Jul 24 2021 @ 22:28PM

ఆ టైటిల్‌కి బాలయ్య ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 42)

మా నిర్మాతలు శివరాజు, వెంకట్రాజులకు మళ్లీ డేట్స్‌ ఇచ్చారు వెంకటేశ్‌గారు. భూపతిరాజా ఓ లైన్‌ చెప్పారు. అది నచ్చడంతో కథాచర్చలు ప్రారంభించాం. హీరోయిన్‌ రేప్‌కు గురయ్యే కథ అది. రిస్కీ ఎలిమెంటే అయినా ధైర్యంగా టేకప్‌ చేశాం. సబ్జెక్ట్‌ బాగా వచ్చింది. కళ్ల ముందు ఓ వ్యక్తిని హింసించి చంపుతుంటే అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కనీసం పోలీసులకు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరు. కానీ హీరోయిన్‌ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు రిపోర్ట్‌ చేస్తుంది. జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపినందుకు ఆమె రేప్‌కు గురవుతుంది. అటువంటి యువతిని తీసుకువచ్చి హీరో తన ఇంట్లో ఉంచుతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. బ్యూటీఫుల్‌ మెలో డ్రామా ఉన్న సినిమా. ‘పెళ్లి చేసుకుందాం’ అని టైటిల్‌ పెట్టాం. ‘హీరోయిన్‌ రేప్‌ అయితే ఎలాగయ్యా... ఆడియన్స్‌ చూస్తారా?’ అని కొంతమంది కామెంట్స్‌ చేశారు. దీని వల్ల బిజినెస్‌పరంగా విడుదలకు ముందు నిర్మాతలు కొంత ఇబ్బంది పడ్డారు కూడా. కానీ ప్రేక్షకులు అదేమీ పట్టించుకోలేదు. సినిమా పెద్ద హిట్‌. వెంకటేశ్‌గారితో వరుసగా రెండు హిట్లు ఇవ్వడం నాకు ప్లస్‌ అయింది. ‘పెళ్లి చేసుకుందాం’ చిత్రానికి బెస్ట్‌ స్ర్కీన్‌ప్లే రైటర్‌ అవార్డ్‌ కూడా అందుకున్నాను.

మళ్లీ బాలకృష్ణతో..

‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’ చిత్రం తర్వాత మళ్లీ బాలకృష్ణగారితో కలసి పనిచేసే అవకాశం కలగలేదు. ఆయన బిజీగా ఉండటం, నేను తీరిక లేకుండా ఉండటంతో ఈ కాంబినేషన్‌ మళ్లీ కుదరలేదు. మిత్రులు అడ్డాల చంటి, శ్రీనివాసరెడ్డి వల్ల అది కుదిరింది. చిరంజీవి, వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌గార్ల సినిమాలు వరుసగా చేయడం, అవి హిట్‌ కావడంతో మార్కెట్‌లో నాకు డిమాండ్‌ బాగా పెరిగింది. నిర్మాతల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది. ఆ సమయంలోనే చంటి, శ్రీనివాసరెడ్డి నా దగ్గరకు వచ్చారు. ‘శ్రీవారి ప్రియురాలు’ చిత్రానికి శ్రీనివాసరెడ్డి కెమెరామెన్‌గా పనిచేశారు. ‘బాలయ్యబాబు డేట్స్‌ ఇస్తానన్నారు.. సినిమా చేద్దాం సుబ్బన్నా’ అని అడిగాడు. సరేనన్నాను.


నేను చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా పూర్తి స్ర్కిప్ట్‌ చేతిలో లేకుండా ఏదీ తియ్యలేదు. అందుకే మంచి కథ తయారు చేసుకుని బాలకృష్ణగారి దగ్గరకు వెళ్లాం. పాయింట్‌ ఆయనకు బాగా నచ్చింది. కథలో యాక్షన్‌ పార్ట్‌ ఉన్నా సెంటిమెంట్‌, డ్రామా ఎక్కువ. అందుకే బాలకృష్ణగారు కూడా వెరైటీగా ఫీలయ్యారు. ఆ సమయంలో ఆయన చిత్రాలకు బాగా ఫోర్స్‌ ఉన్న టైటిల్స్‌ పెట్టేవారు. వాటికి భిన్నంగా ‘పవిత్ర ప్రేమ’ అనే సాఫ్ట్‌ టైటిల్‌ మా సినిమాకు పెట్టాం. బాలయ్య అభిమానులు మొదట ఆశ్చర్యపోయినా ‘మా గురువుగారికి మంచి టైటిల్‌ పెట్టారు’ అని అభినందించారు. లైలా హీరోయిన్‌. ‘పవిత్ర ప్రేమ’ చిత్రం బాగా ఆడింది. కానీ వంద రోజుల ఫంక్షన్‌ మాత్రం చేయలేదు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...