మువ్వన్నెల కృష్ణమ్మ

ABN , First Publish Date - 2022-08-15T09:33:28+05:30 IST

కృష్ణమ్మ తన నురగలకు త్రివర్ణ పతాక హంగులను అద్దుకుంది.

మువ్వన్నెల కృష్ణమ్మ

సాగర్‌ నుంచి ప్రవాహం కనువిందు.. ప్రాజెక్టులో 297 టీఎంసీలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కృష్ణమ్మ తన నురగలకు త్రివర్ణ పతాక హంగులను అద్దుకుంది. సాగర్‌ నుంచి దిగువకు మూడు రంగుల్లో ప్రవహిస్తోంది. సాగర్‌లో 26 గేట్ల నుంచి నీరు విడుదలవుతుండగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మువ్వన్నెలు నీళ్లపై పడేలా విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. అలా జెండా రంగులను పులుముకున్నట్లుగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అక్కడి పర్యాటక ప్రాంతాలైన కొత్తవంతెన, బుద్ధవనం, ప్రధాన జలవిద్యుత్కేంద్రం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. కాగా ఎగువ నుంచి సాగర్‌లోకి 3,76,383 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 297.14 టీఎంసీల మేర నీరు చేరింది. శ్రీశైలానికి స్వల్పంగా వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 3.89 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాగా భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం గత మూడు రోజులుగా తగ్గుతూ పెరుగుతూ ఉంది. శుక్రవారం 52.5 అడుగుల ఎత్తులో ప్రవహించిన గోదారి ఆ రోజు అర్ధరాత్రికి 50.3 అడుగుల ఎత్తుకు తగ్గి.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 50.8 అడుగులకు చేరింది. సాయంత్రానికి  స్వల్పంగా తగ్గి 50.4 అడుగులకు చేరుకుంది. 


నేడు అక్కడక్కడ భారీ వర్షాలు

రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది.  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  

Updated Date - 2022-08-15T09:33:28+05:30 IST