Jul 12 2021 @ 21:17PM

రాజశేఖర్‌ రోజూ షూటింగ్‌కు లేట్‌గా వచ్చేవాడు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 32)

‘పెళ్ళిగోల’ సినిమా పూర్తి కాగానే పోకూరి బాబూరావుగారి ‘అన్న’ సినిమా చేశాను. ఇందులో రాజశేఖర్‌, రోజా, గౌతమి హీరోహీరోయిన్లు. స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలోనే బాబూరావుగారికీ, నాకూ ఓ విషయంలో వాదన జరిగేది. అదేమిటంటే, ‘ఎర్రమందారం’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ కొడుకుగా ఓ బాలనటుడు నటించాడు. అతను నిర్మాత పోకూరి రామారావుగారి అబ్బాయి. చాలా బాగా చేశాడు. అతనిప్పుడు అమెరికాలో డాక్డర్‌గా ఉన్నాడు. ‘అన్న’లో రాజశేఖర్‌ తమ్ముడి పాత్రకు అతన్ని తీసుకుందామని బాబూరావుగారు పట్టుపట్టారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ పాత్రకు మాస్టర్‌ బాలాదిత్యను తీసుకోవాలని నా ఆలోచన. ఇద్దరం ఆ విషయం మీద వాదించుకునేవాళ్లం.


‘ఎర్రమందారం’లో ఆ పాత్రకు ఓ.కే. కానీ ‘అన్న’ సినిమాకు అతను సూట్‌ కాడని నా అభిప్రాయం. చివరికి నా మాటే నెగ్గి మాస్టర్‌ బాలాదిత్యను తీసుకున్నాం. అలా ‘అన్న’ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే రాజశేఖర్‌ రోజూ షూటింగ్‌కు లేట్‌గా వచ్చేవాడు. హెల్త్‌ ప్రాబ్లం అని చెప్పడంతో ఏమీ అనలేకపోయేవాళ్లం. పొద్దున్నే షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లి, రాజశేఖర్‌ లేని సీన్లు తీసేసి, ఆ తర్వాత అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్లం. రాజశేఖర్‌ కారణంగానే ‘అన్న’ సినిమాకు ఎక్కువ రోజులు పనిచేయాల్సి వచ్చింది. వంద రోజులకు పైగా ఆ సినిమాకు పని చేశాం. మరో విషయం ఏమిటంటే రాజశేఖర్‌ ఆ సమయంలోనే కె.ఎస్‌.రామారావుగారి ‘అంగరక్షకుడు’ సినిమాలో నటిస్తుండేవాడు. మలయాళ దర్శకుడు జోషి ఆ సినిమాకు పనిచేస్తున్నారు. కారణాలు తెలీవు కానీ మా సినిమా కంటే ఆ చిత్రానికి రాజశేఖర్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు.

ఏనుగు ఏడిపించింది

హైదరాబాద్‌లోనే ‘అన్న’ షూటింగ్‌ జరిగింది కానీ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లు ముదుమలై ఫారెస్ట్‌లో సెట్‌ వేసి తీశాం. పొద్దున్నే ఊటీ నుంచి బయలుదేరి ముదుమలై వెళ్లి, షూటింగ్‌ చేసుకుని సాయంత్రం తిరిగి వచ్చేవాళ్లం. ఒకరోజు అలాగే సాయంత్రం ముదుమలై నుంచి బయలుదేరాం. కారులో నేను, ఛాయాగ్రాహకుడు రమణబాబు, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ కఠారి శ్రీను ఉన్నాం. ముదుమలై ప్రాంతంలో ఏనుగుల సంఖ్య ఎక్కువ. అవి గుంపుగా వస్తే పరవాలేదుగానీ ఒంటరి ఏనుగు కనిపిస్తేనే సమస్య. గుంపునుంచి తప్పిపోయిన ఏనుగు చాలా వైలెంట్‌గా బిహేవ్‌ చేస్తూ ఉంటుంది. కోపంతో అది మనిషిని నేలకు విసిరికొట్టి చంపుతుందట. చాలామంది ఆ విషయం మాకు చెప్పారు.


దారిలో సరిగ్గా అలాంటి ఏనుగే మా కారుకు ఎదురు వచ్చింది. దాన్ని చూడగానే మా అందరికీ ముచ్చెమటలు పట్టాయి. భయంతో గజగజ వణికి పోతున్నాం. కారు దిగి పారిపోయే పరిస్థితి లేదు. ఏనుగు అలా ముందుకు వస్తుంటే, మా కారుని స్లోగా వెనక్కి పోనివ్వడం ప్రారంభించాడు డ్రైవర్‌. అలా దాదాపు 45 నిముషాలు రోడ్‌ మీద టెన్షన్‌తో గడిపాం. ఈలోగా సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ గైడ్స్‌ ఓ ప్రత్యేక వాహనంలో అక్కడికి వచ్చారు. అందులో పెద్ద లైటు ఉంటుంది. వాళ్లు ఆ లైటు వెలిగించడంతో ఏనుగు బెదిరి పారిపోయింది. హమ్మయ్య అనుకున్నాం. ఇక ‘అన్న’ సినిమా బాగా వచ్చింది. అయితే లెంగ్త్‌ ఎక్కువ కావడంతో ఓ ఎపిసోడ్‌ తీసెయ్యాల్సి వచ్చింది. సినిమా పెద్ద హిట్‌. వంద రోజులు ఆడింది. కానీ ఫంక్షన్‌ చేయలేదు. ‘అన్న’ పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఉండగానే, ఎడిటర్‌ మోహన్‌గారి నుంచి ఫోన్‌ వచ్చింది, ఒకసారి ఆఫీసుకు రండి అంటూ‍!

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...