Jul 10 2021 @ 21:13PM

దాసరి, బాలు మీద కామెడీ పండలేదు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 30)

దర్శకుడిగా నేను చాలా బిజీగా ఉన్న సమయంలో ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా తీసిన విజయ్‌కుమార్‌, రామాచారి నా దగ్గరకు వచ్చారు. రచయిత తోటపల్లి మధు వారిని తీసుకువచ్చాడు. నా దర్శకత్వంలో ఓ సినిమా తీయాలని వారి కోరిక. అయితే నా డేట్స్‌ లేవు. వరుసగా సినిమాలు ఒప్పుకున్నాను. అదే విషయం వాళ్లతో చెప్పాను. కానీ వాళ్లు వదిలిపెట్టలేదు. ఎలాగైనా సినిమా చేసిపెట్టాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. ‘‘డేట్స్‌ ఖాళీలేవు గురువా.. కావాలిస్తే మీరే చూడండి’’ అని నా డైరీ వాళ్ల ముందు ఉంచాను. ఆ రోజుల్లో నేను ప్రతి సినిమానూ మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేసేవాడిని. ప్రతి షెడ్యూల్‌కి మధ్య15 రోజులు గ్యాప్‌ పెట్టుకొనేవాడిని. ఈ గ్యాప్‌లో స్ర్కిప్ట్‌ డిస్కషన్స్‌, ఎడిటింగ్‌ వర్క్‌ చేసేవాడిని. ఇలా రౌండ్‌ ది క్లాక్‌ పనిచేసేవాడిని. ప్రతి షెడ్యూల్‌కు మధ్య గ్యాప్‌లో ఉన్న 15 రోజుల్ని తమకు కేటాయించమని నిర్మాతలు బ్రతిమిలాడారు. నేను ఎప్పుడూ అలా చేయలేదు.


గట్టిగా అడిగేసరికి నేను కొంచెం మెత్తబడి, ‘‘కథ రెడీగా ఉందా?’’ అనడిగాను. రచయిత తోటపల్లి మధు నాకు స్టోరీ లైన్‌ చెప్పాడు. కామెడీ కథ. దాసరిగారు, బాలుగారు హీరోలుగా నటిస్తున్నారని చెప్పారు. ‘‘వారిద్దరి మీదా.. కామెడీ ఎంతవరకూ పండుతుంది?’’ అని అనుమానం వ్యక్తం చేశాను. ‘‘తప్పకుండా పండుతుంది సార్‌. మేం తీసిన ‘చిత్రం భళారే విచిత్రం’ సూపర్‌హిట్‌ అయింది. ఇది ఎందుకు ఆడదు, పైగా ఇందులో బాలుగారు, దాసరిగారి వంటి ఉద్దండులున్నారు కదా’’ అని నన్ను ఎదురు ప్రశ్నించారు. తర్వాత నాకు తెలిసిన విషయమేమిటంటే, వీళ్లు నా దగ్గరకు వచ్చే ముందే దాసరిగారికి, బాలుగారికి కథ చెప్పారు. వారిద్దరూ కథ చాలా బాగుందని చెప్పడంతో నిర్మాతలకు కాన్ఫిడెన్స్‌ పెరిగిపోయింది. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చారు. అంతా విన్న తర్వాత ఆ సినిమా చేయాలో, వద్దని చెప్పాలో నాకే అర్థం కాలేదు.

కథ మీద కొన్ని సందేహాలు. అయినా నిర్మాతలు గట్టిగా పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. అయితే డేట్స్‌ లేకపోవడంతో అడ్జెస్ట్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆరునెలలు సమయంలో 45 రోజుల్లో ‘పర్వతాలు- పానకాలు’ సినిమా పూర్తి చేశాం. నా డేట్స్‌కు అనుగుణంగా దాసరిగారు, బాలుగారు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం గొప్ప విషయం. కానీ ఆ సినిమా సబ్జెక్ట్‌ విషయంలోనే నాకు అసంతృప్తి. వాళ్లిద్దరి రేంజ్‌కు తగిన కథ కాదు. హిందీలో వచ్చిన ‘బాబీ’ చిత్రంలాంటి సబ్జెక్ట్‌ వాళ్లకు యాప్ట్‌. ఒక పక్క ప్రాణ్‌, మరో పక్క ప్రేమ్‌నాథ్‌.. పోటీపోటీగా ఉండేది వాళ్ల నటన. అలాంటి సబ్జెక్ట్‌ అయితే బాగుండేదని నా అభిప్రాయం. రచయిత తోటపల్లి మధు చేసిన నిర్వాకం ఇది. ఆ నిర్మాతలకు అంతకుముందు ‘చిత్రం భళారే విచిత్రం’ తో సూపర్‌ హిట్‌ ఇచ్చాడు మధు. అతనిమీద కాన్ఫిడెన్స్‌తో ఈ కథకు ఓకే చెప్పేశారు నిర్మాతలు. 


కొత్తగా ఉంటుందేమోనని దాసరిగారు, బాలుగారు ఫీలయ్యారు, ఓకే అనేశారు. వాళ్లను తప్పు పట్టడానికి వీల్లేదు. అలాంటి కథతో వాళ్ల దగ్గరకువెళ్లడం మనతప్పు. కష్టపడి చేశాంగానీ సినిమా ఆడలేదు. అంతమంచి క్యాస్టింగ్‌ను పెట్టుకుని సరైన సినిమా తీయలేకపోయాననే బాధ నాలో చాలాకాలం ఉండిపోయింది. ఇప్పటి దర్శకుల విషయానికి వస్తే, సినిమా, సినిమాకూ ఏడాది గ్యాప్‌ తీసుకుంటున్నారు. ఈ ఏడాదికాలంలో వారు అనుకున్న రేటుగానీ, సబ్జెక్ట్‌గానీ, అనుకున్న క్యాస్టింగ్‌ కానీ కుదిరితేనే చేస్తున్నారు. అన్నీ సెట్‌ చేసుకున్న తర్వాతే షూటింగ్‌కు వెళుతున్నారు. కానీ అప్పట్లో మా పరిస్థితి వేరు. ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేసేవాళ్లం. అందులోనూ వరుస విజయాలవల్ల నా మీద ఒత్తిడి బాగా ఉండేది. దీనివల్ల మొహమాటలవల్ల కూడా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చేది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...