Jun 6 2021 @ 18:52PM

‘కొత్త కాపురం’లో గుమ్మడిగారి ప్రవేశం అలా జరిగింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 7)

‘కొత్త కాపురం’ చిత్రంలో మొదట అనుకున్న హీరోయిన్‌ చంద్రకళ. అయితే కృష్ణగారికీ, ఆమెకీ మధ్య ఏదో సమస్య వచ్చి, ఆమెని తీసేసి భారతిని పెట్టారు. దానికి కారణాలు ఏమిటన్నది మా వరకూ రాలేదు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రకు మొదట ఎంపిక చేసిన వ్యక్తి గుమ్మడి కాదు.. ఎస్వీ రంగారావు. అయితే ఈ మార్పు కావాలని చేసింది కాదు. రంగారావుగారి ఆకస్మిక మరణంతో ఆయన స్థానంలో గుమ్మడిగారిని తీసుకోవాల్సి వచ్చింది. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు రంగారావుగారు. ఆయనతో కొన్ని రోజులే పని చేసినా ఆ అనుభవాన్ని మరచిపోలేను. ఆ సమయంలో ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. వాటిల్లో మా ‘కొత్త కాపురం’ ఒకటి. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన చెప్పి తీరాలి. వేషాలు ఇప్పించమని చిన్న చిన్న ఆర్టిస్టులు అసోసియేట్‌ డైరెక్టర్ల చుట్టూ తిరగడం సహజమే. అలాగే ఓ ఆర్టిస్ట్‌ నా చుట్టూ తెగ తిరిగేవాడు. అతని బాధపడలేక ఈ సినిమాలో పోస్ట్‌మేన్‌ వేషం ఉంటే పి.సి.రెడ్డిగారికి చెప్పి అతనికి ఇచ్చాను. రంగారావుగారి కాంబినేషన్‌లో వచ్చే సీన్‌ అది. అతను కొంత అనుభవమున్న నటుడే. అయితే గంభీరంగా ఉండే రంగారావుగారిని చూసి బెదిరిపోయి, డైలాగ్‌ చెప్పడం మరచిపోయాడు. ‘సార్‌.. మీకు పోస్ట్‌ వచ్చింది’ అనే డైలాగ్‌ చెప్పాలి. అయితే ఆ నాలుగు ముక్కలు చెప్పడానికి కూడా అతను వణికి పోయాడు. రిహార్సల్స్‌లో బాగా చేసేవాడు. టేక్‌లో మాత్రం నోటి వెంట మాట వచ్చేది కాదు. అతను అలా రెండు మూడు టేకులు తినేసరికి రంగారావుగారికి కోపం వచ్చేసి ‘ ఏయ్‌.. ఎవడురా వీడు.. ఇలాంటి వాణ్ణి పట్టుకొచ్చిందెవడురా’ అని గర్జించారు. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న నాకు ముచ్చెమటలు పోశాయి. ‘ నా పనైపోయింది, ఇక రంగారావుగారితో తిట్లు తినాల్సిందే’ అనుకున్నాను. నేను అడుగు ముందుకేసేలోగా పి.సి.రెడ్డిగారు దేవుడిలా అడ్డుపడి రంగారావుగారికి ఏదో చెప్పి ఆయన కోపం తగ్గేలా చేశారు. పది నిముషాల తర్వాత ఆ ఆర్టిస్ట్‌ను దగ్గరకు పిలిచి ‘భయపడకు రా.. ధైర్యంగా డైలాగ్‌ చెప్పు’ అని అనునయించేసరికి ఆ ఆర్టిస్ట్‌ కొంత దారిలో పడి, ఈసారి టేక్‌లో చక్కగా డైలాగ్‌ చెప్పాడు. అలా గండం గడిచింది. ‘థాంక్‌ గాడ్‌’ అనుకున్నాను.


గురువుగారు సమాధిలో ఉన్నారు

రంగారావుగారు అద్భుతమైన నటుడు. సెట్‌లో మిగిలిన అందరినీ డామినేట్‌ చేసే యాక్టింగ్‌ ఆయన సొంతం. అయితే ఆయనకున్న ఒకే ఒక్క బలహీనత.. మద్యపానం. ఒక్కోసారి షూటింగ్స్‌ అన్నీ వదిలేసి, తోటలోని గెస్ట్‌ హౌస్‌లోనే ఉండి 15 రోజులు ఏకధాటిగా తాగేవారు. ఆ సమయంలో ఆయన్ని పలకరించడానికి పెద్ద పెద్ద నిర్మాతలే భయపడేవారు. ‘గురువుగారు సమాధిలో ఉన్నారు’ అనేవారంతా. ఆయన తోటలోంచి ఎప్పుడు బయటకు వస్తారోనని ఎదురు చూడటం తప్ప మరేం చేయలేని పరిస్థితి. ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలంతా అలా ఓపికగా ఎదురు చూసేవారు. ‘కొత్త కాపురం’ షూటింగ్‌ మొదలైన కొన్ని రోజులకు రంగారావుగారు ‘సమాధి’లోకి వెళ్లిపోయారు. దాంతో ఆయన వర్క్‌ అంతా పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే మిగిలిన నిర్మాతల్లా మా నిర్మాత వెంకటరత్నంగారు రంగారావుగారిని వదిలిపెట్టలేదు. రోజూ తోటకువెళ్లి రంగారావుగారిని కలిసేవారు. ఆయన మూడ్‌ బాగుంటే చూసి షూటింగ్‌కు రమ్మని బతిమాలేవారు. పట్టువదలని విక్రమార్కునిలా వెంకటరత్నంగారు వదిలిపెట్టకపోయేసరికి ‘సరే.. రేపటి నుంచి వస్తాను. ప్లాన్‌ చేసుకో.. పో’ అనేశారు రంగారావుగారు. రంగారావుగారు మాటంటే మాటే. కనుక వెంకటరత్నంగారు ఆనందంతో తిరిగి వచ్చి ఆ విషయం పి.సి.రెడ్డిగారికి చెప్పారు. అయితే ఇక్కడ ఓ సమస్య ఎదురైంది. అదేమిటంటే ‘కొత్త కాపురం’ సినిమా కోసం మిడిల్‌ క్లాస్‌ హౌస్‌ సెట్‌ వేశాం. ‘కాపురం, కొత్త కాపురం...’ అనే పాటలో హీరోహీరోయిన్లు ఆ ఇల్లు కట్టుకున్నట్లు చూపిస్తాం. కృష్ణగారు, భారతిగారు పాట పాడుకునే షాట్స్‌ తీశాం. రంగారావుగారి కాంబినేషన్‌లో సీన్లు తీయాలి. అవి తీసేలోగా ఆయన ‘సమాధి’లోకి వెళ్లిపోవడంతో ఆ సీన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆ ఫ్లోర్‌లోనే వేరే నిర్మాత కొత్త సెట్‌ వేసుకోవాలి కనుక మా సెట్‌ తీసెయాల్సి వచ్చింది. రంగారావుగారు ‘సమాధి’లోంచి రావడానికి ఎన్నిరోజులు పడుతుందో తెలీదు కనుక ఆయన వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని సెట్‌ తీసెయ్యడానికి అనుమతి ఇచ్చారు పి.సి.రెడ్డిగారు. ఇది జరిగిన నాలుగు రోజులకే షూటింగ్‌కు వస్తున్నట్లు రంగారావుగారు కబురు చేశారు. సెట్‌ లేదు. ఎలాగా...? కొత్తగా సెట్‌ వేసే వ్యవధి లేకపోవడంతో పాత సెట్‌ను మ్యాచ్‌ చేస్తూ సింపుల్‌గా మరో సెట్‌ వేశాం. ఆ మర్నాడు ఉదయమే రంగారావుగారు షూటింగ్‌కు వచ్చారు. వస్తూనే ‘ఎక్కడయ్యా సెట్‌’ అంటూ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టారు. పెద్ద సెట్‌కు బదులు చిన్న సెట్‌ కనిపించేసరికి ‘ఏమిటయ్యా ఇది.. దీన్ని సెట్‌ అంటారా’ అని అరిచేశారు. ఆయనకు నచ్చజెప్పి షూటింగ్‌ చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చినట్లయింది. అలా మధ్యలో 15 రోజులు ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఎంతో సహకరించారు రంగారావుగారు. అయితే సినిమా సగానికి పైగా పూర్తైన తర్వాత ఓ రోజు రంగారావు హఠాత్తుగా చనిపోయారన్న పిడుగులాంటి వార్త మాకు చేరింది. అది వినగానే చిగురుటాకులా వణకిపోయారు పి.సి.రెడ్డిగారు. ఇప్పటివరకూ తీసిన సీన్లు ఏం చేయాలి? మిగిలిన సీన్లు ఎలా పూర్తి చేయాలి? పెద్ద కాస్టింగ్‌. రీ షూట్‌ సాధ్యమేనా?! ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మాకే అలా అనిపిస్తే ఎంతో డబ్బు పెట్టిన నిర్మాత పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రకళను మార్చి భారతిని పెట్టాం. ఇప్పుడు రంగారావుగారు చనిపోయారు. ఇంకా తీయాల్సిన సినిమా బోలెడుంది. ఎలా.. మరెలా.. ఊహించుకోవడానికే భయం వేసింది.


ఇక ‘కొత్త కాపురం’ సినిమా అంతే సంగతులు అనుకున్నాం. కృష్ణగారికీ ఈ విషయం తెలిసింది. ఆయన కూడా షాక్‌. ఎలా ముందుకు వెళ్లాలా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. నిర్మాత వెంకటరత్నంగారితో మాత్రం మాట్లాడలేదు. ఈ షాక్‌తో ఆయన మంచం పట్టి ఉంటారనుకున్నారు. నాలుగు రోజులు గ్యాప్‌ ఇచ్చి పి.సి.రెడ్డిగారితో కలసి ఆయన ఇంటికి వెళ్లాం. అయితే మేం ఊహించినట్లు కాకుండా ఏమీ జరగనట్లు వెంకటరత్నంగారు చాలా కూల్‌గా ఉన్నారు. మేం వెళ్లి పలకరించగానే ‘సుబ్బయ్యా.. రంగారావుగారి బదులు ఎవర్ని పెడదామయ్యా’ అని తాపీగా అడిగారు. ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. చివరకు కృష్ణగారి సలహామీద గుమ్మడిగారిని పెట్టాం. మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టాం. చాలా ఇబ్బందులు పడుతూ ఆ షూటింగ్‌ పూర్తి చేశాం. సినిమా పెద్ద హిట్‌.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...