మురళీధరన్‌ కారుపై దాడిని ఖండించిన బీజేపీ చీఫ్ నడ్డా

ABN , First Publish Date - 2021-05-06T23:36:02+05:30 IST

పశ్చిమ బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల...

మురళీధరన్‌ కారుపై దాడిని ఖండించిన బీజేపీ చీఫ్ నడ్డా

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో ‘‘టీఎంసీ ప్రేరేపిత’’ హింస తీవ్ర స్థాయిలో పెచ్చరిల్లిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు చెబుతున్న పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా పంచ్‌కూరి గ్రామంలో పర్యటించేందుకు ఇవాళ ఉదయం కేంద్ర విదేశాంగ సహాయమంత్రి మురళీధరన్ వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు కర్రలు, దుంగలతో వెంటపడుతూ ఆయన కారును ధ్వంసం చేశారు. దీంతో వెంటనే మంత్రి తన పర్యటనను కుదించుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం మురళీధరన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘టీఎంసీ గూండాలే నా కాన్వాయ్‌పై దాడి చేయించారు..’’ అంటూ ఆరోపించారు.


ఈ ఘటనపై నడ్డా స్పందిస్తూ.. ‘‘పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయి. ఒక కేంద్ర మంత్రి పైనే దాడి జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి?..’’ అని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ‘‘టీఎంసీ ప్రేరేపిత’’ హింస తీవ్ర స్థాయిలో పెరిగిందన్నారు. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయనీ.. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నారని నడ్డా ఆరోపించారు. 

Updated Date - 2021-05-06T23:36:02+05:30 IST