ముత్యపు పందిరిలో నల్లనయ్య తేజసం

ABN , First Publish Date - 2022-09-30T07:39:04+05:30 IST

ముత్యపు పందిరి వాహనంలో అధిరోహించి వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీవారు భక్తకోటిని మురిపించారు

ముత్యపు పందిరిలో నల్లనయ్య తేజసం

తిరుమల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముత్యపు పందిరి వాహనంలో అధిరోహించి వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీవారు భక్తకోటిని మురిపించారు.తిరుమల బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన గురువారం రాత్రి   ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా కళాకారుల ప్రదర్శనల నడుమ ముత్యపుపందిరి వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది.ఉదయం 8 గంటలకు స్వామివారు అనంతతేజోమూర్తిగా సింహవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం పరాక్రమ సింహంపై యోగముద్ర భంగిమలో కూర్చుని ఊరేగారు.గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది. శనివారం గరుడవాహన సేవ ఉన్న క్రమంలో శుక్ర, శనివారాలు తిరుమలలో ఉండేలా భక్తులు గురువారం మఽధ్యాహ్నం నుంచే తిరుమలకు చేరుకుంటున్నారు.వాహనసేవల్లో జీయర్‌స్వాములు, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు రాములు, పోకల అశోక్‌కుమార్‌, జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి, సీవీఎస్వో నరసింహ కిషోర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 గరుడసేవలో హారతుల స్థానంలో భక్తులకు అనుమతి

 బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడసేవ అక్టోబర్‌ 1వ తేదీన జరుగనుంది.దాదాపు మూడు లక్షల మంది భక్తులకు  ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సౌత్‌ వెస్ట్‌ గేటు, నార్త్‌ వెస్ట్‌ గేటు, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల వద్దనున్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామివారి వాహనసేవకు అనుమతిస్తామన్నారు. ఒకరుహారతి ఇచ్చే సమయంలో దాదాపు ఐదుగురికి దర్శనం కల్పించవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే హారతులను రద్దు చేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి హారతి పాయింట్లో 10 మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు అవకాశముందన్నారు. రెండు లక్షల మంది, ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం మండపం వద్దకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించవచ్చన్నారు. తద్వారా దాదాపు 2.75 నుంచి 3 లక్షల మందికి స్వామి గరుడసేవ దర్శనం చేయించవచ్చని వివరించారు.వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. భక్తులందరికీ దర్శనం కల్పించిన తర్వాతే వాహనసేవ ముగుస్తుందన్నారు.

నేటినుంచి ద్విచక్ర వాహనాల అనుమతి రద్దు

 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహనమైన గరుడసేవ సందర్భంగా టీటీడీ శుక్రవారం నుంచి ఆదివారం వరకు తిరుమలకు ద్విచక్రవాహనాల అనుమతిని రద్దు చేసింది. శనివారం రాత్రి ఏడు గంటలకు గరుడసేవను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీతోపాటు వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంటుంది. ఈక్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్రవాహనాలకు అనుమతిలేదని టీటీడీ స్పష్టం చేసింది. ద్విచక్రవాహనాలకు అలిపిరి లింక్‌ బస్టాండ్‌లో పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. 

Updated Date - 2022-09-30T07:39:04+05:30 IST