రాత్రికి రాత్రే ఆ ఊళ్లో అంతా మాయం.. వందల ఏళ్లయినా వీడని మిస్టరీ.. ఇంతకీ వాళ్లేమయ్యారు..?

ABN , First Publish Date - 2021-05-25T17:55:31+05:30 IST

ఉదయం ఎప్పట్లాగే సూర్యుడొచ్చి అందర్నీ నిద్ర లేపాడు. కానీ ఆ ఊర్లో లేవడానికి మాత్రం ఎవరూ లేరు. ఇళ్లు, వాటిలోని వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం మాయమైపోయారు.

రాత్రికి రాత్రే ఆ ఊళ్లో అంతా మాయం.. వందల ఏళ్లయినా వీడని మిస్టరీ.. ఇంతకీ వాళ్లేమయ్యారు..?

ఆ రోజు ఉదయం కూడా ప్రజల రణగొణ ధ్వనులతో సందడిగా ఉన్న ఆ ఊరు చీకటి పడగానే నిశ్శబ్దం అనే కంబళి కప్పుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే సూర్యుడొచ్చి అందర్నీ నిద్ర లేపాడు. కానీ ఆ ఊర్లో లేవడానికి మాత్రం ఎవరూ లేరు. ఇళ్లు, వాటిలోని వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం మాయమైపోయారు. ఇది జరిగి ఇప్పటికి 20దశాబ్దాలు అంటే అక్షరాలా రెండు వందల సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడేం జరిగిందో ఇప్పటికీ వీడని మిస్టరీనే. ఇలాంటివన్నీ ఏవో కట్టుకథలని కొట్టిపారేయకండి. ఇది నిజంగా నిజం. ఎందుకంటే దీనికి చాలా ధృడమైన ఆధారాలు ఉన్నాయి. జరిగింది కూడా ఎక్కడో ఏడు సముద్రాల ఆవల కాదు. మన వాయువ్య రాష్ట్రం రాజస్థాన్‌లో. ఇక్కడి ప్రధాన పట్టణాల్లో ఒకటైన జైసల్మీర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందీ ఘోస్ట్ టౌన్. దాని పేరే కుల్‌ధారా.


ఇప్పటికీ ఎవరైనా కుల్‌ధారా వెళ్తే అక్కడి వణుకుపుట్టించే నిశ్శబ్దమే మనకు స్వాగతం పలుకుతుంది. అక్కడ ఎవరూ లేకపోయినా మన మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. ఈ శిధిల గ్రామం కథ గురించి అక్కడ చిన్నపిల్లలను అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఈ ఊరు మాయమైన సమయంలో అంటే 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాలను రాజులు, మంత్రులు పాలించేవారు. ఆ సమయంలో జైసల్మీర్ దివాన్‌గా సలీమ్ సింగ్ ఉండేవాడు. అతనో పెద్ద క్రూరుడు. డబ్బు పిచ్చి ఉన్నవాడు. ప్రజలపై అధిక పన్నులు వేసి రక్తం పీల్చేసేవాడు. అలాంటి దివాన్ కన్ను.. కుల్‌ధారా గ్రామపెద్ద కుమార్తెపై పడిందట. ఆమెను తన వద్దకు పంపాలని దివాన్ అడిగాడు. దానికి గ్రామపెద్ద అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన సలీమ్ సింగ్.. గ్రామపెద్ద గనుక అతని కుమార్తెను తన వద్దకు పంపకపోతే వారిపై భయంకరంగా పన్నులు వేసి, పీడించి, హింసించి చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ గ్రామస్థులు అంతా ఒక్కచోట సమావేశమయ్యారు. అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఓ ఆడబిడ్డను రక్షించుకునేందుకు సాహసోపేత చర్యకు పూనుకున్నారు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా రాత్రికిరాత్రే ఆ గ్రామాన్ని ఖాళీ చేసేశారు.. వెళ్లేటప్పుడు గ్రామానికి ఒక శాపం కూడా ఇచ్చారని ప్రతీతి.


అప్పట్లో ఇక్కడ పాలివల్ బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు. వీళ్లందరూ పాళి నుంచి జైసల్మీర్ వచ్చిన బ్రాహ్మణులు. ఎప్పుడో 13వ శతాబ్దంలో ఈ గ్రామం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక్కడ భట్టిక్ సామవాట్ క్యాలెండర్‌ను వాడేవారు. ప్రస్తుత గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఈ గ్రామంలో 1235లో, 1238లో ఇద్దరు చనిపోయారు. ఈ గ్రామం ఖాళీ అయ్యే సమయానికి ఇక్కడి జనాభా సుమారు 1588 మంది అయి ఉంటుందని అంచనా. అయితే ఇక్కడి స్థానికులు చెప్పుకున్నట్లు సలీమ్ సింగ్ వల్లే గ్రామం ఖాళీ అయిందా? అంటే దానికి కూడా సరైన ఆధారాలు లేవు. కొందరేమో ఇక్కడ పెద్ద భూకంపం వచ్చిందని, అందుకే ఇక్కడి ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారని అంటారు. మరికొందరు నిపుణులేమో ఇది ఎడారి ప్రాంతం కాబట్టి నీటి నిల్వలు ఇంకిపోయి ఉండొచ్చని, కనీసం తాగు నీరు కూడా లేక ప్రజలు అష్టకష్టాలు పడేవారనీ అందుకే గ్రామస్తులంతా ఖాళీ చేసి ఉండొచ్చునని కొందరు చెబుతుంటారు. అయితే ఇవే కారణాలు అయి ఉంటే రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ అవుతుందా..? వాళ్లు ఎక్కడికి వెళ్లారో? ఏమై పోయారో..? ఏ మహానగరంలో అడుగుపెట్టి జీవనోపాధి పొందుతున్నారో తెలియకుండా పోతుందా..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇప్పటికీ దొరకడం లేదు.


అయితే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మాత్రం సలీమ్ సింగ్ వల్లే పాలివన్ బ్రాహ్మణులు అర్థంతరంగా గ్రామం వదిలి పారిపోయారని నమ్ముతారు. వెళ్లే సమయంలో తాము సుఖంగా జీవించలేకపోయిన ఈ గ్రామంలో మరెవరూ ఉండలేరని శపించారని చెప్తారు. ఆ భయంతోనే ఇన్నేళ్లయినా ఈ గ్రామంలో ఎవరూ ఉండటం లేదు. ఈ గ్రామం చుట్టూ ఒక గోడ ఉంటుంది. సాయంత్రమైతే చాలు ఆ గోడకు ఉన్న గేటు మూసేస్తారు. దీనిలోకి ఎవర్నీ వెళ్లనివ్వరు. గ్రామంలో ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి చూస్తే గ్రామం మొత్తం కనబడుతుంది. చక్కగా పద్ధతి ప్రకారం కట్టిన ఇళ్లు, వాటి మధ్యలో రోడ్లతో ఎంతో ఆలోచనతో కట్టిన ఈ గ్రామాన్ని ప్రజలంతా ఒకేసారి ఇలా ఎందుకు వదిలేసి వెళ్లిపోయారో మాత్రం మిస్టరీనే. ప్రస్తుతం ఈ గ్రామం భారత ఆర్కియాలజీ విభాగం ఆధీనంలో ఉంది. దీన్ని వారసత్వ సంపదగా గుర్తించిన ప్రభుత్వం దీని బాగోగులు చూసుకుంటోంది.


ఏది ఏమైనా.. ఈ భయానకమైన కథ నిజమో కాదో తెలియదు కానీ.. ఒకప్పుడు సకల సౌకర్యాలతో, నిండుగా ప్రజలతో కళకళలాడిన ఈ గ్రామంలో ప్రస్తుతం మాత్రం ఖాళీ ఇళ్లు, మొండి గోడలు.. సన్నటి ఇసుక దారులతో నిర్మానుష్యంగా ఒక ఘోస్ట్ టౌన్‌లా మారిన మాట మాత్రం వాస్తవం.

Updated Date - 2021-05-25T17:55:31+05:30 IST