మయన్మార్‌ విషాదం

ABN , First Publish Date - 2021-03-17T06:55:28+05:30 IST

మయన్మార్‌లో సైన్యం నడివీధుల్లో సామాన్యులను ఊచకోత కోస్తుంటే, భారత ప్రభుత్వం నుంచి ఒక్క బలమైన మాట కూడా వినబడటం లేదేమని...

మయన్మార్‌ విషాదం

మయన్మార్‌లో సైన్యం నడివీధుల్లో సామాన్యులను ఊచకోత కోస్తుంటే, భారత ప్రభుత్వం నుంచి ఒక్క బలమైన మాట కూడా వినబడటం లేదేమని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సోమవారం మయన్మార్‌లో జరిగిన ఊచకోత గత కొద్దిరోజులుగా సాగుతున్న మారణహోమానికి కొనసాగింపు. ఆ ఒక్కరోజే కనీసం యాభైమంది చనిపోయారని అంచనా. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిలో రోజూ కొందరు భద్రతాదళాల చేతిలో హతమవుతున్నారు. ఇప్పటివరకూ కనీసం రెండువందలమంది మరణించివుంటారని, గాయపడినవారు, జైళ్ళకు పోయినవారు వేలల్లో ఉన్నారని అంచనా. భారత్‌–బర్మాలకు పదహారువందల కిలోమీటర్ల సరిహద్దు ఉన్నందున అక్కడి నిర్బంధం ఈశాన్య రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నది. 


అన్నివర్గాల ప్రజలనుంచి ఈ స్థాయి తిరుగుబాటు వస్తుందని సైనికపెద్దలు కూడా ఊహించివుండరు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట అక్కడ జరుగుతున్నది ఊచకోతే. ఉద్యమకారులను నియంత్రించడమంటే భద్రతాబలగాల భాషలో కాల్చిపారేయడమే. నిరసనకారులను ఈడ్చుకొచ్చి చావబాదడం, తరిమికొట్టి మరీ కాల్చివేయడం, ఇళ్ళపై దాడులు చేస్తూ వందలమందిని నిర్బంధించడం ప్రతిరోజూ మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ, సైనికపెద్దలు ఆశించినట్టుగా ప్రజలు ఏమాత్రం లొంగిరావడం లేదు. సైన్యాన్ని పొమ్మంటున్నారు, ప్రజాస్వామ్యం కావాలంటున్నారు. సైనిక ముఠా అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, పెద్దల ఆదేశాలను పాటించలేని స్థితిలో బర్మా సైనికులు, పోలీసులు సరిహద్దులు దాటి మన ఈశాన్య రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజాసామ్యం కోసం ఉద్యమిస్తున్న వారంతా మాకు అమ్మలూ, అన్నలే, తోడబుట్టినవారిని ఎలా చంపుకోమంటారు? అని మిజోరామ్‌ వంటి రాష్ట్రాల్లోకి రహస్యంగా వచ్చిచేరిన బర్మా సైనికులు, పోలీసులు అంటున్నారు. బర్మాలో తమ కుటుంబీకులను సైనికపెద్దలు తీవ్రహింసలకు గురిచేస్తున్నా తిరిగిపోయి ఆ పాపపు పనిలో పాల్గొనడానికి వీరెవ్వరికీ మనసు రావడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లోకి ఈ విధంగా వచ్చినవారి సంఖ్య వందల్లో ఉంది. 


సైనిక తిరుగుబాటుకు చైనా చేయూత ఉన్నదని బర్మా ప్రజలు నమ్ముతున్నందున ప్రధాన పారిశ్రామికవాడల్లో చైనా పెట్టుబడులున్న ఫ్యాక్టరీలమీద దాడులు జరుగుతున్నాయి. పరిశ్రమలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, చైనా ఉద్యోగులను కొట్టడం వంటి సంఘటనలతో ఉద్యమకారులపై జుంటా మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చిన సైన్యంమీద పాశ్చాత్యదేశాలు తీవ్రంగా ఒత్తిడి తెస్తుంటే, చైనా పాత్ర ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. ఇక, భారత్‌ వైఖరి కూడా భిన్నంగా ఏమీ లేదు. సైన్యానికీ, రాజకీయపక్షాలకూ మధ్య సయోధ్య కుదర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంటే, ప్రజాస్వామ్య స్థాపనకు ఆసియాన్‌ ఒత్తిడితెస్తుంటే, భారత్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదన్న విమర్శలున్నాయి. ఒక ప్రజాస్వామ్యదేశంగా మయన్మార్‌ ప్రజా ఉద్యమానికి అండగా నిలవాల్సింది పోయి, ‍‍సైనికకుట్ర వెంటనే ఓ ఖండన జారీ చేసిన తరువాత ఇప్పటివరకూ మారుమాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. అలాగే, బ్రిటన్‌ ప్రతిపాదించిన భద్రతామండలి తీర్మానాన్ని బలహీనపరచడంలో కూడా చైనా, రష్యా, వియత్నాంలతో భారత్‌ చేయికలపడమూ విమర్శలు ఎదుర్కొంటున్నది. 


అంతర్జాతీయ ఆంక్షలతో మాత్రమే సైన్యాన్ని లొంగదీయగలమని కొన్ని దేశాలు భావిస్తుంటే, కష్టాల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే ఈ తరహా చర్యలు కూడనివని భారత్‌ అంటోంది. వీటన్నింటి కారణంగా, రెండు దశాబ్దాల క్రితం నాటి మయన్మార్‌ ప్రజాస్వామిక పోరాటానికి బలమైన మద్దతుదారుగా ఉన్న భారత్‌ ఇప్పుడు చైనా మాదిరిగానే తయారైందన్న భావన బర్మీయుల్లో కలిగే అవకాశాలున్నాయి. కాస్తోకూస్తో మంచి సంబంధాలున్న బర్మా మిలటరీని ఆగ్రహానికి గురిచేస్తే, అది పూర్తిగా చైనా చేతుల్లోకి పోయే ప్రమాదం ఉన్నదని భారత్‌ భయం. అలాగే, సైన్యం అధికారంలో ఉన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటుదారులకు కళ్ళెం వేయడం, పలు విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం సులభం అవుతున్నది. ఈ నేపథ్యంలో సూకీని తిరిగి ప్రతిష్ఠించాలన్న మొండివాదన కంటే, చర్చలతో రాజీకి రావాలన్న వాదనే ప్రభుత్వానికి తెలివైన మార్గంగా కనిపిస్తున్నట్టు ఉంది. కత్తిమీద సాములాంటి ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగేయాల్సిందే కానీ, సైనిక కుట్రను మేడిన్‌ చైనాగా చూస్తున్న బర్మీయులు భారత్‌కు దూరం కాకుండా కాచుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది.

Updated Date - 2021-03-17T06:55:28+05:30 IST