హైదరాబాద్‌లో మిస్టరీ మరణాలు.. ఆ ముగ్గురి మరణం వెనుక..

ABN , First Publish Date - 2020-05-30T16:37:49+05:30 IST

ఓ లెక్చరర్‌.. మరో స్టూడెంట్‌.. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటనల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండూ వేర్వేరు సంఘటనలు. ఒకదానికొకటి

హైదరాబాద్‌లో మిస్టరీ మరణాలు.. ఆ ముగ్గురి మరణం వెనుక..

నార్సింగ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఓ లెక్చరర్‌.. మరో స్టూడెంట్‌.. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటనల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండూ వేర్వేరు సంఘటనలు. ఒకదానికొకటి సంబంధం లేనివి. అయినా ఈ రెండింటిలో ఉన్న కామన్‌ అంశం ‘మిస్టరీ’. హైదర్షాకోట్‌లో భార్గవి(30).. ‘ఆత్మహత్య’ సంఘటనలో.. ఆమె అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన బలమైన కారణం ఏమీ కనబడదు. పైగా పదేళ్ల కొడుకుకి గంతలు కట్టి.. అతడిని ఉరేసి చంపి.. తర్వాత తను ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త చెబుతున్నారు. చిలకలగూడలో మయూరి(18) అనే విద్యార్థిని మరణం కూడా అంతే అనుమానాస్పదంగా ఉంది. ఆమె అదృశ్యం అయిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంటి ఆవరణలోనే ఆమె శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే..


అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అధ్యాపకురాలు తన కొడుక్కి ఉరేసి, తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హైదర్షాకోట్‌కు  చెందిన సతీష్‌  ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా  భార్య భార్గవి (30)  అధ్యాపకురాలిగా పని చేస్తోంది. వారికి కొడుకు వరణ్య (10), 14 నెలల కుమారై ఉన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఈ దంపతులు కొంతకాలం క్రితం  లక్ష్మీనరసింహనగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు. 15 రోజులుగా భార్గవి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ జబ్బు తనకు నయం కాదని పలుమార్లు భర్త వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం భర్త విధులకు వెళ్లాడు. తానూ  ఉద్యోగానికి వెళ్తున్నానని  పాపని పనిమనిషికి ఇచ్చి పంపించింది. మధ్యాహ్నం సమయంలో కొడుకి కళ్లకు గంతలు కట్టి ఉరేయడంతో పాటు ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని భర్త పోలీసులకు తెలిపాడు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోతే కొడుకును ఎందుకు చంపింది..? చిన్నారిని ఎందుకు వదిలేసింది.. అనే ప్రశ్నలకు సమాధానాలు మిస్టరీగా మారాయి.  మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు. 


పడేశారా..? పడిపోయిందా..?.. యువతి అనుమానాస్పద మృతి

ఇంటి నుంచి అదృశ్యమైందంటూ ఫిర్యాదు నమోదైన మర్నాడే.. అదే ఇంటిపై నుంచి పడి మృతి చెందింది. చిలకలగూడ రైల్వేక్వార్టర్స్‌లో నివసించే గట్టు లక్ష్మీనారాయణ కుమార్తె మయూరి(18)  ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనెల 28న  సాయంత్రం 5:30 నుంచి తన కుమార్తె కనిపించడం లేదంటూ.. అదేరోజు రాత్రి 9.30కు చిలకలగూడ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. మర్నాడు ఉదయం 7:30 నిమిషాలకు లక్ష్మీనారాయణ ఇంటి వెనుక మయూరి మృతి చెంది ఉంది. అదృశ్యమైన మయూరి ఇంటికి ఎలా వచ్చింది... లోపలకు వెళ్లకుండా భవనంపైకి ఎందుకు వెళ్లింది..? ఎవరైనా భవనంపై నుంచి తోసేశారా..? ప్రమాదవశాత్తు పడిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-05-30T16:37:49+05:30 IST