Abn logo
Apr 18 2021 @ 00:00AM

సినిమాగా నా జీవితం బోర్‌ కొడుతుంది..

సినీ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ.  ‘శివ’, ‘రంగీలా’, ‘సర్కార్‌’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన వర్మ ఆ తర్వాత ఒక హిట్‌ సినిమాను  అందించలేకపోయారు. అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక వివాదంతో లైవ్‌లో ఉండే వర్మతో నవ్య ముఖాముఖి..


కరోనా సమయంలో మిమ్మల్ని ఏ విషయం ఎక్కువగా ఆందోళనకు గురి చేసింది?

నిజంగా నన్ను ఏ విషయం ఆందోళనకు గురి చేయదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొవిడ్‌ నన్ను ఆందోళనకు గురిచేయలేదు. నాలో ఆసక్తి రేకెత్తించింది. కొవిడ్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఒక వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోందంటే ఆసక్తికరమైన విషయమే కదా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- ఇప్పటి దాకా మానవాళి ఎదుర్కొన్న ప్రతి విపత్తూ ఒక కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం. ఆ తర్వాత సాంకేతికపరంగా అనేక మార్పులొచ్చాయి. కొవిడ్‌ కూడా అంతే! మనం మరికొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. కొవిడ్‌ కొన్ని రంగాల్లో అభివృద్ధి కారణమవుతుంది. 


ఆందోళన లేదన్నారు.. మరి కొవిడ్‌ సమయంలో అనిశ్చితిని ఎలా ఎదుర్కొన్నారు?

నా ఉద్దేశంలో ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడమే అనిశ్చితి. నాకు ఆ సమస్య లేదు. ప్రతి విషయంలోను నాకు కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అందువల్ల నాకు ఎలాంటి అనిశ్చితీ లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొవిడ్‌ వల్ల సినిమా రంగం ఒక్కటే కాదు... అన్ని రంగాల్లోనే అనిశ్చితి ఏర్పడింది. అయితే సినిమా రంగం గ్లామర్‌తోనూ... వ్యాపారంతోనూ ముడిపడి ఉండడం వల్ల అందరికీ ఈ రంగం అంటే ఆసక్తి ఉంటుందంతే!


మీరు ఎక్కువగా భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటారా? సోషల్‌ మీడియాలో మీ పోస్ట్‌లు చూస్తే కొన్ని సార్లు అలా అనిపిస్తుంది...

నేను ఎమోషనల్‌ పర్సన్‌ను కాను. ఎవరితోను ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాను. నా టీమ్‌లో కూడా నేను కొద్ది మందితోనే టచ్‌లో ఉంటాను. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే వాట్సప్‌ ఉంది కదా... నేను మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుకుంటా! ఇక సోషల్‌ మీడియా విషయానికి వద్దాం. అనుక్షణం నా చేతిలో ఫోన్‌ ఉంటుంది. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని క్షణాల్లో చెప్పే అవకాశం ఉంది. అందువల్ల నాకు ఆసక్తి కలిగించిన ఏ విషయం గురించి అయినా వెంటనే స్పందిస్తా. నేను పెట్టే పోస్ట్‌లు, ట్వీట్‌లు చూసి నేను సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం వెచ్చిస్తాననుకుంటే తప్పు. ఇతరులు ఏమనుకుంటారనే భయం నాకు లేదు. అందువల్ల నా అభిప్రాయాలను నిజాయితీగా... నిక్కచ్చిగా... స్వేచ్ఛగా చెబుతా. అవి వివాదాస్పదమయినా పర్వాలేదు. 


మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవారా? మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులెవరు?

నేను కాలేజీలో చదువుతున్న సమయంలో సత్యేంద్ర అని జూనియర్‌ ఉండేవాడు. నన్ను తీవ్రంగా ప్రభావితంగా చేసిన వ్యక్తుల్లో అతను ఒకడు. అతని వల్ల నేను ప్రపంచ ప్రసిద్ధి చెందిన తత్త్వవేత్తల పుస్తకాలు చదవగలిగా. నా చుట్టూ ఉన్న సమాజంలోని కట్టుబాట్లను, విలువలను ఛేదించగలిగా. ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన స్వేచ్ఛా జీవిగా మారా. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు సత్యేంద్ర గుర్తుకు వస్తూ ఉంటాడు. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తుంటే... ‘తను ఆ రోజే చెప్పాడు కదా!’ అనిపిస్తుంది.


ఇక వయస్సుతో పాటు నేను మారుతూ వచ్చా. ఒకప్పుడు తీవ్రమైన ఆవేశం కలిగించే అంశాలు ఇప్పుడు సామాన్యంగా అనిపిస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు ఎవరినైనా నియంత్రించడానికి వారిపై ఆధిపత్యమే చెలాయించటమే సరైన మార్గమని అనుకొనేవాణ్ణి. ఆ తర్వాత ప్రతి వ్యక్తి నేపథ్యం భిన్నంగా ఉంటుందనీ, ఆ నేపథ్య ప్రభావం అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందనీ అర్థమయింది. నన్ను అందరూ అర్థం చేసుకోవాలనుకోవడం... నమ్మాలనుకోవడం సరి కాదని తెలుసుకున్నా. 


గతంలో అద్భుతమైన సినిమాలు తీసిన మీరు... ఇప్పుడు ఎందుకు విఫలమవుతున్నారనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?

గత 15 ఏళ్లుగా ఈ ప్రశ్నకు రకరకాలుగా సమాధానం చెబుతూనే వస్తున్నా. మళ్లీ చెబుతా. నేను ఎప్పుడూ సినిమా సక్సెస్‌ గురించి ఆలోచించను. నా మనసులో ఉన్న ఒక ఆలోచననూ, అభిప్రాయాన్నీ ప్రేక్షకుల ముందు నా దృష్టి కోణం నుంచి ఉంచుతా. నా ఉద్దేశంలో సక్సెస్‌ అంటే- మంచి రివ్యూలు రావడం,  బాక్సాఫీసు కలెక్షన్లు... ఇవన్నీ కావు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సినిమా అనేది ఒక్క గంటలోనో... ఒక రోజులోనే పూర్తయ్యే పని కాదు. కొంతమంది కొన్ని రోజుల పాటు తీసుకొనే రకరకాల నిర్ణయాల సమాహారం. ఈ నిర్ణయాలపై వంద రూపాయలు టిక్కెట్‌ పెట్టి కొనే ప్రేక్షకుడు తన తీర్పు ఇస్తాడు. ఎక్కడెక్కడ తప్పులున్నాయో చెబుతాడు.


ఉదాహరణకు ‘శివ’ పెద్ద హిట్‌. ‘ఆఫీసర్‌’ ప్లాప్‌. ‘ప్రేక్షకులకు ఈ తీర్పును ఎందుకు ఇచ్చారు?’ అనేదే పెద్ద ప్రశ్న. నా కెరీర్‌లో అనేక ప్లాప్‌లున్నాయి. ‘శివ’ తర్వాత నా ఐదు సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. కానీ అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి ఫోకస్‌ కూడా లేదు. కొన్నిసార్లు కాలంతో పాటు అనేక విషయాలు ఎస్టాబ్లిష్‌ అవుతూ వస్తాయి. ఉదాహరణకు నేను తీసిన ‘క్షణం క్షణం’ గొప్ప సినిమా అంటారు. కానీ అది ప్లాప్‌ సినిమా. విడుదలయిన మిడ్‌ వీక్‌లోనే దాన్ని థియేటర్ల నుంచి తీసేశారు. ఇప్పుడు టీవీల్లో చూసి చూసి దాన్ని గొప్ప సినిమా అనుకుంటూ ఉంటారు. 


దర్శకుడిగా పరిణితి చెందాననుకుంటున్నారా?

వయస్సు, అనుభవం మనిషిలో మార్పులు తీసుకువస్తాయి. ‘శివ’ తీసే సమయానికి- నేను కాలేజీ నుంచి ఫ్రెష్‌గా బయటకు వచ్చా! అక్కడి రాజకీయాలు, బయట నుంచి వచ్చే గుండాల ప్రభావం కాలేజీల్లో ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ తర్వాత లవ్‌.. రొమాన్స్‌ను చెప్పే ‘రంగీలా’ తీశా. ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను లవ్‌ స్టోరీలు తీయలేను. కొత్త కొత్త అంశాలు నాలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వాటినే సినిమాలుగా తీస్తున్నా. తాజాగా లెస్బియన్లపై ఒక సినిమా తీశా! ఒక సెన్సార్‌ కట్‌ కూడా లేదు. నాకే ఆశ్చర్యం వేసింది. మార్షల్‌ ఆర్ట్స్‌కు సంబంధించి ఒక సినిమా పూర్తిచేశాను.  


ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతిని మార్చేశాయనే వాదన ఉంది. మీరు ఏకీభవిస్తారా?

ఓటీటీ ప్లాట్‌ఫాంల వల్ల దర్శకుడు ప్రేక్షకుడితో నేరుగా కమ్యూనికేట్‌ చేయగలుగుతాడు. థియేటర్‌లో ఒకేసారి వందల మంది ప్రేక్షకులకు కమ్యూనికేట్‌ చేయాల్సిన అవసరముండదు. నిడివి సమస్య లేదు. మన మనసుకు నచ్చిన సబ్జెక్ట్‌ ఏదైనా చేయవచ్చు. దాన్ని ప్రేక్షకుడు మొబైల్‌లో చూస్తాడా? ఐపాడ్‌లో చూస్తాడా? టీవీలో చూస్తాడా? అనేది అతడి ఇష్టం. నేను ఈ మధ్య మాఫియా డాన్‌ దావుద్‌ ఇబ్రహీం తొలి రోజుల గురించి ‘డి- కంపెనీ’ అనే సినిమాను... వెబ్‌ సిరీస్‌ను చూశా. 1980ల నుంచి 2005 వరకూ అండర్‌వరల్డ్‌ ఎలా మారుతూ వచ్చిందనే విషయాన్ని దీనిలో చూడవచ్చు. వెబ్‌సిరీస్‌ కాబట్టి నచ్చినంత తీయవచ్చు. అన్ని రకాల భావోద్వేగాలు చూపించవచ్చు. 


మీ జీవిత కథను మీరే సినిమాగా తీయాలంటే ఎలా తీస్తారు?

చాలా బోర్‌ కొడుతుంది. నా జీవితంలో సినిమాకు కావాల్సినన్ని మలుపులు... ఆసక్తికరమైన అంశాలు లేవు.  


ఏం నచ్చుతుందో చెప్పలేం...

ప్రేక్షకులకు ఏమి నచ్చుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అది ఊహకు కూడా అందదు. ఒక ఆసక్తికరమైన సంఘటన చెబుతా. ‘గీతాంజలి’ సినిమా విడుదలకు ముందు- దానిలో మూడు ముఖ్యమైన సీన్లు వేస్ట్‌ అనీ, వాటిని తీసివేయకపోతే సినిమా కొనను అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్‌ ఒకాయన బాగా గోల చేశాడు. వాటిలో నాగార్జున తల్లితండ్రులను ఒప్పించి ఊటీ వెళ్లే సీన్‌ ఒకటి. వాస్తవానికి ఈ చిత్ర కథలో ముఖ్యమైన సీన్‌ అది. తప్పనిసరి పరిస్థితుల్లో - ఆ మూడు సీన్‌లను తొలగించి గుంటూరులో రిలీజ్‌ చేశారు. సినిమా పెద్ద హిట్‌ అయింది.


గుంటూరులో కూడా అది పెద్ద హిట్‌. గుంటూరులో ఉన్న మా కజిన్‌కు ఫోన్‌ చేసి- ‘‘ముందు సీన్‌లో వేరే ఊరులో ఉన్న నాగార్జున- హఠాత్తుగా ఊటీకి ఎందుకు వెళ్లాడని నీకు అనుమానం రాలేదా?’’ అని అడిగా. ‘‘ఊటీకి వెళ్తే తప్పేముంది? వెళ్లాడనుకున్నా..’’ అన్నాడు. ఈ సంఘటన ఆధారంగా అర్థమయిందేమిటంటే - ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారో మనం చెప్పలేం!


అందుకే పెద్ద స్టార్స్‌తో...

చాలా మంది ‘మీరు పెద్ద స్టార్స్‌తో సినిమాలు ఎందుకు చేయడం లేదు?’ అని అడుగుతారు. నేను నా కోసమే సినిమాలు  తీస్తా. పెద్ద స్టార్స్‌ ఇమేజ్‌కు తగినట్లుగా, వారి అభిమానులను సంతృప్తి పరిచే విధంగా నేను తీయలేను. ఉదాహరణకు పవన్‌ కల్యాణ్‌. తారక్‌ వంటి స్టార్లకు ఒక ఇమేజ్‌ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే తీయాలి. నాకు ‘ఎంత మంది ప్రేక్షకులు చూస్తారు?’ అనే విషయంపై ఎలాంటి చింతా లేదు. ప్రేక్షకుల కోసమే అయితే నేను ‘శివ’ సినిమా తీసి ఉండేవాడినే కాదు. ఆ సమయంలోనే  బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’.. చిరంజీవి ‘రుద్రభూమి’ కూడా వచ్చాయి. నా సినిమా చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారో అనుకుంటే ‘శివ’ వచ్చేదే కాదు. అలాగని భారీ సినిమాలు తీయలేనని చెప్పను. భవిష్యత్తులో తీసే అవకాశం కూడా ఉంది. 


పనే వెకేషన్‌..

నా 35 ఏళ్ల వృత్తి జీవితంలో ఒక్క రోజు కూడా నేను సెలవు తీసుకోలేదు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇలా గడిచిపోతోంది. నాకు పనే ఒక పెద్ద వెకేషన్‌. నేను ఫ్యామిలీ పర్సన్‌ కాదు. స్నేహితులు లేరు. 


 సివిఎల్‌ఎన్‌

ఫొటోలు: లవకుమార్‌


 Advertisement
Advertisement
Advertisement