Jul 16 2021 @ 20:57PM

100 డేస్‌ ఫంక్షన్‌ చేయలేదు.. గోల్డ్ బ్రాస్‌లెట్స్‌ ఇచ్చారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 34)

ఛాయాగ్రాహకుడు రామారావుతో మాట్లాడి మహేశ్వరి ఏ యాంగిల్‌లో బాగుంటుందో అలాగే షూట్‌ చేయమని చెప్పాను. సొంత ప్రొడక్షన్‌ కావడంతో ప్రేమ్‌చంద్‌కు ఎక్కువ బాధ్యతలు అప్పగించేవారు నాగేశ్వరరావుగారు. అలా ఒక రోజు షూటింగ్‌ కోసం గుర్రపు బండీ కావాల్సి వచ్చింది. సింగరాయకొండ పక్కనే ఉన్న విలేజ్‌లో ఆ గుర్రపు బండీ ఉందని తెలిసి కారు ఇచ్చి ప్రేమ్‌చంద్‌ను పంపించారు నాగేశ్వరరావుగారు. ఈ విషయం నాకు తెలీదు. ప్రేమ్‌చంద్‌ వెళ్లాడు. ఆ బండి మాట్లాడి ఓకే చేశాడు. ఒంగోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. దార్లో తనే డ్రైవ్‌ చేస్తానని ప్రేమ్‌చంద్‌ పట్టుబట్టడంతో డ్రైవర్‌ కాదనలేక స్టీరింగ్‌ అతని చేతికి ఇచ్చాడు. వయసులో ఉన్న కుర్రాడు కావడంతో కొంచెం ఫాస్ట్‌గా డ్రైవ్‌ చేశాడు. హైవే. వాహనాలన్నీ చాలా ఫాస్ట్‌గా వస్తుంటాయి కదా. దారిలో కుక్క అడ్డం రావడంతో పక్కకు పోనిచ్చాడు. అదే సమయానికి ఓ స్కూటరిస్ట్‌ అడ్డు రావడంతో చాకచక్యంగా అతన్ని కూడా తప్పించుకున్నాడు. అయితే ఆ స్కూటరిస్ట్‌ కింద పడ్డాడేమో అని డ్రైవ్‌ చేస్తునే ఒకసారి వెనక్కి తిగిరి చూశాడట. అంతే ఎదురుగా వస్తున్న లారీ వచ్చి ఢీ కొంది. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు పోయాయి. మేమందరం సీరియస్‌గా షూటింగ్‌ చేస్తున్నాం. 


ఇంతలో పిడుగులాంటి ఈ వార్త వినగానే అందరం వణకిపోయాం. టి కృష్ణగారు పోయారు. చేతికి అంది వచ్చిన పెద్ద కొడుకు కూడా ఇలా అకాలమరణం పొందేసరికి ఆ బాధ తట్టుకోలేకపోయాం. ఆ సమయంలో గోపీచంద్‌ రష్యాలో చదువుకుంటున్నాడు. ఒక కొడుకు దూరమయ్యాడు.. మరో కొడుకు దూరంగా ఉన్నాడు. మాకే అంత బాధ అనిపిస్తే ఇక కృష్టగారి భార్య పరిస్థితి ఏమిటి? అటు భర్త, ఇటు పెద్ద కొడుకు పోవడంతో ఆ తల్లి కడుపు కోత తీర్చడం ఎవరితరం!

నాకు మూడో నంది అవార్డు

ఇటువంటి పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడం కష్టం కనుక నిరవధికంగా ఆపేశాం. ఓ రెండు నెలల పాటు ఆ విషయమే ఆలోచించలేదు. అయితే ఇలా రెండు నెలలు షూటింగ్‌ చేయకపోవడం వల్ల ఒక రకంగా మేలే జరిగింది. మహేశ్వరి అందం కొంచెం మెరుగైంది. గతంలోలా ఘోరంగా లేదు. అందుకే మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టినప్పుడు గతంలో తీసిన సన్నివేశాల్ని రీషూట్‌ చేశాం. ‘అమ్మాయి కాపురం’ సినిమా హిట్‌. వంద రోజులు ఆడినా నిర్మాత ఫంక్షన్‌ మాత్రం చేయలేదు. ముఖ్యమైన టెక్నీషియన్లందరికీ బంగారు బ్రాస్‌లెట్స్‌ చేయించారు. ఈ సినిమాతో నాకు మూడో నంది లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా నంది అందుకొన్నాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...