మయన్మార్ తిరుగుబాటుదారులకు టీకా సరఫరా చేసిన చైనా!

ABN , First Publish Date - 2021-07-26T01:16:39+05:30 IST

మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కచిన్ ఇండిపెండెస్స్ ఆర్మీకి చైనా ప్రభుత్వం 10 వేల కరోనా టీకా డోసులను సరఫరా చేసింది.

మయన్మార్ తిరుగుబాటుదారులకు టీకా సరఫరా చేసిన చైనా!

బీజింగ్: మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కచిన్ ఇండిపెండెస్స్ ఆర్మీకి చైనా ప్రభుత్వం 10 వేల కరోనా టీకా డోసులను సరఫరా చేసింది. వీటిలో కొన్ని నామమాత్రపు ధరకు, మరికొన్ని విరాళంగా ఇచ్చింది. మయన్మార్‌లో అంతర్యుద్ధం, కరోనా కల్లోలం కారణంగా చైనాలోకి వలసలు పెరుగుతుండటంతో దీన్ని నిరోధించేందుకు చైనా నడుం కట్టింది. ఇందులో భాగంగానే తిరుగుబాటు దారులు కోరిన వెంటనే కరోనా టీకాలను సరఫరా చేసింది. 


మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజాప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం.. అధికారపగ్గాలను బలవంతంగా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ సహా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పలు నేతలను మిలిటరీ నిర్బంధించింది.  దీంతో.. అక్కడి వైద్యుల్లో అనేక మంది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ విధులకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా..ఆస్పత్రుల్లో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఉండటంతో మయన్మార్‌లో కరోనా విజృంభిస్తోంది. ఈ కారణంగా చైనాకు వలసలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని నిరోధించేందుకే తిరుగుబాటుదారులకు కరోనా టీకాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-26T01:16:39+05:30 IST