Oct 20 2021 @ 03:54AM

నా తమ్ముడు హిట్‌ కొట్టాడు

‘‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రంతో అఖిల్‌కు  ఇంత పెద్ద హిట్‌ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అఖిల్‌ను చూస్తే తమ్ముణ్ణి చూసిన అనుభూతి కలుగుతుంది. హీరోగా అఖిల్‌ లాంచింగ్‌ గురించి  నాకు అనిపించిన అంశాలు నాగార్జునగారితో షేర్‌ చేసుకునేవాణ్ణి’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. అఖిల్‌, పూజాహెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. మంగళవారం జరిగిన సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ముకుంద’, ‘డీజే’ సినిమాల నుంచి పూజాను చూస్తున్నాను. సినిమా సినిమాకు నటిగా ఆమె మరో మెట్టు పైకెక్కుతున్నారు. మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో ప్రతిభావంతురాలైన నటిగానూ నిరూపించుకున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఈ సినిమాతో సూపర్‌ హిట్టు కొట్టాడు. తెలుగు రాకపోయినా గోపీసుందర్‌  మ్యూజిక్‌ అద్భుతంగా ఇచ్చారు. బన్నీవాసు, వాసూవర్మ, నాన్నగారు... అందరూ సినిమా సక్సెస్‌ కావాలని చాలా కష్టపడ్డారు. సొంత ఓటీటీ ఉన్నా కూడా థియేటర్లలోనే సినిమాలు విడుదల చేయాలని నాన్నగారు నిర్ణయించుకున్నారు. రాబోయే సినిమాలును కూడా ఇలాగే ఆదరించాలి’’ అని ప్రేక్షకులను కోరారు. 


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అక్కినేని, అల్లు ఫ్యామిలీది 65 ఏళ్ల జర్నీ. ఇది ఇంకో రెండు తరాలు సాగుతుంది. ప్రేమికులు, పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్‌ ఈ సినిమాలో ఒక క్లారిటీ ఇచ్చాడు. రియల్‌ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ తమ జీవితంలోకి తరచి చూసుకునేలా సినిమా ఉంది. నా పని చాలా తేలిక చేసిన బన్నీవాసుకి ధన్యవాదాలు. హిందీలో ఆఫర్లు వచ్చినా తెలుగు సినిమాలు చేయమని పూజాను కోరుతున్నాను’’ అన్నారు. ‘‘అల్లు అరవింద్‌ గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. నన్ను గుండెల్లో పెట్టుకొని పనిచేశారు. కొడుకులా చూసుకున్నారు. ఆయనతో  మళ్లీ పనిచేయాలనుంది. ప్రేక్షకులు ఇచ్చిన ఈ  హిట్‌ను గిఫ్ట్‌లా తీసుకుంటున్నాను’’ అని చెప్పారు. 


‘‘సక్సెస్‌ఫుల్‌ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ ఎఫర్ట్‌తోనే ఈ విజయం సాధ్యమైంది. నా నటన బాగుందని చాలామంది ఫోన్లు  చేసి అభినందిస్తున్నారు’’ అని పూజాహెగ్డే చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘వైవాహిక జీవితం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పిన సినిమా ఇది. దీనికోసం భాస్కర్‌ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు’’అన్నారు. 


‘‘ఇలాంటి సక్సెస్‌ చూడడానికి ఎన్నాళ్లు పడుతుందో అనుకున్నాను. కానీ ఈ చిత్రంతోనే ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు. ఒక దర్శకుడికి ఇంతకన్నా ఏం కావాలి. బన్సీవాసు, వాసూవర్మ, అరవింద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాతో అఖిల్‌ కుటుంబ ప్రేక్షకులకి దగ్గరయినందుకు ఆనందంగా ఉంది’’ అని ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ చెప్పారు.