స్వాతంత్ర్యోద్యమంలో ‘మా నాన్న’

ABN , First Publish Date - 2022-08-13T07:22:46+05:30 IST

ఆమె పేరు విజయలక్ష్మి. వయసు 86 ఏళ్లు. చిత్తూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కె.జి.నరసింగరావు కుమార్తె. నర్సుగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

స్వాతంత్ర్యోద్యమంలో ‘మా నాన్న’
స్వాతంత్య్ర సమరయోధుడు కేజీ నరసింగరావు

కె.జి.నరసింగరావు కుమార్తె విజయలక్ష్మి జ్ఞాపకాలు


చిత్తూరు కలెక్టరేట్‌: ఆమె పేరు విజయలక్ష్మి. వయసు 86 ఏళ్లు. చిత్తూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కె.జి.నరసింగరావు కుమార్తె. నర్సుగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈమె భర్త వైద్యుడు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో నివాసం. స్వాతంత్య్రం వచ్చినరోజు.. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నప్పుడు ఈమె వయసు పదేళ్లు. నాటి ఘటనలు, స్వాతంత్య్ర ఉద్యమంలో తన తండ్రి పాల్గొన్న ఘటనలను ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. 


‘‘మా నాన్న నరసింగరావు, అమ్మ కృష్ణాబాయి. విద్యార్థి దశలోనే ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమంలో పాల్గొన్నారు ఉప్సు సత్యాగ్రహంలో లాఠీదెబ్బలు తిన్నారు. దేశోద్ధారక విశ్వనాథ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వితంతు వివాహ కార్యక్రమంలోను.. ఖాదీఉద్యమంలోనూ పాల్గొన్నారు. క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని గిరింపేట సబ్‌జైలులో శిక్ష అనుభవించారు. మా నాన్నతో పాటు పూలకృష్ణ, బాబా సాహెబ్‌, ఎస్‌.విశ్వనాథం, టికెటిఎన్‌ఆర్‌ తాతాచ్చారి, మిట్టా కృష్ణయ్యశెట్టి, పొలకల నరసింహారెడ్డి (మాజీ ఎంపీ), టి.రాజాశెట్టి, సి.దాస్‌ (మాజీమంత్రి), డి.శ్రీనివాస్‌ అయ్యంగార్‌, బి.సుబ్రహ్మణ్యం మొదలియార్‌ లాంటి వాళ్లూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. వీరంతా మా ఇంటి అరుగుపై కూర్చొని ఉద్యమంపై ప్రణాళికలు వేసేవారు. అహ్మదాబాద్‌ నుంచి మహాత్మాగాంధీ నడిపే హరిజన్‌ పత్రికను బెన్నీ లాంగ్‌ క్లాత్‌ వస్త్రాల శాంపిల్స్‌లో దాచి మాకు పంపేవారు. దాన్ని మా నాన్న హిందీ నుంచి తెలుగులో తర్జుమా చేసి ఇక్కడి వారికి చెప్పేవారు. హరిజన్‌ హిందీ పత్రికలను మా అమ్మ ఇంట్లో దాచిఉంచేది. వీటికోసం పోలీసులు పలుమార్లు సోదాలు చేశారు. ఈ దాడుల విషయం దూర్వాసులు అనే కానిస్టేబుల్‌ ముందుగానే మాకు సమాచారం ఇచ్చేవారు. మా నాన్నతో పాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి రాత్రివేళల్లో ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. కలెక్టర్‌ బంగ్లా, ఎస్పీ బంగ్లా, జిల్లా జడ్జి బంగ్లాతో పాటు మెసానికల్‌ గ్రౌండ్‌కు వెళ్ళే గోడలపై పెయింటింగ్‌తో క్విట్‌ ఇండియా... గో బ్యాక్‌ సైమన్‌.... అంటూ రాతలు రాసేవారు. 


గాంధీ పక్కన మా నాన్న 

చిత్తూరుకు గాంధీ రెండుసార్లు వచ్చారు. రెండోసారి ప్రస్తుత మున్సిపల్‌ బస్టాండు ఎదురుగా ఉన్న భవనానికి రాగా మానాన్న గాంధీ పక్కనే ఉన్నారు. నాన్నతోపాటు గాంధీగారిని దగ్గరగా చూసిన అనుభూతి ఇప్పటికీ నేను మర్చిపోలేను. అప్పటి గాంధీముఖం ఇప్పటికీ నాకు లీలగా గుర్తుంది. 


జర్నలిస్టుగా.. 

8వ తరగతి చదువుకున్న మా నాన్న వ్యాపారరీత్యా అక్కడక్కడా పనిచేస్తూ 1934లో చిత్తూరుకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషలకు సంబంధించిన తద్భవ, తత్సమ శబ్ధ నిఘంటవు లాంటి పుస్తకాలను రచించి ముద్రించి, సాహితీఅభిమానులకు పంచిపెట్టేవారు. 1934 నుంచి చిత్తూరులో ఆంధ్రపత్రిక, భారతికి ఏజెంటుగా, పత్రికా విలేఖరిగా పనిచేశారు. సమావేశాల వార్తలను పోస్టులో మద్రాసుకు పంపితే మూడో రోజు ప్రచురితమయ్యేవి. బాలల్లో వికాసాన్ని పెంపొందించేందుకు చిత్తూరులో బాపూజీ బాలానందసంఘం 1946లో ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చాక జిల్లా కాంగ్రె్‌సకమిటీకి గౌరవకార్యదర్శిగా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీకి ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. తుదిశ్వాస విడిచేంతవరకు ఖద్దరు జుబ్బా, కీపాస్‌, టోపీలను ధరించారు. 


స్వాతంత్య్రం వచ్చిన రోజు.. 

నాకు పదేళ్ల వయసు.. 1947 ఆగస్టు 14వ తేది అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలియగానే చాలామంది రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు కౌగిలించుకుని ఆనందపడ్డారు. చిత్తూరులోని చర్చివీధిలో మా ఇల్లు. ప్రస్తుత పోలీసు పరేడ్‌ మైదానం ఎదురుగా పెద్ద ఖాళీ స్థలం ఉండేది. మా ఇంటి నుంచి కుటుంబ సభ్యులు, మిత్రులందరం మైదానానికి వెళ్లాం. అప్పటికే వందలాది మంది చేరుకున్నారు. మహాత్మాగాంధీ త్యాగనిరతిని కొనియాడుతూ పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ఉపన్యాసాలిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన రోజున మా ఇంట్లోనే బూందీ చేసి తిరుపతి లడ్డూ సైజులో లడ్డూలను చేయించి అందరికీ పంచాం. స్కూల్లో పిల్లలకు పిప్పరమెట్లను పంచడం నాకింకా గుర్తుంది.



Updated Date - 2022-08-13T07:22:46+05:30 IST