నా ప్రవర్తనే ఇండస్ట్రీలో నన్ను నిలబెడుతుంది!

ABN , First Publish Date - 2022-06-20T08:37:40+05:30 IST

ఆయనలో నటుడే కాదు, దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు.

నా ప్రవర్తనే ఇండస్ట్రీలో నన్ను నిలబెడుతుంది!

ఆయనలో నటుడే కాదు, దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు. క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలలో మెప్పించిన ఆయన ఇప్పుడు మేజర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే అడివి శేష్‌. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ సంభాషణలు ఇవి. 


ఆర్కే: వెల్‌కమ్‌ టు ఓపెన్‌ హార్ట్‌. నమస్తే శేషు. ఎలా ఉన్నారు? మేజర్‌ సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారా?

అడివి శేష్‌:  ఎక్స్‌ట్రీమ్లీ టైర్‌డ్‌. ఎక్స్‌ట్రీమ్లీ హ్యాప్పీ!


ఆర్కే: టైర్‌డ్‌ ఎందుకు? ప్రమోషన్‌ గురించా?

అడివి శేష్‌: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే గారిని కలిశాం. అలాగే యుపి సిఎం, ప్రెసిడెంట్‌ గారిని కూడా కలవబోతున్నాం. ఒక రోజు చండీఘడ్‌, ఇంకొక రోజు ఏలూరు. ఇలా తిరిగే క్రమంలో అలసిపోతున్నాం. 


ఆర్కే: చిన్న చిన్న వేషాలతో స్ట్రగుల్‌ అయిన మీరు, ఈ సినిమాతో సడెన్‌గా పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. మీకెలా అనిపిస్తోంది?

అడివి శేష్‌: ఇలా ఓవర్‌నైట్‌ సక్సె్‌సను అందుకోడానికి పదేళ్లు పట్టింది. 


ఆర్కే: పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారన్నమాట?

అడివి శేష్‌: ఐదేళ్లుగా హ్యాపీగానే ఉన్నాను. పంజా నుంచి బాహుబలి వరకూ విలన్‌ రోల్స్‌, సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేశాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి, కొంత స్ట్రగుల్‌ తర్వాత క్షణం సినిమాతో నిలదొక్కుకున్నాను. 


ఆర్కే: మీరు అమెరికాకు ఎప్పుడెళ్లారు?

అడివి శేష్‌: 1991లో నాన్నగారు అమెరికా వెళ్లారు.


ఆర్కే: అక్కడే పుట్టావా?

అడివి శేష్‌: ఇక్కడే కిర్లోస్కర్‌ నర్సింగ్‌హోంలో పుట్టాను. 


ఆర్కే: ఇక్కడ పుట్టి, అక్కడ పెరిగి, సిటిజన్‌షిప్‌ తీసుకున్నారన్నమాట!

అడివి శేష్‌: నాన్నగారికి హైలీ క్వాలిఫైడ్‌ స్టేటస్‌ ఉంది. అలా నాన్నగారికి గ్రీన్‌కార్డు చాలా త్వరగా వచ్చేసింది. అలా నేను అండర్‌ 18 అయినప్పటికీ, నాకు యుఎస్‌ సిటిజన్‌షిప్‌ వచ్చేసింది.


ఆర్కే: ఇక్కడి నుంచి అందరూ అమెరికా పరిగెత్తాలని చూస్తూ ఉంటారు. కానీ మీకు ఇక్కడకు రావాలని ఎందుకు అనిపించింది? అది కూడా సినిమా పిచ్చితో...

అడివి శేష్‌: దానికి రెండు రీజన్స్‌ ఉన్నాయి. 1996లో రెహమాన్‌ గారి వందేమాతరం పాట వచ్చింది. ఆ సమయంలో మాకు నమస్తే ఇండియా అనే ఒక అరగంట ప్రోగ్రాం ఉండేది. ఆ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు వందేమాతరం పాట రాగానే కూర్చున్న వాడిని కాస్తా నిలబడి చూసేవాడిని. నా మనసులో ఇండియాను గ్లోరిఫై చేసుకునేవాడిని. యుఎ్‌సలో నేను పరాయివాడిలా ఫీల్‌ అయ్యానేమో. ఆ ఫీలింగ్‌ అలా ఉండిపోయింది. ఇక సినిమాలు, ఇండియా కలిసేటప్పటికి వెళ్లాల్సిందే అనిపించింది.


ఆర్కే: అడివి బాపిరాజు గారు మీకేమవుతారు?

అడివి శేష్‌: ఆయన మా గ్రాండ్‌ అంకుల్‌. తాతయ్య అడివి గంగరాజు గారు. ఆయన త్యాగరాజ కీర్తనల మీద పుస్తకాలు రాశారు. ఫ్రీడం ఫైటర్‌గా తామ్ర పత్రం కూడా అందుకున్నారు. మా పెద్ద నాన్నగారు దాసరి నారాయణ రావు గారికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. అయితే నాన్నగారికి హీరో అవ్వాలని ఉండేది. సూత్రధారులు సినిమాకు ఒక హీరోగా సెలక్ట్‌ అయ్యారు. అయితే షూటింగ్‌ దగ్గరపడే సమయంలో యాక్సిడెంట్‌ అయింది. అలా ఏడాది పాటు ఆస్పత్రిపాలయ్యేటప్పటికీ, ఇంట్లో వాళ్లు కూడా సినిమా ప్రయత్నాలు మానుకోమన్నారు.


ఆర్కే: డెస్టినీ ఇంకేదో ఉండి ఉంటుంది. కాబట్టే ఇలా జరిగింది అనుకుని ఉంటారు. అంతేనా?

అడివి శేష్‌: నీకు సినిమాల్లో నటించాలని రాసి పెట్టి లేదు అని నాన్న విషయంలో అన్న తాతయ్య, నా విషయంలో, నీకు రాసిపెట్టి ఉంది అని అనేశారు. ఆయన అలా సర్టిఫై చేయబట్టే, నాన్నగారు కూడా ఒప్పుకొన్నారు. చెల్లెలు డాక్టర్‌ అయింది. నేను యాక్టర్‌ అయ్యాను. 


ఆర్కే: మీరేం చదివారు?

అడివి శేష్‌: నేను కాలేజ్‌ డ్రాపవుట్‌. బ్యాచిలర్స్‌ ఇన్‌ సినిమా శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్శిటీ ఫిల్మ్‌ ప్రోగ్రాం, థర్డ్‌ ఇయర్‌లో డ్రాపవుట్‌ అయిపోయాను.  


ఆర్కే:  తర్వాత హైదరాబాద్‌ బయల్దేరారా?

అడివి శేష్‌: లేదు. ఆ తర్వాత కొన్నేళ్లు పని చేసి, మనీ సేవ్‌ చేసి, అమ్మానాన్న దగర్నుంచీ, ఫ్రెండ్స్‌ నుంచీ కొంత డబ్బు, క్రెడిట్‌ కార్డు నుంచి కొంత డబ్బు తీసుకుని, కర్మ అనే సినిమా చేశాను. అది నా మొదటి సినిమా. అప్పట్లో కర్మను తెలుగులో ఖర్మ అని తిడతారని కూడా నాకు తెలియదు. నా ఉద్దేశంలో కర్మసిద్ధాంతం చాలా గొప్పది.


ఆర్కే:  కర్మ సినిమా తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారా?

అడివి శేష్‌: నాట్‌ ఎట్‌ ఆల్‌. నిజానికి చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాను. 


ఆర్కే:  మరి తెచ్చిన డబ్బంతా పోయిందిగా?

అడివి శేష్‌: అవును. అయితే స్పానిష్‌ డబ్బింగ్‌ రైట్స్‌ అమ్మాం. దానికి మంచి డబ్బులొచ్చాయి. వాళ్లకది నచ్చింది. అలా రావలసిన చోట డబ్బులు రాలేదు. కానీ.. మరో చోట వచ్చాయి.


ఆర్కే: ఊహించని చోట డబ్బొచ్చింది!

అడివి శేష్‌: అవును. 60 శాతం డబ్బులు తిరిగొచ్చేశాయి. పైగా నాకు ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి ఫోన్లు వచ్చేవి. అలా ఎవరో ఒకరు గుర్తించి, ఆదరిస్తున్నారు అనే సంతోషం కలిగింది.


ఆర్కే: చిన్న విలన్‌ క్యారెక్టర్లు వేయడమేంటి? ఇక చాల్లే వచ్చేసేయ్‌.. అని మీ నాన్నగారు ఎప్పుడూ అనలేదా?

అడివి శేష్‌: దిగిన తర్వాత అనలేదు. ఫ్యామిలీ సర్‌నేమ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ లేనప్పుడు ఆడియన్స్‌ మనలో ఏం చూసి ఇష్టపడాలి అనేది ప్రశ్న. ఏ ప్రొడ్యూసర్‌ నటుడికి ఫేవర్‌ చేయాలని కూర్చోడు. 


ఆర్కే: కొంతమంది ఏ బ్యాక్‌గ్రౌండ్‌, ఏ సర్‌నేమ్‌ లేకుండా కూడా సక్సెస్‌ అవుతారు కదా? మీరూ అయ్యారు కదా?

అడివి శేష్‌: మనం నిజాయితీగా, పట్టుదలగా చేయగలిగితే, టైం పట్టినా అనుకున్న పని అవుతుంది. 


ఆర్కే: మొదట్లో విలన్‌గా చేయడం బాధనిపించ లేదా?

అడివి శేష్‌:  దిల్‌ రాజు గారు ఒక మాట అన్నారు. నువ్వు హిందీ వాడిలా ఉంటావు, అయితే ప్రకాష్‌ రాజుగారు ఓల్డ్‌ అయ్యారు కాబట్టి, యంగ్‌ ప్రకాష్‌ రాజు గారి లోటును నువ్వు భర్తీ చేయాలి అన్నారు. మొదట్లో పవన్‌ కళ్యాణ్‌ గారు కూడా నేను హిందీ వాడిని అనుకుని, నాతో హిందీలో మాట్లాడేవారు. తర్వాత నేను తెలుగువాడిని అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. 


ఆర్కే: యుఎ్‌సలో ఉండి కూడా ఎలాంటి అలవాటూ అలవరుచుకోకుండా ఎలా ఉండగలిగారు?

అడివి శేష్‌: నేను యుఎ్‌సలో మిస్టర్‌ ఇండియా నార్త్‌ పోటీలో గెలిచాను. అప్పుడు స్టేజీ మీద నా చేతికి షాంపేన్‌ ఇచ్చినప్పుడు ఒక సిప్‌ తాగాను. నచ్చింది. కానీ నచ్చినదాన్ని అమితంగా ప్రేమించే స్వభావం ఉన్నప్పటికీ, పర్యవసానాలు తెలుసు కాబట్టి మద్యానికి దూరంగా ఉన్నాను. నాకు చాక్లెట్లంటే చాలా ఇష్టం. అయినా సినిమాల మీద అంతకంటే ఇష్టం ఎక్కువ కాబట్టి, సరైన షేప్‌లో ఉండడం కోసం ఆ ఇష్టాన్ని చంపుకొన్నాను. 


ఆర్కే: సినిమా నటుడవ్వాలని అనుకున్నారు. కానీ డైరెక్టర్‌ అయ్యారు, రైటర్‌ కూడా అయ్యారు. ఎందుకు?

అడివి శేష్‌: అవసరంకొద్దీ డైరెక్టర్‌ని అయ్యాను. నా ఫ్యూచర్‌ని నేనే ఏర్పాటుచేసుకోవాలనే ఆలోచనతో రైటర్‌ని కూడా అయ్యాను. 


ఆర్కే: సినిమా అన్న తర్వాత దానికి ఎంతో కొంత గ్లామర్‌ అద్దక తప్పదు. గూఢచారి సినిమాలో ఒకటో రెండో ముద్దులు కూడా పెట్టినట్టున్నారు?

అడివి శేష్‌: ముద్దును నేను ప్రేమకు ఎక్స్‌ప్రెషన్‌గానే చూస్తాను తప్ప దాన్నొక బూతులా చూడను. రేప్‌ బేస్‌గా రూపొందిన ‘ఎవరు’ సినిమాలో నా క్యారెక్టర్‌కి హీరోయినే ఉండదు. సన్నివేశాన్ని కథ డిమాండ్‌ చేయాలి తప్ప కలెక్షన్ల కోసం సన్నివేశాలు ఉండాలని నేను అనుకోను. 


ఆర్కే: మీరు డ్యూయెట్లు ఎందుకు చేయరు? డ్యాన్స్‌ రాదా?

అడివి శేష్‌: డ్యాన్స్‌ గురించి నాకు డౌటుంది. కానీ ట్రై చేస్తాను. భవిష్యత్తులో ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ లవ్‌ స్టోరీ చేయాలనే ఆలోచన ఉంది. నేను బేసిక్‌గా మృదుస్వభావిని. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవాడిని. 


ఆర్కే: మేజర్‌తో మీ బాధ్యత మరింత పెరిగింది. తర్వాత ఏం చేయబోతున్నారు?

అడివి శేష్‌: నా అభిమాన దర్శకులు నానిగారు నాతో ‘హిట్‌2’ చేయబోతున్నారు. తర్వాత ‘గూఢచారి2’ చేస్తాను. హిందీ, తెలుగులో రీమేక్‌ అవబోతున్న ఒక హాలీవుడ్‌ ఆస్కార్‌ ఫిల్మ్‌లో నటించడంతో పాటు, రైటర్‌గా పని చేసే అవకాశం వచ్చింది.


ఆర్కే: ఇండస్ట్రీలో ఇండిపెండెంట్‌గా ఎదగాలని అనుకున్న హీరోలు తెరమరుగైపోయిన సందర్భాలున్నాయి. మరి మీ పరిస్థితి ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారు?

అడివి శేష్‌: అంతా ప్రవర్తనలోనే ఉంటుంది. నా ప్రవర్తనే నన్ను కలకాలం నిలబెడుతుందని అనుకుంటున్నా. రాబోయే ఐదు సినిమాలు వరుసగా సక్సెస్‌ కావాలన్నదే నా లక్ష్యం.



ఎలాంటి చెడు జరగాలన్నా, 

రాత్రి రెండు గంటల తర్వాతే జరుగుతుంది అని నేను నమ్ముతాను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి చెడు ఉన్న చోట నేను కనిపించను. 


నాన్నగారు మొట్టికాయలు  

వేసి మరీ తెలుగు నేర్పించారు. 

ప్రతి వినాయకచవితికీ వచ్చీ రాని 

తెలుగులో చదువుతూ, రెండు గంటల్లో ముగియాల్సిన పూజను 


అఖిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు, సడెన్‌గా టిఆర్‌పి 

పెరిగిపోయేదట. అప్పటికింకా అతను సినిమాల్లో అడుగుపెట్టలేదు. సిసింద్రీ సినిమా వల్ల సిసిఎల్‌లో అతనికి అవకాశం దొరికింది. అది తెలిసి నేను షాక్‌ అయ్యాను. బ్రాండింగ్‌ అంటే అదే! ఆ లెగసీ వల్లనే జనాలు ఇష్టపడతారని నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు నా బ్రాండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలనే ఆలోచన మొదలైంది. అలా సొంత బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోడానికి ఐదేళ్లు పట్టింది. 


ఆర్కే: ఆ మధ్య కాలంలో 6 ప్యాక్స్‌, 8 ప్యాక్స్‌ ట్రెండ్‌ నడిచింది కదా?

అడివి శేష్‌: నా మటుకు నేను ‘మేజర్‌’ సినిమా కోసం ఆర్మీ ఫిట్‌నెస్‌ కోసం కష్టపడ్డాను. ‘ఎవరు’ సినిమాలో 84 కిలోలున్నాను. మేజర్‌ సినిమాకు 73 కిలోలకు చేరుకున్నాను. మళ్లీ 76, 81 ఇలా మారిపోతూ ఉంది.


ఆర్కే: ఇలా పెరగడం, తగ్గడం వల్ల ఆరోగ్యం దెబ్బతినదా? ఇప్పుడు బాగానే ఉన్నా, లేటర్‌ స్టేజ్‌లో దాని ప్రభావం కనిపిస్తుంది కదా?

అడివి శేష్‌: ఈ వయసులోనే కనిపిస్తుంది. అలా చేయడం వల్లనే నా ఇమ్యూనిటీ పడిపోయింది. దాంతో డెంగ్యూ వచ్చి, 15 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. రెండున్నర లక్షలు ఉండాల్సిన ప్లేట్‌లెట్‌ కౌంట్‌ ఒక సందర్భంలో 12 వేలకు పడిపోయింది. 


ఆర్కే: మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ను ఎంచుకోడానికి కారణం?

అడివి శేష్‌: ఆయన ఫొటో చూసినప్పుడు ఆయనకూ నాకూ ముఖంలో పోలికలున్నట్టు అనిపించింది. ఆయన ఆర్కుట్‌ పేజ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ప్రతి ఏడాదీ ఆయన బర్త్‌ యానివర్సరీకి ఆయన పొందిన అశోక చక్ర గురించి చెప్పేవారు. ఆయన ఆర్కుట్‌ పేజ్‌లో ఆయన వ్యక్తిగత జీవితం కనిపించేది. అలా క్షణం చేస్తున్నప్పుడే ఆయన గురించిన సినిమా ఉండాలి అనిపించింది. 


ఆర్కే: ఆయన కుటుంబాన్ని కలిశారా?

అడివి శేష్‌: ఇప్పుడు నాకు వాళ్లు సెకండ్‌ ఫ్యామిలీ. ఆఫ్‌స్ర్కీన్‌ మేజర్‌ సందీప్‌ కాకపోయినా, వాళ్లకు నేను రెండో కొడుకునే!


ఆర్కే: పేరెంట్స్‌ నుంచి కామెంట్లొచ్చాయా?

అడివి శేష్‌: 16, 17 ఏళ్ల వరకూ నాన్నగారిదే ఫైనల్‌ డెసిషన్‌. కానీ ఇప్పుడు నేను లేనిదే నాన్నగారు ఏ నిర్ణయమూ తీసుకోరు. 


ఆర్కే: పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అడగడం లేదా?

అడివి శేష్‌: ప్రారంభంలో మేమే అమ్మాయిని సెలెక్ట్‌ చేస్తాం అన్నవాళ్లు, అమ్మాయైుతే చాలు రా, పెళ్లి చేస్తాం అనే వరకూ వచ్చేశారు. నా  మీద నుంచి దృష్టి మరల్చడం కోసం అమ్మానాన్నలకు ఓ కుక్కపిల్లని తెచ్చి పెట్టాను. ఇప్పుడది మా ఇంట్లో రెండో కొడుకు స్థానం సంపాదించేసింది. మా చెల్లికి వచ్చే ఏడాది జనవరి 26న పెళ్లి చేయబోతున్నాం. ఆమెకు కాబోయే భర్త అమెరికన్‌. వాళ్ల పెళ్లిని తెలుగు సంప్రదాయంలో చేయబోతున్నాం. 


ఆర్కే: పెళ్లి మీద అయిష్టం ఎందుకు ఏర్పడింది? ఎక్కడైనా ఎదురుదెబ్బలు తిన్నారా?

అడివి శేష్‌: తిన్నాను. యుఎ్‌సలో ఒక పంజాబీ అమ్మాయితో ప్రేమలో పడి, బాగా దెబ్బతిన్నాను. నా పుట్టినరోజు నాడే ఆ అమ్మాయి పెళ్లైపోయింది. రిలేషన్‌షిప్స్‌ నడిచినా, వాటిని పెళ్లివరకూ తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోతున్నాను. 


ఆర్కే: అయితే ఇక్కడ మీరు సల్మాన్‌ ఖాన్‌నే ఆదర్శంగా తీసుకుంటున్నట్టు ఉన్నారు. రిలేషన్‌షిప్‌ వరకూ ఫర్వాలేదు, కానీ పెళ్లంటే భయపడుతున్నారు!

అడివి శేష్‌: భయమో, ఇబ్బందో  తెలియదు. కానీ ఏదో తెలియని భయం.


ఆర్కే: మరి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేనట్టేనా?

అడివి శేష్‌: నాకు చాలా యాంబిషన్లు ఉన్నాయి. ‘గూఢచారి 2’ చేయాలి. వీటికి పెళ్లి అడ్డంకి అనిపిస్తుంది.

Updated Date - 2022-06-20T08:37:40+05:30 IST