Abn logo
Sep 23 2021 @ 00:23AM

నాదబ్రహ్మ

గోదావరి జీవనది మాత్రమే కాదు

పుణ్యనది కూడా

ఎందరెందరో

మహనీయుల జన్మస్థలి అది

ఆ పట్టికలో నీదీ అగ్రస్థానమే

తీరమంతా నీరు నిండినట్లు

నీ ఒడిలో వీణ పరుచుకుంది

ప్రవాహం పైన అలలు లేచినట్లు

నీ వీణయపైన స్వరస్థానాల మెట్లు

గోదావరిని నాదఝరి చేసినది

వేదగానమే కాదు,

నీ వీణాగానమూనూ


నాదానికి నయగారాలు సమకూర్చిన

శబ్దబ్రహ్మవు నీవు

లలితము, శాస్త్రీయమూ

నీకు రెండు కళ్ళు

వీణకు రెండవ పేరు ఈమని

రాగాలు పూలై పూచిన ఆమని

వాగ్గేయకారుల రచనలకు

అమృతత్వం ప్రసాదించడమే కాదు,

వాస్తవ సంఘటనలను కూడా

నాదచిత్రాలుగా మలిచావు


ఆదర్శ శిఖరారోహణం వింటే

మంచుకొండ ఎక్కుతున్న అనుభూతిని

భ్రమర విన్యాసం వింటే,

పూలతోటలో విహరిస్తున్న అనుభూతిని

మా వీనులకు కానుకలిస్తాయి

ప్రపంచ దేశాలన్నీ నీ వీణా వాదనా పటిమకు

అబ్బురపడి, మోకరిల్లాయి

వీణతీగపై నీవు పూయించే

స్వరకంపనం

నాదశరీరం పులకరించేలా

నీవు పలికించే రాగాలాపనం

గమకాలకు నీవు కల్పించిన సోయగంతో

తరించిపోయింది

సంగీతాభిమానలోకం


ఎంతటి శిష్యకోటి నీది

ఇప్పటి వీణానాద ప్రపంచంలో

స్వరభవనాలకు నీవు కదా పునాది

నవీన రాగాల సృష్టికర్తవుగా

ఇప్పటికి నీకు నూరేళ్ళు

అపురూప వైణిక చక్రవర్తిగా

నీ కీర్తికి ఇంకో వెయ్యేళ్ళు

మద్దాళి రఘురామ్

(నేడు డా. ఈమని శంకరశాస్త్రి శతజయంతి)