‘మై హోమ్‌’ భారీ విస్తరణ

ABN , First Publish Date - 2021-01-23T06:12:02+05:30 IST

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవాలని మై హోమ్‌ గ్రూప్‌ భావిస్తోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే

‘మై హోమ్‌’ భారీ విస్తరణ

కొత్తగా 10  ప్రాజెక్టుల యోచన

ప్రస్తుతం నిర్మాణంలో 6 ప్రాజెక్టులు

కొత్త వాటిపై రూ.1,000 కోట్ల పెట్టుబడులు

సిమెంట్‌ ప్లాంట్ల నవీకరణ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవాలని మై హోమ్‌ గ్రూప్‌ భావిస్తోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో భూమి విలువ తక్కువగా ఉంది. అందువల్ల ఆ నగరాలతో పోలిస్తే గృహ వ్యయం ఇక్కడ తక్కువగా ఉందని మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ మార్కెటింగ్‌ డెరెక్టర్‌ జూపల్లి రాజితా రావు తెలిపారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోంది. సామాజిక మౌలిక సదుపాయాలు బాగున్నాయి. టెక్నాలజీ, ఐటీ తదితర పరిశ్రమలకు హైదరాబాద్‌  కేంద్రంగా మారుతున్నందున భవిష్యత్తులో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రీమియం, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లకు గిరాకీ పెరిగే వీలుంది. గృహ, వాణిజ్య నిర్మాణంలోని పెద్ద కంపెనీలకు మంచి అవకాశాలు లభించే వీలుంది. వీటిని దృష్టి పెట్టుకుని మై హోమ్‌ గ్రూప్‌ మరిన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టనుందని వివరించారు. గృహ నిర్మాణ రంగంతో పాటు సిమెంట్‌ వ్యాపారంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 


ఇప్పటికి 17 ప్రాజెక్టులు పూర్తి: ఇప్పటి వరకూ మై హోమ్‌ గ్రూప్‌ 17 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో 14 నివాస, 3 వాణిజ్య ప్రాజెక్టులు ఉన్నాయి. 2.5 కోట్ల చదరపు అడుగుల నివాస, వాణిజ్య స్థలాన్ని వినియోగదారులకు విక్రయించింది. 16000-18000 మంది ఇప్పటి వరకూ గృహాలను కొనుగోలు చేశారని రాజితా రావు అన్నారు. ప్రస్తుతం 1.3 కోట్ల చదరపు అడుగుల నివాస స్థలాన్ని మై హోమ్‌ అభివృద్ధి చేస్తోంది. 


ఇందులో 5 నివాస ప్రాజెక్టులు, ఒకటి వాణిజ్య ప్రాజెక్టు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్కిష్య, అంకురా, మంగళ తదితర ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. 


వచ్చే ఎనిమిదేళ్లలో: వచ్చే ఎనిమిదేళ్లలో మరో 2 నుంచి 3 కోట్ల చదరపు అడుగుల నివాస, వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు రాజితా రావు తెలిపారు. ఇందులో భాగంగా కోకాపేట్‌, తెల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 10 నివాస, వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టనున్నాం. ఇందుకు కంపెనీ తరపు నుంచి దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇందులో సొంత నిధులతో పాటు రుణాలు కూడా ఉంటాయి.


సిమెంట్‌పై ప్రతి ఏడాది రూ.100 కోట్లు: సిమెంట్‌ ప్లాంట్ల నవీకరణపై ప్రతి ఏడాది రూ.100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని.. తద్వారా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి కోటి టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి సామర్థ్యం ఉందని.. ప్రస్తుతానికి అదనంగా సామర్థ్యాన్ని సమకూర్చుకునే ఆలోచన లేదని తెలిపారు. నిర్మాణ, సిమెంట్‌ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్‌, విద్యుత్‌ కన్సల్టెన్సీ, విద్యా, మీడియా రంగాల్లో మై హోమ్‌ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. కొత్త రంగాల్లోకి ప్రస్తుతం ప్రవేశించబోమని చెప్పారు. హైదరాబాద్‌లో గృహాల విక్రయాలు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయని, లాక్‌డౌన్‌ సమయంలో గృహాల కోసం విచారణలు పూర్తిగా నిలిచిపోయినా అనంతరం ఒక్కసారిగా పెరిగాయని రాజితా రావు అన్నారు. కాగా ప్రస్తుతం గ్రూప్‌ టర్నోవర్‌ రూ.5,000 కోట్లుంది. 

Updated Date - 2021-01-23T06:12:02+05:30 IST