మిజోరంలో శరణార్థులుగా మయన్మార్‌లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా 9 వేల మంది

ABN , First Publish Date - 2021-06-16T02:16:54+05:30 IST

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలోని చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలై లియాన్ లుయి సహా

మిజోరంలో శరణార్థులుగా మయన్మార్‌లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా 9 వేల మంది

ఐజ్వాల్: మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలోని చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలై లియాన్ లుయి సహా 9,247 మంది మిజోరంలో శరణార్థులుగా గడుపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలపై సైన్యం కఠిన ఆంక్షలు విధించింది.


మరోవైపు, ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం నుంచి చాలామంది శరణార్థులుగా పొరుగు దేశాలకు చేరుకుంటున్నారు.


పశ్చిమ మయన్మార్‌లోని చిన్ రాష్ట్రం మిజోరం పశ్చిమ సరిహద్దుతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లియాన్ సోమవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దును దాటి మిజోరంలోని చంపాయ్ పట్టణానికి ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తిలా చేరుకున్నారు.


ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన లుయి సహా 24 మంది చట్ట సభ్యులు మిజోరంలోని వివిధ ప్రాంతాల్లోని శిబిరాల్లో ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థి సంఘాలు, పౌర సంస్థలు వారికి శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు.


మరికొందరికి స్థానికులు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో అత్యధికులు చిన్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరు జో సామాజిక వర్గానికి చెందినవారు. మిజోలుకు వీరికి సంస్కృతి సంప్రదాయాల పరంగా చాలా దగ్గరి పోలికలు ఉంటాయి.  

Updated Date - 2021-06-16T02:16:54+05:30 IST