Mysoor Dussehra ఉత్సవాలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-07-05T16:53:00+05:30 IST

మైసూరు దసరా ఉత్సవాలకు మరో మూడు నెలలు గడువు ఉండగానే ఏర్పాట్లపై అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఆగస్టు మొదటి వారంలో

Mysoor Dussehra ఉత్సవాలకు సన్నాహాలు

                        - ఈ నెల 15 తర్వాత ఏనుగుల ఎంపిక


బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాలకు మరో మూడు నెలలు గడువు ఉండగానే ఏర్పాట్లపై అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఆగస్టు మొదటి వారంలో ఏనుగులు క్యాంపుల నుంచి ప్యాలెస్‏కు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈనెల 15 తర్వాత గజరాజుల ఎంపిక చేయనున్నారు. మైసూరు, కొడగు, చామరాజనగర్‌లలోని ఏనుగుల శిబిరాలకు నిపుణులు, పశువైద్య అధికారుల బృందం సందర్శించి 15 ఏనుగులను ఎంపిక చేస్తారు. జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు టెండరు ప్రక్రియ ప్రారంభించామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది దసరాలో కేవలం 8 ఏనుగులు మాత్రమే పాల్గొనగా ఈసారి 15 గజరాజుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అంబారీ మోసే అభిమన్యు, గోపాలస్వామి, ధనంజయ, అశ్వత్థామ, విక్రమ, అర్జునతోపాటు 15 ఏనుగులు రానున్నాయి. ఆరుసార్లు అంబారీ మోసిన అర్జున ఏనుగుకు గౌరవం ఇచ్చేలా ఈసారి మార్గదర్శకత్వం వహించే బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబరు 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 5న విజయదశమిన జంబూసవారీ కొనసాగనుంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ప్యాలెస్‌ నుంచి బన్ని మండపం వరకు మాత్రమే జంబూసవారీ సాగింది. ఈ కారణంగానే ఎక్కువ ఏనుగులను ఎంపిక చేయలేదు. దసరా ఉత్సవాల్లో జంబూసవారీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 

Updated Date - 2022-07-05T16:53:00+05:30 IST