గుంటూరు: జనసేనపై తీవ్రంగా తప్పుడు ప్రచారం చేశారని, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో రాజీ ప్రసక్తే లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మన వంతు కృషే లక్ష్యమని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. రాజకీయాల్లో అందరికి అవకాశాలు ఇవ్వడమే జనసేన ఆశయమన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే పవన్‌ను కాపాడమని అర్థం కాదన్నారు. చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వారిని కాపాడమని పవన్ అడిగారని, ఇది అర్థంకాని మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. పనికిమాలిన వ్యక్తులను రెచ్చగొట్టి దాడులకు కారణమవుతున్నారని, పరిపాలన చేతగానప్పుడు ఇంట్లో కూర్చోవాలన్నారు. కరోనా సమయంలో జగన్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? అని ప్రశ్నించారు. తుపానులు వచ్చినప్పుడు జగన్ ఎక్కడని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.