Abn logo
Apr 11 2021 @ 17:28PM

అన్నిచోట్లా మేమే గెలుస్తాం: నడ్డా

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పశ్చిమబెంగాల్‌లో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని, అసోంలో పాలన కొనసాగిస్తామని, తమిళనాడులోని అధికార కూటమిలో కీలకంగా ఉంటామని చెప్పారు. పుదుచ్చేరిలో అధికారంలోకి రావడంతో పాటు, కేరళలో కీలక శక్తిగా నిలుస్తామని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి...ఇలా ఎన్నికలు ఏవైనా బీజేపీ ఒకేలా పోరాడుతుందని, తమ వాదనను ప్రజల ముందుకు బలంగా తీసుకువెళ్తుందని చెప్పారు.

బెంగాల్‌లో తమ ఓటమిని టీఎంసీ ఇప్పటికే ఒప్పుకుందని నడ్డా వ్యాఖ్యానించారు. కూచ్‌ బెహర్‌ ఘటనపై ఆయన మాట్లాడుతూ, ఆరోజు ఉదయం 7.30 గంటలకు ఆనంద్ బర్మన్ అనే కార్యకర్త ఓటు వేసేందుకు లైనులో నిలబడినప్పుడు అతనిపై కాల్పులు జరపడంతో అతను చనిపోయాడని, ఆ తర్వాత టీఎంసీ వర్కర్లు 'క్విక్ రెస్పాన్స్ టీమ్' ఆయుధాలను ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారని అన్నారు. నేరస్థులతో ప్రభుత్వం కుమ్మక్కవడం వల్లే బెంగాల్ హింస చోటుచేసుకుందనే విషయం నిరూపితమైందని అన్నారు. ''బెంగాల్‌లో మాత్రమే హింసా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? హోం మంత్రి ఎవరు? రాష్ట్ర శాంతిభద్రతల ఇన్‌చార్జిగా ఎవరున్నారు? వీటిన్నింటికి సమాధానం ఎవరు చెబుతారు?'' అని నడ్డా పరోక్షంగా మమతను ఉద్దేశించి ప్రశ్నించారు.

దుర్గాపూజ, సరస్వతి పూజలను టీఎంసీ ఆపిందని, రామజన్మభూమి ఆలయం భూమి పూజ రోజున కర్ఫూ విధించిందని, ఈ విషయాలను ఎవరు మరిచిపోగలరని నడ్డా ప్రశ్నించారు. బయట వాళ్లు బెంగాల్ వస్తున్నారంటూ మమత వ్యాఖ్యానించడం భారత రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీని కార్తకర్త, కార్యకర్తను పార్టీ నమ్మే స్థితి లేదని ఆ పార్టీపై నడ్డా విసుర్లు విసిరారు.

బాధ్యత లేని విపక్షం

కరోనా మహమ్మారి విషయంలో కాంగ్రెస్ బాధ్యత లేని విపక్షంగా వ్యవహరిస్తోందని నడ్డా విమర్శించారు. లాక్‌డౌన్ విధించినప్పుడు ప్రశ్నించిందని, పాక్షికంగా సడలించినప్పుడు మళ్లీ ప్రశ్నించిందని, పూర్తిగా ఎత్తివేస్తే ఎందుకు ఎత్తేశారని ప్రశ్నిస్తోందని అన్నారు.

Advertisement
Advertisement