Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాడు-నేడు అంతా మోసం

పనులన్నీ కాంట్రాక్టర్లకే

బిల్లులు చెల్లించకుంటే స్కూల్‌ ఎన్నికల బహిష్కరణ

వీడియో ద్వారా హెచ్చరించిన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌


ఆంధ్రజ్యోతి, ఒంగోలు: ‘రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న నాడు-నేడు పనుల నిర్వహణలో పారదర్శకత లేదు. అంతా మోసం జరుగుతోంది. ఇక్కడ కూడా కాంట్రాక్టర్లదే రాజ్యం నడుస్తోంది. బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగడం లేదు’ అని సాక్షాత్తూ అధికార వైసీపీకి చెందిన ఓ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ ఆరోపించారు. తనకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే ఈనెల 22వ తేదీ జరగనున్న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆ మేరకు ఆయన పంపిన వీడియో సందేశం ఆదివారం మధ్యాహ్నం నుంచి వైరల్‌ అవుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ ఆవిధంగా వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. 


ఎర్రగొండపాలెం నియోజకవర్గం గుర్రపుశాల ఎంపీపీ పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ బద్దెగం సుబ్బారెడ్డి ఆదివారం మధ్యాహ్నం వీడియో సందేశాన్ని బయటకు పంపారు. తనకు రావాల్సిన బిల్లులు రాని విషయాన్ని అందులో ప్రస్తావించారు. ఉన్నతాధికారులకు చివరకు తమ ఎమ్మెల్యే అయిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సమస్యను విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అలాగే ఆయన సీఎం జగన్‌ను ఉద్దేశించి మీరనుకున్నట్లు నాడు-నేడు పనుల్లో పూర్తి పారదర్శకత లేదని తెలిపారు. ఇక్కడా పనులన్నీ కాంట్రాక్టర్లే చేస్తున్నారని వాపోయారు. అందులో తాను చేసిన కొద్దోగొప్పో పనుల బిల్లులూ ఆగిపోయాయని తెలిపారు. ఆ బిల్లులు వెంటనే చెల్లించకపోతే ఈనెల 22వ తేదీ జరగనున్న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికను బహిష్కరిస్తానని స్పష్టం చేశారు.


ఈ సందేశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఈ వీడియో వైరల్‌ అవుతున్న విషయం తెలుసుకున్న అధికారులు సాయంత్రం నుంచి ఏదో ఒకరకమైన సమాచారంతో ఆయన ఆరోపణలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఆ మేరకు ఉన్నతాధికారుల అనుమతితో సోమవారం ఒక ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది. 

Advertisement
Advertisement