నడాల్ జోరు

ABN , First Publish Date - 2022-05-27T09:37:14+05:30 IST

క్లే కోర్ట్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రఫాతోపాటు మెద్వెదెవ్‌, టాప్‌ సీడ్‌ స్వియటెక్‌ కూడా ముందంజ వేశారు.

నడాల్ జోరు

మూడో రౌండ్‌కు రఫా, స్వియటెక్‌, మెద్వెదెవ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: క్లే కోర్ట్‌ కింగ్‌ రఫెల్‌ నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రఫాతోపాటు మెద్వెదెవ్‌, టాప్‌ సీడ్‌  స్వియటెక్‌ కూడా ముందంజ వేశారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 5వ సీడ్‌ నడాల్‌ 6-3, 6-1, 6-4తో కోరెంటీన్‌ మౌటెట్‌ (ఫ్రాన్స్‌)పై అలవోకగా నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లాముల్లో 300వ మ్యాచ్‌ గెలిచిన మూడో ఆటగాడిగా రోజర్‌ ఫెడరర్‌ (369), జొకోవిచ్‌ (325) సరసన నిలిచాడు.


రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ 6-3, 6-4, 6-3తో లాస్లో డిరే (సెర్బియా)పై, కాస్పర్‌ రడ్‌ (నార్వే) 6-3, 6-4, 6-2తో రుజువోరిపై, సిలిచ్‌ 4-6, 6-4, 6-2, 6-3తో ఫుసోవిచ్‌పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ అమ్మాయి స్వియటెక్‌  6-0, 6-2తో రిస్కే (అమెరికా)ను, 3వ సీడ్‌ బడోసా (స్పెయిన్‌) 7-5, 3-6, 6-2తో కాజా జువాన్‌ (స్లొవేనియా)ను, పారి 6-3, 6-3తో ఒసోరియా (కొలంబియా)ను ఓడించారు. ప్లిస్కోవా (చెక్‌) 2-6, 2-6తో జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో కంగుతింది. 

 

బోపన్న, సానియా జోడీల గెలుపు :

డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న-మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం 6-4, 6-1తో ఫ్రాన్స్‌కు చెందిన గోలుబెవ్‌-మార్టిన్‌పై గెలిచింది. కాగా, రామ్‌కుమార్‌ రామనాథన్‌-హంటర్‌ రీస్‌ జంట 3-6, 2-6తో నీల్‌-వెస్లీ జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా-లూసీ హ్రడెకా (చెక్‌) జంట 4-6, 6-2, 6-1తో జాస్మిన్‌-మార్టినా (ఇటలీ)పై నెగ్గింది. 

Updated Date - 2022-05-27T09:37:14+05:30 IST