Jul 9 2021 @ 20:47PM

ఆ సినిమా ముందు మా సినిమా నిలబడలేకపోయింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 29)

‘సీతారామయ్యగారి మనవరాలు’ ఘన విజయం సాధించిన తర్వాత నిర్మాత దొరస్వామిరాజుగారు నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం నాకు లభించింది. భీశెట్టి లక్ష్మణరావుగారు చెప్పిన ఓ పాయింట్‌ మీద రచయిత గణేశపాత్రోగారు వర్కవుట్‌ చేసి స్ర్కిప్ట్‌ తయారు చేశారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’లో నటించిన నాగేశ్వరరావుగారే మా సినిమాలోనూ హీరో. ఆయనతో కలిసి పనిచేసిన తొలి సినిమా 'మాధవయ్యగారి మనవడు'. మహానటుడైన నాగేశ్వరరావుగారితో కలిసి పనిచేయడానికి మొదట కొంచెం టెన్షన్‌ పడ్డాను. అంతకుముందు నాగేశ్వరరావుగారు, మా గురువు పి.సి. రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘గోపాలకృష్ణుడు’ చిత్రానికి నేను కో–డైరెక్టర్‌గా పనిచేశాను. నాగేశ్వరరావుగారికి ఆ విషయం గుర్తుందో లేదో తెలీదుగానీ ఈ సినిమాకు మాత్రం నాకు బాగా సహకరించారు. ముఖ్యంగా టైమింగ్స్‌ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు నాగేశ్వరరావుగారు. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. సాయంత్రం షూటింగ్‌ ముగించుకుని వెళ్లే ముందు ‘‘రేపు ఎన్ని గంటలకు రావాలి?’’ అని అడిగేవారు. ‘‘గురువుగారు మేం తొమ్మిది గంటలకు వర్క్‌ మొదలుపెడతాం. మీరు పది గంటలకు వస్తే చాలు’’ అని చెప్పేవాడిని. సరేనని ఖచ్చితంగా ఆ సమయానికి మేకప్‌తో సహా రెడీగా ఉండేవారు.


సన్‌రైజ్‌ షాట్‌ కోసం...

సినిమాలో గోదావరి ఒడ్డున సన్‌రైజ్‌ షాట్‌ తీయాలి. నాగేశ్వరరావుగారు అందులో పాల్గొనాలి. పోలవరానికి వెళ్లేదారిలో ఓ పర్టిక్యులర్‌ స్పాట్‌ సూర్యోదయం షాట్‌ తీయడానికి అనువుగా ఉంటుంది. అక్కడి వెళ్లాలంటే తెల్లారే బయలుదేరి వెళ్లాలి. నాగేశ్వరరావుగారిని అంత పొద్దున్నే రమ్మని చెప్పడానికి సందేహించాను. చాలాసేపు మథనపడి ఇక చెప్పేశాను. ‘‘గురువుగారూ రేపు ఉదయం సూర్యోదయం షాట్‌ తీయాలనుకుంటున్నాను. పొద్దునే వెళ్లి తీయాలి కనుక మీకు కుదరకపోతే సన్‌ సెట్‌ షాట్‌ తీద్దాం’’ అన్నాను. ‘‘ఎందుకలా అనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారాయన. ‘‘ఆరు గంటల లోపు సూర్యదయం అవుతుంది సార్‌. ఇక్కడ నుంచి మనం ఆ స్పాట్‌కు చేరుకోవడానికి గంట పడుతుంది సార్‌. అంటే నాలుగున్నకు మనం బయలుదేరాలి.. మరి మీరు...’’ అని మిగతా విషయం చెప్పకుండా ఆపేశాను. ‘‘మీరు అనుకున్న విధంగానే ప్లాన్ చేయండి. నా కోసం మార్చకండి. నేను వచ్చేస్తాను’’ అని డిస్కషన్‌కు తావు లేకుండా చెప్పేశారు నాగేశ్వరరావుగారు.

ఆ మర్నాడు పొద్దున్నే యూనిట్‌తో అక్కడి వెళ్లి షాట్‌ కోసం ఏర్పాటు చేసుకుంటుండగా సరిగ్గా ఐదున్నరకు ఆయన మేకప్‌తో రెడీ అయి స్పాట్‌కు వచ్చేశారు. టైమ్‌ విషయంలో, వర్క్‌ విషయంలో ఆయన అంత సిన్సియర్‌గా ఉండేవారు. అంత గొప్ప నటుడితో నేను కేవలం ఒకే ఒక్క సినిమా చేశాను. కానీ ఆ రోజులు మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. ఈ సినిమాలో నాగేశ్వరరావుగారి మనవడిపాత్రకు హరీశ్‌ను బుక్‌ చేశారు నిర్మాత. ఆ పాత్ర నాగార్జునగారు చేసి ఉంటే సినిమా రిజల్ట్‌ మరోలా ఉండేదేమో! హరీశ్‌ బాగానే చేసినా నాగేశ్వరరావుగారి ముందు తేలిపోయాడు. చాలా పవర్‌పుల్‌ కేరెక్టర్‌ అది. ‘‘హరీశ్‌ కాదు.. నాకు నాగార్జున కావాలి’’ అని గట్టిగా చెప్పే మనస్తత్వం కాదు నాది. నిర్మాతతో పోరాటం చేయడం నాకు మొదటినుంచీ అలవాటు లేదు.


పైగా దొరస్వామిరాజుగారు పెద్ద నిర్మాత, ప్రముఖ పంపిణీదారుడు. ముందే ఆయన అందరి డేట్స్‌ తీసేసుకోవడంతో డిస్కషన్‌కు అవకాశమే ఉండేది కాదు. అలాగే హీరోయిన్స్‌ సెలెక్షన్‌ కూడా బాగా లేదు. నటి ముచ్చర్ల అరుణ చెల్లెలు నందిని, జయశాంతి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రాజీపడి పనిచేయాల్సి వచ్చింది. నాగేశ్వరరావుగారు, హరీశ్‌, సుజాత ముగ్గురూ బాగా చేశారు. సబ్జెక్ట్‌ ఓరియంటెడ్‌ సినిమా అయినా మంచి క్యాస్టింగ్‌ పడి ఉంటే ఇంకా బాగుండేదని నా నమ్మకం. విడుదలయ్యాక ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో పోలిక వచ్చేసరికి ఆ సినిమా ముందు ఇది నిలబడలేకపోయింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...