నాడు సరే.. నేడెందుకు?

ABN , First Publish Date - 2022-05-05T05:31:48+05:30 IST

నాడు సరే.. నేడెందుకు?

నాడు సరే.. నేడెందుకు?

ప్రశ్నార్థకంగా నాడు-నేడు రెండో విడత పనులు

మూసివేతకు సిద్ధంగా ఉన్న పాఠశాలల అభివృద్ధా?

50 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల విలీన ప్రతిపాదనలు

ఆ స్కూళ్లలో అభివృద్ధి పనులపై విమర్శలు

రూ.100 కోట్లతో అంచనాలు

చిన్నపాటి పనులూ మంత్రి, ఎమ్మెల్యేలే ప్రారంభించాలట..!


మొదటి విడత నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొవ్వ మండలంలోని అవురుపూడిలోని ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు చేశారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో సమీపంలోని మంత్రిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో అవురుపూడి విద్యార్థులను విలీనం చేశారు. దీంతో అభివృద్ధి పనులు జరిగినా ఆ పాఠశాల మాత్రం అలాగే ఉండిపోయింది. తమ గ్రామంలో పాఠశాలను కొనసాగించాలని కోరుతూ గ్రామస్థులు పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్‌కు, డీఈవో తాహెరా సుల్తానాకు వినతిపత్రాలు అందజేసినా లాభం లేదు.

తాజాగా రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభమయ్యాయి. అలాగే, పాఠశాలల విలీన రెండో విడతలో 50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో కలపాలని చూస్తున్నారు. విద్యార్థులు లేని పాఠశాలలను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో నాడు-నేడు పనులు చేసి ఉపయోగమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ప్రాథమిక పాఠశాలల్లో రెండో విడత నాడు-నేడు పనులు ఎంతమేరకు అక్కరకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నాడు-నేడు రెండో విడత ద్వారా జిల్లాలోని 256 పాఠశాలల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. నూతన విద్యావిధానం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల దూరంలోని 163 ప్రాఽథమిక పాఠశాలలను విలీనం చేశారు. వచ్చే ఏడాది నాటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఇప్పటికే మ్యాపింగ్‌ చేశారు. 10 మందిలోపు విద్యార్థులున్న 74 పాఠశాలలను రెండు నెలల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. మొదటి విడతలో ఈ పాఠశాలల గుర్తింపును రద్దు చేశారు. అక్కడున్న విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు పంపారు. రెండో విడతలో 50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల జాబితాలను సిద్ధం చేయాలని ఎంఈవోలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు లేని పాఠశాలలను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో రెండో విడత నాడు-నేడు పనులను ప్రాథమిక పాఠశాలల్లో చేసి ఉపయోగమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. 

256 పాఠశాలలు.. రూ.100 కోట్ల అంచనాలు..

రెండో విడత నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాల్లోని 256 ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు నిర్మించకుండా అదనపు సౌకర్యాలు మాత్రమే కల్పించేలా అంచనాలు రూపొందించారు. ఒక్కో ప్రాథమిక పాఠశాలకు కనీసం రూ.12 లక్షల వరకు నిధులు కేటాయించారు. పాఠశాలలో ఉన్న అవసరాలకు అనుగుణంగా ప్రహరీల నిర్మాణం, రంగులు వేయడం, బెంచీలు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వంటి పనులు చేయాలని నిర్ణయించారు. మూసివేసేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాలల్లో ఇంత ఖర్చుచేసి పనులు చేసేందుకు అంచనాలు తయారుచేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

మంత్రి కోసం పనుల ప్రారంభం వాయిదా

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ప్రస్తుతం ఒకే మంత్రిగా జోగి రమేశ్‌ ఉన్నారు.  సోమవారం నుంచి నాడు-నేడు రెండో విడత పనులు ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. పెడన మండలంలోని రెండు ప్రాథమిక పాఠశాలలకు రూ.12 లక్షల చొప్పున నాడు-నేడు పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులు ప్రారంభించడానికి ఆ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ప్రయత్నించగా, మంత్రి రాకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ ఆయన పీఏ అడ్డు చెప్పారు. దీంతో ఇక్కడ సోమవారం జరగాల్సిన నాడు-నేడు పనుల ప్రారంభం నిలిచిపోయింది. మంత్రి జోగి రమేశ్‌ ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడే పనులు ప్రారంభమవుతాయని వైసీపీ నాయకులు, మంత్రి పీఏ తేల్చేశారు. పాఠశాలల్లో పనిచేసే టీచర్లు అధికశాతం మంది ఇన్విజిలేటర్లుగా డ్యూటీలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కొన్నిచోట్ల మహిళా టీచర్‌ ఒకరే ఉంటున్నారు. ఈ టీచర్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, సమ్మెటివ్‌-1 వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టే పనిలో ఉంటున్నారు. పనుల ప్రారంభోత్సవానికి ప్రజాపత్రినిధులను ఆహ్వానించడానికి మహిళా టీచర్లకు కష్టంగా ఉంటోంది. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామ సర్పంచ్‌లు లేదా మండలస్థాయి ప్రజాప్రతినిధులతో ప్రారంభించాల్సిన పనులను ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చే వరకు ఆపడం గమనార్హం. 

Read more