Jun 5 2021 @ 23:42PM

నా పెళ్ళి వెనుక ఓ చిన్న కథ ఉంది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 6)

పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నాకు పెళ్ళి కాలేదు. జీవితంలో కొంత స్థిరపడిన తర్వాతే పెళ్ళి చేసుకోవాలన్నది నా అభిప్రాయం. అందుకే ఇంట్లోవాళ్లు పోరుతున్నా ఏదో వంక చెప్పి తప్పించుకునేవాణ్ణి. చివరకు వాళ్ల బాధ భరించలేక మా దూరపు బంధువు వెంకట సుబ్బయ్య కూతురు పార్వతినే పెళ్ళి చేసుకున్నాను. నా పెళ్ళి వెనుక ఓ చిన్న కథ ఉంది. వెంకట సుబ్బయ్యగారికి ఓ కూతురు, కొడుకు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. అందుకే తను కన్నుమూసేలోగా పిల్ల పెళ్ళి చేయాలని ఆయన తాపత్రయం. తనలాగా వ్యవసాయం చేసేవాడు కాకుండా కాస్త చదువుకున్న ఓ ఉద్యోగస్తుడికైనా పిల్లనివ్వాలని ఆయన కోరిక. మా బంధువుల్లో కొందరు నా గురించి ఆయనకు చెప్పడంతో ఓ రోజు నాకు కబురు చేశారు. అప్పటికే ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. నన్ను చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకొని ‘‘ఒరేయ్‌ నాన్నా! అమ్మాయి పెళ్ళి చెయ్యకుండానే చచ్చిపోతానని భయంగా ఉందిరా. అమ్మాయిని పెళ్ళి చేసుకోరా’’ అన్నాడు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది.


ఎందుకంటే అప్పుడు నేను ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదువుతున్నాను. చదువు పూర్తి కావాలి. బ్యాంక్‌ ఉద్యోగంలో చేరాలి. అవేమీ కాకుండా అప్పుడే పెళ్ళేమిటి అనుకున్నాను మనసులో. అయినా మనసులోని భావాలు బయట పెట్టకుండా ‘అలాగే మామా’ అనేశా. అయితే ఆయన నన్ను వదిలిపెట్టలేదు. ‘అలా కాదురా.. నాకు మాట ఇవ్వరా’ అని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. ఇది జరిగిన నెల రోజులకే ఆయన చనిపోయాడు. నేను ఆ విషయం అంతటి మరచిపోయాను. నాకు కాబోయే భార్య అప్పటికి పెద్ద మనిషి కూడా కాలేదు. చదువు పూర్తయిన తర్వాత నేను చెన్నై వచ్చేశాను. వాళ్ల బంధువుల్లో ఒకాయన ఆ అమ్మాయి బాధ్యత తీసుకున్నాడు. పెళ్ళి విషయం నాకు గుర్తు చేస్తూ ఉత్తరాలు రాస్తుండేవాడాయన. నేను వాటిని చదివి పక్కన పెట్టేస్తూ ఉండేవాడిని. ఇక్కడ నాకే దిక్కు లేదు, పెళ్ళి చేసుకుని భార్యని ఎలా పోషించాలి? అందుకే ఆ ఉత్తరాల గురించి పట్టించుకునేవాడిని కాదు.

అప్పట్లో సెల్‌ఫోనులు లేవుగా. అందుకే ‘ద్వారకా లాడ్జి’కి ఆయన అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తుండేవాడు. ‘ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం’ అని అడిగేవాడు. నేను ఏదో చెప్పేసి ఆ విషయం దాట వేసేవాణ్ణి. ఈ విషయం మా ఊరివాళ్లకు తెలిసింది. దాంతో రకరకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ‘వాడు సినిమా మనిషయ్యా, ఏదో ముసలాయన బాధ పడలేక చేతిలో చెయ్యి వేశాడు కానీ నిజంగా పెళ్ళి చేసుకుంటాడా. ఈ పాటికి దేంతోనో తిరుగుతూ ఉంటాడు, అనవసరంగా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది’ అని. ఈ విషయాలన్నీ నా మిత్రుల ద్వారా నాకు చేరుతూనే ఉన్నాయి. నా పరిస్థితి తెలీదు కనుక వాళ్లు అలా అనుకోవడం సహజమే అనిపించింది. అయినా ఇంట్లో వాళ్లు ఊరుకోలేదు. ఇక వాళ్లను ఆపడం సాధ్యం కానీ పరిస్థితిల్లో పార్వతిని పెళ్ళి చేసుకున్నాను.


అప్పటికి నా నెల జీతం రూ. 150 . అంత డబ్బుతో ఇద్దరం చెన్నైలో బతకడం కష్టమే! అయినా ధైర్యం చేశాను. ఎలాగంటే ఒక సినిమాకు పని చేస్తున్నప్పుడే పి.సి.రెడ్డిగారు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండేవారు. ఆ సినిమాలకు నన్నూ పని చేయమనేవారు. మూడు సినిమాలు... మూడు నూట యాభైలు! అంటే.. నెలకు రూ. 450 వస్తాయన్న మాట! ఇంకేం.. బ్రహ్మాండం.. అనుకున్నాను. కానీ సినిమా వాళ్ల నుంచి అనుకున్నట్లుగా డబ్బులు రావని తర్వాతగానీ తెలీలేదు. పెళ్ళయ్యాక ‘ద్వారకా లాడ్జి’లో ఉండటం బాగోదు కనుక వేరే రూమ్‌ వెతికే ప్రయత్నాలు ప్రారంభించాను. లక్ష్మణ్‌ గోరే అని ఓ కెమెరామన్‌ ఉండేవాడు. ఆయన అసిస్టెంట్‌ దశరథరామయ్య నాకు పరిచయం. ఆయన నాకు ఓ రూమ్‌ చూసిపెట్టాడు. పడపళనిలో మురుగన్‌ ఆలయం పక్క వీధిలో శివాలయం ఉండేది. దానికి దగ్గర్లోనే రూమ్‌. 70 రూపాయలు అద్దె. మంచి రోజు చూసుకుని కాపురం పెట్టేశాను.


‘తల్లీకొడుకులు’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే పి.సి.రెడ్డిగారి దర్శకత్వంలోనే ‘కొత్త కాపురం’ సినిమా మొదలైంది. పెళ్ళి కాగానే ఆ సినిమా సిట్టింగ్స్‌లో పాల్గొనేవాడిని. పెళ్ళి చేసుకొగానే ‘కొత్త కాపురం’ చిత్రానికి పనిచేయడం శుభసూచకంగా భావించా. దానికి నారాయణరెడ్డిగారు పాటలు రాశారు. ఆయన సుధారా హోటల్‌లో ఉండేవాడు. ఆయనతో పాటలు రాయించుకోవాలంటే ఉదయం ఆరుగంటలకే సుధార హోటల్‌కు వెళ్లాలి. కొత్తగా పెళ్ళయినా పావు గంట ముందే అక్కడ ఉండేవాడిని. నారాయణరెడ్డిగారికి రోజూ వాకింగ్‌ కంపల్సరీ. సుధార హోటల్‌కు దగ్గరే ఓ పెద్ద పార్క్‌ ఉండేది. నన్ను వెంటబెట్టుకొని ఆ పార్క్‌కు తీసుకెళ్లేవాడాయన. ఆయన చాలా స్పీడ్‌గా నడిచేవాడు. ఆయన వేగంతో నేను పోటీ పడలేకపోయేవాడిని. ‘గురువుగారూ, మీతో కలసి నడవలేకపోతున్నాను సార్‌. రిక్షాలో మిమ్మల్ని ఫాలో అవుతా’ అనేవాణ్ణి. ఆయన నవ్వేసి ‘రావయ్యా.. సుబ్బయ్యా’ అని నన్ను బలవంతంగా లాక్కెళ్లేవారు. వాకింగ్‌ తర్వాత హోటల్‌కు వచ్చి రెడీ అయి పాట రాసేవారు. ‘కాపురం.. కొత్త కాపురం’ అంటూ ఆయన రాసిన పాట ఇప్పటికీ హిట్టే.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...