైర్మన్‌ పాములు, ఇంజినీరింగ్‌ అధికారులు, యాజమాన్య కమిటీ సభ్యుల మధ్య సమావేశం నిర్వహించారు. అవినీతిపై విచారణ చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. 

అభివృద్ధి పేరుతో  

 ప్రొద్దుటూరు జెడ్పీ పాఠశాలను నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రూ. 45,32,149తో అభివృద్ధికి అంచనాలను విద్యా శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు రూపొందించారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. వీటికి తోడు ఇతర మండలాల్లో మిగిలిన రూ. 4 లక్షలను కూడా ఇదే పాఠశాలకు ఉన్నత విద్యా శాఖ అధికారులు కేటాయించారు. ఈ మొత్తం పనులను స్కూల్‌ యాజమాన్య కమిటీ చైర్మన్‌ పాములు చేపట్టారు.  అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు త్వరలో పదవి విరమణ చేయనున్నారు. దీంతో  పూర్తి బాధ్యతలను పాములకు అప్పగించారు. దీంతో ఆయన ఇష్టానుసారంగా బిల్లులు చూపెట్టి అవినీతికి పాల్పడినట్టు పాఠశాల కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

తప్పుడు బిల్లులు సృష్టించి

 గత ఏడాది కాలంగా జెడ్పీ పాఠశాల్లో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టారు. తప్పుడు బిల్లులు సృష్టించి సుమారు 5 లక్షలు, బిల్లులు లేకుండా సుమారు మరో రూ. 5 లక్షల మేరకు అవినీతికి పాల్పడ్డాడంటూ యాజమాన్య కమిటీ సభ్యులు నేరుగా ఆరోపిస్తున్నారు. స్కూల్‌లో మొత్తం 5 వేల ఇటుక రాళ్లను కూడా వాడకుండానే 20 వేల ఇటుక రాయి కొనుగోలు చేసినట్లు బిల్లులు ప్రవేశ పెట్టారు. తలుపులకు పీవీసీ ప్లైవుడ్‌ 14 షీట్స్‌ కొనుగోలు చేస్తే 18 కొనుగొలు చేసినట్లు, అవి కూడా రూ. 3500 ఉంటే రూ. 6500 తప్పుడు బిల్లులు పెట్టారంటూ అరోపణులు గుప్పిస్తున్నారు. 

వాటర్‌ గ్రిల్‌కు రూ. 70 వేలు, ఇతరాత్ర సామాగ్రిపై లక్షల్లో అవినీతి జరిగిందంటూ యాజమాన్య కమిటీ సభ్యులు చైర్మన్‌ను నిలదీశారు.  

పైపైనే మెరుగులు

 పాఠశాల మెరుగు దిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.  పాఠశాల గదులు బయట రంగులు వేశారు. లోపల రంగులు మరిచారు. మరో పక్క పాఠశాలలో అవరణ అంతంత మాత్రంగానే ఉంది. పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదు, కాని నిధులు అయిపోయాయి. కాంట్రాక్టర్లు కూడా రామంటూ పనులకు స్వస్తి చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులు కూడా ఖర్చు అయిపోయాయి. అయినా అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలేదు. 

ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి

ప్రొద్దుటూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధిపై ఉన్నతస్థాయి కమిటీని వేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. లేకుంటే కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని స్కూల్‌ యాజమాన్య కమిటీ సభ్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-24T06:41:51+05:30 IST