Jul 19 2021 @ 22:14PM

దర్శకునిగా నా స్థాయిని పెంచిన చిత్రమది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 37)

నా కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పిన సినిమా ‘పవిత్రబంధం’. వెంకటేశ్‌తో సినిమా తీయాలనే తపనతో నిర్మాతలు శివరాజు, వెంకట్రాజు సురేశ్‌బాబుతో టచ్‌లో ఉండేవారు. ఓ రోజు వాళ్లను పిలిచి ‘సుబ్బయ్యను డైరెక్టర్‌గా పెట్టుకోండి. వెంకటేశ్‌ డేట్స్‌ ఇస్తాం’ అని సురేశ్‌బాబు చెప్పారు. దాంతో వాళ్లు నాకు కబురు చేశారు. ‘వెంకటేశ్‌గారి డేట్స్‌ మనకు ఉన్నాయి. మంచి కథ చూడండి. సినిమా చేద్దాం’ అని చెప్పి ఆ భారాన్ని నాకే అప్పగించారు శివరాజు, వెంకట్రాజు. పెద్ద హీరోతో సినిమా అనగానే నాకూ చాలా సంతోషం కలిగింది. మంచి కథతో సినిమా తీసి హిట్‌ చేయాలనే పట్టుదల ఏర్పడింది. చాలా మంది రచయితల్ని కూర్చోపెట్టాం.


భూపతిరాజా చెప్పిన లైన్‌ నాకు బాగా నచ్చింది. అయితే ఆ పాయింట్‌ మా నిర్మాతలకు నచ్చలేదు. వెంకటేశ్‌కు ఆ లైన్‌ నచ్చుతుందో లేదోనని వారి భయం. ఆయనకు నచ్చకపోతే ప్రాజెక్ట్‌ లేట్‌ అవుతుందేమోనని కంగారు. నేను వాళ్లకి నచ్చజెప్పాను. ‘గురువుగారూ.. పాయింట్‌ బాగుంది. దీని మీద బాగా వర్క్‌ చేయాలి. వైవిధ్యమైన పాయింట్‌ కనుక తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుందనిపిస్తోంది. డెవలప్‌ చేసిన తర్వాత వెంకటేశ్‌కు చెబుదాం’ అని చెప్పడంతో నా మీద నమ్మకంతో భూపతిరాజాకి అడ్వాన్స్‌ ఇచ్చారు శివరాజు, వెంకట్రాజు. ఆ తర్వాత నేను, భూపతిరాజా నాలుగు నెలలు కూర్చుని కథ గురించి కుస్తీలు పట్టాం. కథను లాక్‌ చేసిన తర్వాత మొదట సురేశ్‌బాబుకి వినిపించాం. అనంతరం వెంకటేశ్‌ విన్నారు. ఇద్దరూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓ.కె. చెప్పేశారు. నాయుడుగారికీ కథ నచ్చింది. మాటలు ఎవరితో రాయించాలా అన్న చర్చ జరిగినప్పుడు పోసాని కృష్ణమురళి పేరు చెప్పారు నాయుడుగారు. రచయితగా ఆయన అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నారు. పోసాని కూర్చుని మళ్లీ కథాచర్చలు జరిపాం. ఆయన ఇచ్చిన కొన్ని సూచనలతో కథ మరింత బాగా వచ్చింది. ఆ తర్వాత ఆర్టిస్టుల సెలెక్షన్స్‌ ప్రారంభించాం. 

ఈ కథ అనుకోగానే మొదటగా మా మదిలో మెలిగిన నటి సౌందర్య. ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశాం. వెంకటేశ్‌ ఫాదర్‌ పాత్రకు అందరూ గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికే ఏకగ్రీవంగా ఓటేశారు. కొడుకుతో చాలా ఫ్రెండ్లీగా మెలిగే పాత్ర అది. వేరే నటుడు ఎవరైనా పోషిస్తే రొటీన్‌ అవుతుంది కనుక బాలుగారే యాప్ట్‌ అనుకున్నాం. ఇక సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంపిక చేశాం. ‘అన్న’ తర్వాత ఆయనతో నేను చేసిన రెండో సినిమా ఇది. ‘పవిత్రబంధం’లో ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రి’ అనే పాటను జేసుదాసుగారు అద్భుతంగా పాడారు. ఈ పాట రికార్డింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటనను మీకు చెప్పాలి. 


జేసుదాసుగారు పాడుతున్నప్పుడు ‘అలా కాదు సార్‌.. ఇలా’ అంటూ కీరవాణిగారు సూచించడంతో జేసుదాసుగారికి కోపం వచ్చింది. ‘నో.. నేను ఇలాగే పాడతాను’ అని ఆ పాట పాడేసి కోపంగానే వెళ్లిపోయారు జేసుదాసుగారు. సంగీత దర్శకునిగా తన సూచనని ఆయన పాటించకపోవడంతో కీరవాణిగారు ఫీలయ్యారు. ఆ పాటను వేరే గాయకునితో పాడించాలని ఆయన ప్రయత్నించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. చివరకు జేసుదాసు పాటే సినిమాలో ఉంది. ఈ సంఘటనని కీరవాణిగారు మనసులో పెట్టుకున్నారో ఏమో రీరికార్డింగ్‌కు ఆయన రాలేదు. ఆ సమయంలో ఆయన ఏదో దీక్షలో ఉన్నారు. ఆయన అసిస్టెంట్‌తో రీరికార్డింగ్‌ చేయించుకోవాల్సి వచ్చింది. కీరవాణిగారు రీరికార్డింగ్‌కు వచ్చి ఉంటే సినిమా ఇంకా బాగా ఉండేదని మా ఫీలింగ్‌.


విడుదల టైమ్‌లో భారీ వర్షాలు

‘పవిత్రబంధం’ తొలి కాపీ చూసిన తర్వాత సినిమా మీద నమ్మకం పెరిగింది. అయితే విడుదల రోజున రాష్ట్రమంతటా భారీ వర్షాలు. జనం ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ‘భగవంతుడా.. తొలిసారి ఓ పెద్ద హీరోతో సినిమా చేశాను. ఏమిటి స్వామీ నాకు ఈ పరీక్ష ’ అని ప్రాధేయపడ్డాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడేమో వర్షం తగ్గుముఖం పట్టి, సినిమాకు కలెక్షన్ల వర్షం మొదలైంది. ఫైనల్‌గా సినిమా పెద్ద హిట్‌. ఫారిన్‌ కల్చర్‌లో పెరిగిన ఓ యువకుడికి జీవితం అంటే ఏమిటీ, ప్రేమ అంటే ఏమిటో తెలియజెప్పిన చిత్రం ‘పవిత్రబంధం’. ఇలాంటి సబ్జెక్ట్‌ చేయడం రిస్క్‌ అని భావించకుండా ఒప్పుకొన్న వెంకటేశ్‌కు నిజంగా హాట్సాఫ్‌. 


ఈ సినిమాలో ఫస్ట్‌ నైట్‌ సీన్‌ ఉంది కదా. సౌందర్య, హీరో వెంకటేశ్‌ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆమె పైకి లేవగానే వెంకటేశ్‌ టక్కున ఆమె కాళ్లకు నమస్కరిస్తాడు. ఇదే స్టిల్‌తో 24 షీట్‌ పోస్టర్‌ వేశాం. ఆ పోస్టర్‌ సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకునిగా నా స్థాయి పెరిగింది. అప్పటివరకూ నేను తీసుకున్న పారితోషికం అంతంత మాత్రమే. ‘పవిత్రబంధం’ తర్వాత పారితోషికం పరంగా డిమాండ్‌ చేసే పొజిషన్‌ వచ్చింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...