ముట్టిందల్లా మ్యుటేషనే..!!

ABN , First Publish Date - 2022-05-02T06:01:32+05:30 IST

అక్కడ మ్యుటేషన్‌కు పెట్టిన ప్రతి ఫైలూ చేసేస్తున్నారు. అవును మరి అధికారి అనగా ఆ పనే కదా చేయాలి అనుకుంటారు ప్రతి ఒక్కరూ. కానీ ఇక్కడ పరిస్థితి వేరు.

ముట్టిందల్లా మ్యుటేషనే..!!
నిమ్మనపల్లె తహసీల్దార్‌ కార్యాలయం

పట్టా భూమిగా డీకేటీల మార్పు

వందల ఎకరాలు..రూ.లక్షల్లో వసూళ్లు

నిమ్మనపల్లెలో భూబాగోతం


అక్కడ మ్యుటేషన్‌కు పెట్టిన ప్రతి ఫైలూ చేసేస్తున్నారు. అవును మరి అధికారి అనగా ఆ పనే కదా చేయాలి అనుకుంటారు ప్రతి ఒక్కరూ. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. పట్టా భూములు, చట్టప్రకారం చెల్లుబాటయ్యే భూములైతే ఓకే. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేస్తే ఎవరు కాదంటారు మరి. తన చుట్టూ ఉన్న కోటరీ చెబితే చాలు..భూముల స్వభావంతో పనిలేదు.. సంబంధిత కింది స్థాయి సిబ్బంది సంతకమే అవసరమే లేదు. పైసలు ముడితే చాలు.. నిమ్మనపల్లెలో మ్యుటేషన్‌ చేసేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.


మదనపల్లె, మే 1: నిమ్మనపల్లె మండల అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. డీకేటీతో పాటు ప్రభుత్వ భూములను సైతం ఇతరులపేరు మీద ఆన్‌లైన్‌ చేయడం ద్వారా వన్‌బీతో హక్కు కల్పిస్తున్నారని, దీంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.  ఇలా మండలంలో వందల ఎకరాల భూమిని మార్పు చేయడం ద్వారా రూ.లక్షలు చేతులు మారినట్లు స్థానికంగా చర్చనీయాంశమైంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 150 పైళ్లకుపైగా డీకేటీ భూములను మార్పు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌ చేసిన భూముల వివరాలు బయటపడి అవి వివాదాస్పదమైతే డిజిటల్‌ కీ తీసేస్తున్నారని తెలుస్తోంది. పేద, నిరుపేదల జీవనాధారం కోసం ప్రభుత్వం డీకేటీ పట్టాలు మంజూరు చేసింది. వంశపారంపర్యంగా అనుభవించుకోవాలే కానీ పరాధీనం చేయకూడదు. క్రయ, విక్రయాలు చేయకూడదు. ఒకవేళ భూయజమాని అవసరానికి అమ్మినా, తాకట్టు పెట్టినా చెల్లుబాటు కావు. అయితే చాలామంది 99 ఏళ్లకు శాశ్వత స్వాధీనం పేరుతో విక్రయాలు చేపట్టారు. ఇవి చట్టపరంగా చెల్లుబాటు కావన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి భూములను ప్రస్తుతం ఆన్‌లైన్‌ చేయడం ద్వారా ఇతరుల పేరుతో మార్పు చేసేశారు. ఇందుకోసం భూమి ఏరియా, విస్తీర్ణాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకూ చేతులు మారినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది.


ఎక్కడెక్కడంటే...

మండలంలోని బండ్లపై, ముష్ఠూరు, రెడ్డివారిపల్లె, రాచవేటివారిపల్లె, నిమ్మనపల్లె, తవళం, వెంగంవారిపల్లె, కొండయ్యగారిపల్లె, అగ్రహారం, సామకోటవారిపల్లె రెవెన్యూ గ్రామాల్లో మ్యుటేషన్లతో వసూళ్ల పర్వం కొనసాగింది. వీరిలో నలుగురు వీఆర్వోలు భూమిపై హక్కు మార్పిడిలో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో మొత్తం 13 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఎక్కువగా ఎనిమిది రెవెన్యూ గ్రామాల్లో డీకేటీ భూములను ఆన్‌లైన్‌ చేశారు. ఇందులో అధికంగా బండ్లపై గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఒక ఫైలుకు మాత్రమే రూ.30 లక్షలు చేతులు మారినట్లు ప్రచారంలో ఉంది.


ఆ భూములకు ధర ఎక్కువ

ప్రస్తుతం భూములకు ఎలాంటి ప్రాఽధాన్యం, విలువ ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా పరిధితో పని లేకుండా పల్లెలకూ విస్తరిస్తున్నారు. రెడ్డివారిపల్లె, రాచవేటివారిపల్లె గ్రామాలు మదనపల్లెకు ఆనుకుని ఉండటం, బండ్లపై రెవెన్యూ గ్రామం బోయకొండకు దగ్గరగా ఉండటం, ఇక నిమ్మనపల్లె.. మండల కేంద్రం కావడంతో విలువ పెరిగింది. పైగా ఈ మండలంలో సగం అటవీ ప్రాంతంలో విస్తరించి ఉండటంతో డీకేటీ భూములు ఎక్కువగా ఉన్నాయి. పైగా వీటిని వ్యవసాయం చేయడానికి అనువుగాను, ధర తక్కువగా ఉండటంతో పట్టణ వ్యాపారులు ప్రస్తుతం అక్కడ మొగ్గు చూపుతున్నారు.


పెత్తనమంతా ఆ నలుగురిదే

డీకేటీ భూముల ఆన్‌లైన్‌ విషయంలో కొందరు సంబంధిత వీఆర్వోలు తిరస్కరించినా, సంతకం చేయకపోయినా మండలం మొత్తం ఆ నలుగురే చేసేస్తున్నారు. కార్యాలయంలోని ఓ సీనియర్‌ అసిస్టెంట్‌తో కలసి ఫైలు సిద్ధం చేసి అధికారితో ఆమోదం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. వన్‌బీ చేయడమే కాదు..కొన్నింటిని ఆర్‌ఓఆర్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడి వివాదం వరకూ వెళితే వెంటనే ఆన్‌లైన్‌లో డిజిటల్‌ కీ తీసేస్తున్నారు.


ఆరు నెలల్లో పరిశీలిస్తే

గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ చూస్తే బండ్లపై రెవెన్యూ గ్రామంలో 22 ఫైళ్లు, ముష్ఠూరులో 28, రెడ్డివారిపల్లెలో 16, రాచవేటివారిపల్లెలో 18, నిమ్మనపల్లెలో 15, తవళం గ్రామంలో 40, అగ్రహారంలో 15, సామకోటవారిపల్లెలో 10 ఫైళ్లు ఆన్‌లైన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో సుమారు 300 ఎకరాలకుపైగా డీకేటీ, ప్రభుత్వ, చుక్కల భూములు, వివాదంలోనివి, కోర్టు కేసులు ఉన్నట్లు తెలిసింది. కోర్టు కేసుల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు రెండు నాల్కల ఽధోరణి అవలంభిస్తున్నారు. కేసుల భూములపై అభ్యంతరం వస్తే తమకేమీ చేయొద్దని ఆదేశాలు లేవని చెబుతుండగా, సొమ్ములిచ్చుకోలేని రైతులు వస్తే మాత్రం ఆ భూమిపై వివాదం ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని చెబుతూ పైసలు సంపాదించుకునే అస్త్రంగా వాడుకుంటున్నారు.


ఉదాహరణకు తీసుకుంటే...

- నిమ్మనపనల్లె మండలం వెంగంవారిపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్‌ 1049-2జిలోని 1.50 ఎకరాలు, సర్వే నెంబర్‌ 1047-4జిలోని 3.47 ఎకరాల డీకేటీ భూమిని ఓ మహిళ పేరుతో వన్‌బీ చేశారు.

- వెంగంవారిపల్లె సర్వే నెంబర్‌ 352-9హెచ్‌లోని 1.90 ఎకరాలు మరో మహిళ పేరున, అదే రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్‌ 352-9కేలోని 2.50 ఎకరాలను ఓ రైతు పేరున వన్‌బీ చేశారు. డీకేటీ భూమిని వన్‌బీ చేసిన తర్వాత అనువంశికంగా నమోదు చేయడం విశేషం.

- అదే రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్‌ 1049-3హెచ్‌లోని 1.94 ఎకరాలను ఓ వ్యక్తి పేరున ఆన్‌లైన్‌ చేశారు. అలాగే ఆ గ్రామంలో మొత్తం 1084 సర్వే నెంబర్లు ఉండగా తాజాగా సర్వే నెంబర్లు 1260-2, 1260-3, 1261-2లో ఖాతాల పరిధిలో 11 ఎకరాలు సృష్టించారు. అంతేకాదు ఆర్‌వోఆర్‌లో నమోదు చేశారు. వీటిల్లో డీకేటీతో పాటు సమీపంలోని ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెబుతున్నారు.

- మూష్ఠూరు గ్రామం సర్వే నెంబరు 1706-1బిలోని 3.48 ఎకరాలు, సర్వే నెంబరు 1703-2లో 5 ఎకరాలు వన్‌బీ చేశారు. కొండయ్యగారిపల్లె సర్వేనంబర్‌ 165లోనూ ఇలాగే చేశారు. ఇవి మచ్చుకు మాత్రమే. ప్రతి గ్రామంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


అలాంటి వాటిని రెక్టిఫై చేశాం

-సి.ఆర్‌.మంజుల, తహసీల్దార్‌, నిమ్మనపల్లె


మొదట్లో తెలియక ఒకటో రెండో చేసిన తర్వాత వెంటనే రెక్టిఫై చేశాం. కొందరు సిబ్బంది తమను తప్పుదోవ పట్టించి సంతకాలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వెంటనే జాగ్రత్తపడి వారిని పక్కన పెట్టేశా. వారు అనుకున్న పనులు జరగకపోవడంతో ఒకరిపై ఒకరు  వేసుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం డీటీ సంతకం చేసిన ఫైలు మాత్రమే స్వీకరిస్తున్నాను. అడ్డదిడ్డంగా చేయాలంటే ఉద్యోగమంటే మాకు భయం ఉంటుంది. తల్లి నుంచి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న వాటిని మార్పు చేశాం. కోర్టు కేసులు ఉన్న ప్రభుత్వ, చుక్కల భూములు అలాంటివేమీ చేయలేదు. 

Updated Date - 2022-05-02T06:01:32+05:30 IST