Rohingyas పై రచించిన బుక్‌ను విక్రయిస్తున్న పబ్లిషర్‌పై మయన్మార్ చర్య ఇదీ.. ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-06-01T00:21:45+05:30 IST

మిలిటరీ పాలనలోని మయన్మార్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహింగ్యా మైనారిటీలపై మిలటరీ క్రూరమైన చర్యలను వర్ణిస్తూ వె

Rohingyas పై రచించిన బుక్‌ను విక్రయిస్తున్న పబ్లిషర్‌పై మయన్మార్ చర్య ఇదీ.. ఏం చేసిందంటే..

యంగూన్ : మిలిటరీ పాలనలోని మయన్మార్(Myanmar ) ప్రభుత్వం విద్వేషపూరిత నిర్ణయం తీసుకుంది. రోహింగ్యా మైనారిటీలపై మిలటరీ క్రూర చర్యలను వర్ణిస్తూ వెలువడిన ఓ విదేశీ పుస్తకాన్ని విక్రయిస్తున్న ‘ల్విన్ ఓ’ అనే ప్రచురణ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు అక్కడి మిలిటరీ ప్రభుత్వ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఐరిష్-ఆస్ట్రేలియన్ అకడమిక్ రొనాన్ లీ   ‘‘మయన్మార్స్ రోహింగ్యా జెనోసైడ్’’ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని మయన్మార్‌లో ‘ల్విన్ ఓ’ సంస్థ ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండడమే లైసెన్స్ రద్దుకు కారణమని మయన్మార్ అధికారిక మీడియా  ‘మ్యాన్మా అలిన్ న్యూస్‌పేపర్’ పేర్కొంది. ల్విన్ ఓ సంస్థ లైసెన్స్‌ను మే 28న ఉపసంహరించారు. కాగా ఈ నిర్ణయంపై సదరు బుక్ పబ్లిషింగ్ సంస్థ స్పందించలేదు.


పుస్తక రచయిత వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పుస్తకంలో రోహింగ్యాల చరిత్ర, వారి గుర్తింపు, పత్రాలు, రోహింగ్యా వర్గం అణచివేత, హింసకు సంబంధించిన కీలకాంశాలున్నాయి. రోహింగ్యాల సాక్ష్యాలు, చారిత్రక అధ్యయనాలను కూడా పొందుపరిచారు. అంతేకాకుండా మయన్మార్, రోహింగ్యాలపై విదేశీ వ్యాఖ్యతల విశ్లేషణలను కూడా పుస్తకంలో జత చేశారు.


 2017లో మిలిటరీ చర్యల సమయంలో లక్షలాది మంది రోహింగ్యాలు మయన్మార్ విడిచి పారిపోయారు. ఈ సమయంలో ఎన్నో హత్యలు, మానభంగాలు, గృహ దహనాలు జరిగాయి. మయన్మార్‌కు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు నివాసముంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం ఇక్కడ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ నుంచి  మయన్మార్‌కు తిరిగి వెళ్లిన దాదాపు 6 లక్షల మంది రోహింగ్యాలను అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తున్నారు. వారికి మయన్మార్ పౌరసత్వం, హక్కులు, పౌర సేవలను తిరస్కరిస్తున్నారు. రోహింగ్యాలపై సామూహిక దమనకాండ జరిగినట్టు ఈ ఏడాది మార్చిలో అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రకటించింది. రోహింగ్యా సమూహాన్ని పూర్తిగా నశించజేసేందుకు ప్రయత్నాలు జరిగాయనేందుకు తమవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-01T00:21:45+05:30 IST