Jul 11 2021 @ 20:56PM

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలి అనగానే వణికిపోయా!: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 31)

ఇలా గ్యాప్‌ లేకుండా వరుసగా హిట్లు రావడం, చేస్తున్న సినిమాలన్నీ బాగా ఆడటంతో వృత్తిపరంగా సంతృప్తిగానే ఉన్నా, సినిమాల గురించే ఆలోచిస్తూ రెస్ట్‌ తీసుకోకుండా ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయడం నా ఆరోగ్యంపై ప్రభావం చూపింది. ఎక్కువసేపు మేల్కొని ఉండాలని, నిద్ర రాకుండా ఉండటం కోసం ఎక్కువసార్లు టీ తాగడం, వెంటనే సిగరెట్‌ ముట్టించడం ఒక అలవాటుగా మారింది. ‘బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌’ కంపెనీ సిగరెట్టు ఆ రోజుల్లో తాగేవాడిని. ప్యాకెట్‌లో 20 సిగరెట్లు ఉండేవి. చూస్తూండగానే రోజుకి రెండు ప్యాకెట్లు అయిపోయేవి. చెప్పానుకదా, సక్సెస్‌ను తట్టుకోవడం చాలా కష్టమని. అపజయం వస్తే ‘‘ఎందుకులే’’ అని ఎవరూ మన జోలికి రారు. అదే హిట్స్‌ వస్తే అందరూ వచ్చి ఒక్కసారిగా చుట్టుముడతారు. ఇది సహజం కూడా. నా పరిస్థితి అదే అయింది. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు వచ్చి సినిమా చేసిపెట్టమని అడిగితే కాదనలేకపోయేవాడిని. మొహమాటంకొద్దీ కొన్ని సినిమాలు ఒప్పుకోవాల్సి వచ్చేది. దీనివల్ల రోజులో ఎక్కువ గంటలు కష్టపడాల్సి వచ్చేది. పని ఒత్తిడి, సిగరెట్‌ అలవాటు నా గుండె మీద ప్రభావం చూపించాయి. నేను పట్టించుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రంగా మారింది.

ఆపరేషన్‌కి డబ్బుల్లేవు!

మరోపక్క వలసరవాక్కంలో కడుతున్న ఇల్లు పూర్తికావడంతో రంగరాజపురం నుంచి కొత్త ఇంట్లోకి షిఫ్ట్‌ అయ్యాం. ఆ కాలనీలో నా ముందు ప్లాట్‌ నర్రా వెంకటేశ్వరరావుది. దానికంటే కొంచెం ముందు వరుసలో పోకూరి బాబూరావు, భీమనేని శ్రీనివాసరావు తదితరులు ఉండేవాళ్లు. నా కంటే ముందు వాళ్లు ప్లాట్లు తీసుకోవడంవల్ల మెయిన్‌రోడ్‌లో స్థలాలు దొరికాయి. నర్రాకు కూడా అలా మెయిన్‌ రోడ్‌లో ప్లాట్‌ తీసుకోవాలని ఉండేది. అక్కడేదో ఓ ప్లాట్‌ ఖాళీగా ఉండటంతో బేరం చేశాడు కూడా. ఆ విషయం నాకు తెలిసి ‘‘నువ్వు ఆ ప్లాట్‌ కొనేట్టైతే, నీ ప్లాట్‌ నాకు అమ్ము’’ అని అడిగాను. అతను సరేనన్నాడు కానీ కొత్త ప్లాట్‌ కొనడానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో అతను సందిగ్ధంలో పడ్డాడు. అతని స్థలం కొనాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి నా ప్లాట్‌తో పాటు అతని ప్లాట్‌కు కూడా నేనే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించి ఆ ప్లాట్‌ సొంతం చేసుకున్నాను. మొత్తం 500 గజాల స్థలం. ఇల్లు కట్టిన తర్వాత ముందు ఖాళీ స్థలం బాగా ఉండటంతో మొక్కలు బాగా పెంచాను.


నేను పట్టించుకోకపోయినా గుండె తన పని తాను చేసుకుపోతుంది కదా. నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఆయాసంగా ఉండేది. చెమటలు పట్టేవి. దాంతో ఒకసారి తిరుపతిలో షూటింగ్‌లో ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లి చెకప్‌ చేయించుకున్నాను. ఆయన మాకు దూరపుబంధువు అవుతారు. ‘‘సుబ్బయ్యా, ఆలస్యం చేయవద్దు, నువ్వు వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లు’’ అని ఎవర్ని కలవాలో చెప్పి లెటర్‌ రాసిచ్చారు. ఆయన చెప్పినట్లుగానే మద్రాసువెళ్లి అపోలో హాస్పిటల్‌లో డాక్టర్‌ కె.ఎన్‌.రెడ్డిగారిని కలిశాను. ఆయన యాంజియోగ్రామ్‌ చేసి, వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. నా కాళ్లలో వణుకు మొదలైంది. ఉన్నట్లుండి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అంటే మాటాలా! డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఒకపక్క ఇంటి కోసం బాగా ఖర్చు చేశాను. ఇంకోపక్క పిల్లలు చదువులు.. ఆ సమయంలోనే కొత్త కారు కూడా కొన్నట్లు గుర్తు. సంపాదన బాగానే ఉంది కదా అని ఏమీ దాచుకోకుండా, వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టేశాను. దాంతో ఆపరేషన్‌ చేయించుకోవానికి చేతిలో డబ్బు లేదు. మరేం చేయాలి...! ఇది వాయిదా వేసే వ్యవహారం కాదు. చెప్పిన సమయానికి ఆపరేషన్‌ చేయించుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. అప్పు చేసైనాసరే ఆపరేషన్‌ చేయించుకోవాల్సిందే. అప్పటికీ ఒకరిద్దరు నిర్మాతలను అడిగి చూశాను కానీ డబ్బు పుట్టలేదు. చివరకు నా పరిస్థితి గ్రహించి ప్రొడక్షన్‌ మేనేజర్‌ బెజవాడ కోటేశ్వరరావు, సంజీవి, ఇతర మిత్రులు ముందుకు వచ్చి డబ్బు సర్దుబాటు చేయడంతో ఆపరేషన్‌ జరిగిపోయింది.


అమ్మాయి పెళ్ళి

నాకు ఇద్దరు మగపిల్లలు, ఓ కూతురు. అమ్మాయే పెద్దది. పేరు గీతాలక్ష్మి. ఆమె పదవతరగతిలోకి రాగానే మా కజిస్‌ సిస్టర్‌ హైమవతి గీతను కోడలిగా చేసుకోవడానికి ముచ్చటపడ్డారు. ఆమె భర్త కాశీవిశ్వనాథంగారు తిరుపతిలో ఆడిటర్‌గా పనిచేస్తుండేవారు. వాళ్లకు కూడా ఇద్దరు మగపిల్లలు. ఓ ఆడపిల్ల. వాళ్ల రెండో అబ్బాయి శ్రీకాంత్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేస్తుండేవాడు. ఈ ప్రపోజల్‌తో వాళ్లు రాగానే నాకు ఆనందం కలిగినా ‘‘అమ్మాయికి పదహారేళ్లే కదండీ. మీకు అభ్యంతరం లేకపోతే రెండేళ్లు ఆగి పెళ్ళి చేద్దాం’’ అన్నాను. వాళ్లు సరేనన్నారు. ఇదంతా నాకు ఆపరేషన్‌ జరగకముందు డిస్కషన్స్‌ అన్నమాట. నాకు ఆపరేషన్‌ జరగడంతో మా ఆవిడకు భయం మొదలైంది. ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కనుక వెంటనే కూతురు పెళ్ళి చేసేస్తే బాగుంటుందని ఆమెకు అనిపించింది. దానికి తోడు, ‘‘మీ ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగింది, ఏదైనా జరిగితే పిల్ల జీవితం నాశనమైపోతుంది, నా మాట విని వెంటనే పెళ్ళి చేసెయ్యండి’’ అని చుట్టుపక్కల వాళ్లు, చుట్టాలు మరింత భయపెట్టడంతో ఆమెకు టెన్షన్‌ పెరిగిపోయింది. దాంతో ‘‘పాపపెళ్ళి చేసేద్దామండీ’’ అని నాతో ఒకటే పోరు.


ఆపరేషన్‌ జరిగిన తర్వాత రెండు నెలలు రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అందుకే ఒక నెలరోజులు పూర్తిగా రెస్ట్‌ తీసుకుని రెండోనెలలో అమ్మాయి పెళ్ళి చేశాను. తిరుపతిలో పెళ్ళి జరిగితే అందరికీ అనువుగా ఉంటుందని చెప్పడంతో వి.ఎం.సి. కల్యాణమండపంలో పెళ్ళి చేశాను. ముందు మాట ఇచ్చిన ప్రకారం అమ్మాయి పెళ్ళి చేయడంతో నాకు పెద్ద బాధ్యత తీరినట్లయింది. అల్లుడికి కట్నం ఏమీ ఇవ్వలేదు. అసలు ఆ ప్రసక్తే మా మధ్య రాలేదు. అయినా అమ్మాయికి ఏదన్నా ఇవ్వాలి కనుక తిరుపతిలోనే ఇల్లు కట్టించి ఇచ్చాను. ఇక ఆ తర్వాత నా పనిలో నిమగ్నమయ్యాను. కమిట్‌మెంట్‌ ప్రకారం నేను సీవీ రెడ్డిగారికి సినిమా చేయాలి. కానీ మా పోకూరి బాబూరావు మధ్యలో అడ్డుతగిలి ‘‘చిన్న సినిమా ఎందుకు సుబ్బయ్యా, రాజశేఖర్‌తో పెద్ద సినిమా చేద్దాం..నా మాట విను’’ అన్నారు. అయితే సీవీ రెడ్డిగారు మొదట నాకు అడ్వాన్స్‌ ఇచ్చారు కనుక దానికి కట్టుబడి ఆయనకు సినిమా చేశాను. 

ఈ విషయంలో పోకూరి బాబూరావుగారు కొంచెం అలిగినా నేను పట్టించుకోలేదు. ‘పెళ్ళిగోల’ షూటింగ్‌ మొత్తం సింగిల్‌ షెడ్యూల్‌లో రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో జరిగింది. గుండెకు ఆపరేషన్‌ జరగడంవల్ల వృత్తిపరంగా నా శరీరానికి ఎక్కువ ఒత్తిడి ఉండకూడదని భావించి, కామెడీ సబ్జెక్ట్‌ ఎన్నుకున్నాను. సురేశ్‌ హీరో. శారదగారు కీలకపాత్ర పోషించారు. హిలేరియస్‌ కామెడీ ఫిల్మ్‌ అది. సెట్లోనే నవ్వుకుంటూ పనిచేశాం. ‘పెళ్ళిగోల’ సినిమా సక్సెస్‌ అయింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...