Jun 7 2021 @ 22:26PM

దర్శకునిగా తొలి అవకాశం అలా వచ్చింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 8)

మృణాల్‌ సేన్‌తో ‘ఒక ఊరి కథ’

‘సుప్రియ హోటల్‌’ యజమాని, నా మిత్రుడు పరంధామరెడ్డికి కూడా సినిమాలంటే ఆసక్తి. తెలుగులో ఓ ఆఫ్‌బీట్‌ సినిమా తీయాలని ఆయన కోరిక. ముఖ్యంగా బెంగాలీ దర్శకుడు మృణాల్‌సేన్‌ అంటే ఆయనకు అభిమానం. ఆయనతో ఓ తెలుగు సినిమా తీయాలని ముచ్చటపడ్డారు. ఆ సినిమా ‘ఒక ఊరి కథ’(1977). అందులో నారాయణరావు హీరో, మమతాశంకర్‌ హీరోయిన్‌. వాసుదేవరావు తండ్రి పాత్ర పోషించారు. దేవదాసు కనకాలగారి భార్య లక్ష్మి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు. లేడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో పాటు అనుభవమున్న అసోసియేట్‌ డైరెక్టర్‌ కూడా ఉంటే బాగుంటుందని నన్ను అడిగారు పరంధామరెడ్డి. ఆ సమయంలో నేను ఖాళీగా ఉండటంతో సరేనన్నాను. ‘ఒక ఊరి కథ’ చిత్రానికి డైలాగులు ఎవరు రాస్తే బాగుంటుందా అనే అంశం మీద చాలా చర్చ జరిగింది. 


ఒక దశలో వామపక్ష భావాలు కలిగిన రచయిత చెరబండరాజుతో రాయిద్దాం అనుకుని ఆయన్ను పిలిపించాం. అయితే ఆయనకూ, దర్శకుడు మృణాల్‌ సేన్‌కూ సరిపడలేదు. ఎందుకంటే తను హిందీలో రాసిన డైలాగ్స్‌ని యథాతథంగా తెలుగులోకి అనువదించాలని మృణాల్‌ సేన్‌ అనేవారు. దానికి చెరబండరాజు అంగీకరించలేదు. ఆ తర్వాత నేను శ్రీశ్రీ పేరు సూచించాను. అదీ కుదరలేదు. చివరకు యండమూరి వీరేంద్రనాథ్‌‌ను పిలిపించి ఆయనతో మాటలు రాయించాం. యూనిట్‌లో తెలుగువాళ్ల సంఖ్య తక్కువ. అంతా హిందీలోనే మాట్లాడేవారు. లక్ష్మిగారు కూడా హిందీ బాగా మాట్లాడేవారు. నాకు హిందీ రాదు. పల్లెటూరి చదువుల వల్ల ఇంగ్లీషు కూడా ఫ్లూయంట్‌గా మాట్లాడలేను. దాంతో భాషా సమస్యవల్ల ఆ షూటింగ్‌ జరిగినంతకాలమూ ఇబ్బంది పడ్డాను. మొత్తానికి ఎలాగైతేనేం.. చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. సినిమా పెద్దగా ఆడలేదుగానీ అవార్డులు వచ్చాయి.

దర్శకునిగా తొలి అవకాశం

ఆ సినిమా తర్వాత మళ్లీ పి.సి.రెడ్డిగారి దగ్గర చేరి, ‘రాముడు–రంగడు’ చిత్రానికి పని చేశాను. ఆ చిత్రానికి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసిన పొన్నతోట రఘురామ్‌ నాకు సన్నిహితుడు. ఆయన ఓ రోజు ఉదయం ఓ ప్రపోజల్‌తో నా దగ్గరకు వచ్చారు. అదేమిటంటే, ఆయన నిర్మాతగా, నా దర్శకత్వంలో ఓ సినిమా తీయడం. అప్పటికి నేను పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్లయింది. దర్శకుడు కావాలని అంతగా ఆలోచించలేదు కానీ ఎప్పుడైనా దర్శకత్వం వహించే అవకాశం వస్తే చేయడం కోసం ఓ కథ తయారు చేసి పెట్టుకున్నాను. రచయిత మోదుకూరి జాన్సన్‌ ఆ కథకు ఇన్‌స్పిరేషన్‌. అదెలాగంటే.. ‘కొత్తకాపురం’ చిత్రానికి ఆయన రచయిత. నేను అసోసియేట్‌ డైరెక్టర్‌. అందుకోసం స్ర్కిప్ట్‌ పనిమీద ఆయన ఇంటికి తరచూ వెళ్లాల్సి వచ్చేది. ఒక రోజు వాళ్లింట్లో మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు లోపల నుంచి ‘జాన్సన్‌.. జాన్సన్‌’ అంటూ ఓ పెద్దావిడ పిలుపు వినిపించింది. ‘సార్‌.. మీ అమ్మగారు పిలుస్తున్నట్లున్నారు’ అన్నాను. ‘అమ్మ కాదు సుబ్బయ్యా, ఆవిడ మా ఆవిడ’ అన్నారు జాన్సన్‌ నవ్వుతూ. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లిద్దరికీ పదిహేనేళ్లు తేడా ఉంటుంది. అంత పెద్దావిడ ఈయన భార్యా?


ఆవిడ చూస్తే చాలా పెద్దావిడ... ఈయనకి అప్పటికి 30 ఏళ్లుంటాయేమో! మరి వారిద్దరు ఎలా పెళ్ళి చేసుకున్నారు.. పెద్దవాళ్లు అభ్యంతరం చెప్పలేదా.. నమ్మబుద్ది కాక జాన్సన్‌ వంక అయోమయంగా చూశాను. ఆయన నిజం చెబుతున్నారో, జోక్‌ చేస్తున్నారో అర్థం కాలేదు. నేను నమ్మడం లేదని గ్రహించి ‘నిజం సుబ్బయ్యా.. ఆవిడ మా ఆవిడే’ అని మరోసారి చెప్పారు జాన్సన్‌. ‘సార్‌ ..ఇదెలా జరిగింది?’ అని అడిగేంత చనువు మా ఇద్దరి మధ్య లేదు. పైగా అలా అడిగితే ఆయన ఏమన్నా అనుకుంటాడోనని మొహమాటం. అందుకే ఏమీ అడగకుండా మౌనం వహించాను. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదేమో జాన్సన్‌ కూడా టాపిక్‌ డైవర్ట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపు స్ర్కిప్ట్‌ గురించి మాట్లాడి బయటకు వచ్చేశాను. దారి పొడువునా జాన్సన్‌ పెళ్ళి గురించి ఆలోచనలే! ఎప్పుడో జరిగిన వాళ్ల పెళ్ళి గురించి ఇంతగా ఆలోచించడం నాకే వింతగా అనిపించింది. అయినా సరే అసలు ఆ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం నన్ను వదల్లేదు. అందుకే ఆ మర్నాడు జాన్సన్‌ కజిన్‌ బ్రదర్‌ని కలసి, ఆయన దగ్గర నుంచి వివరాలు రాబట్టేవరకూ మనసాగలేదు.


ఆవిడ ఏదో ఆస్పత్రిలో హెడ్‌ నర్స్‌గా చేసేది. జాన్సన్‌తో పరిచయమై బాగా క్లోజ్‌ అయ్యాక ఆయన లాయర్‌ డిగ్రీ పూర్తి చేయడానికి ఆర్థికంగా ఎంతో సహకరించింది. వారిద్దరి సన్నిహిత పరిచయం తెలియని బంధంగా మారింది. వయసు పెరుగుతున్నా ఎందుకో పెళ్ళి గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ జాన్సన్‌తో పరిచయమయ్యాక అటువంటి వ్యక్తి తనకు జీవితాంతం తోడుగా ఉంటే బాగుంటుందనిపించిందట. సిగ్గు విడిచి అదే విషయం జాన్సన్‌తో చెప్పింది. ఆయన మనసులోనూ అదే అభిప్రాయం ఉండటంతో వెంటనే సరే అన్నారు. తామిద్దరి మధ్య వయసు రీత్యా ఎంతో తేడా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకండా వెంటనే రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. లోకం ఏమనుకున్నా లెక్కచేయకుండా హ్యాపీగా కాపురం చేస్తున్నారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...