Jul 8 2021 @ 20:46PM

డేట్స్‌ ఇవ్వు.. అంటూ రాధకు ఆర్డరేశాడాయన: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 28)

ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమా ‘సంసార వీణ’. ఇందులో రాధ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి క్లాస్‌, రెండోది మాస్‌ పాత్ర. ఓ సందర్బంలో క్లాస్‌ లేడీ చనిపోవడంతో మాస్‌ లేడీ క్లాస్‌ లేడీగా నటించాల్సి వస్తుంది. కుటుంబ విలువలు కలిగిన మంచి సినిమా ఇది. ఈ చిత్రంలో రాధ నటిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఆమెతో నాకు పరిచయం లేదు. అప్పటివరకు ఆమె చేసినవన్నీ గ్లామర్‌ పాత్రలే. వాటికి భిన్నమైన పాత్రలు కనుక ‘సంసార వీణ’లో ఆమె నటిస్తేనే కరెక్ట్‌ అనుకున్నాను. అయితే నాకు ఆమెతో పరిచయం లేదు. అదీగాక పెళ్ళి చేసుకునే అభిప్రాయంతో రాధ సినిమాలు తగ్గించుకుంటున్న సమయమది. పరిచయంలేని వ్యక్తిని కనుక నేను నేరుగావెళ్లి అడిగితే ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో! అందుకే సరాసరి రాఘవేంద్రరావుగారి దగ్గరకు వెళ్లాను. ఆయన దగ్గర నాకు చనువుంది. నేను దర్శకత్వం వహించిన చిత్రాలు చూసి వెంటనే ఫోన్‌ చేసి అభినందించేవారు. విషయం చెప్పగానే నా ముందే రాధకు ఫోన్‌ చేశారు. ‘‘ముత్యాల సుబ్బయ్య అనే డైరెక్టర్‌ నీ దగ్గరకు వస్తారు. కథ చెబుతారు. విని డేట్స్‌ ఇవ్వు. మంచి దర్శకుడు. అవకాశం మిస్‌ చేసుకోకు’’ అని చెప్పారు. చెప్పడం కాదు ఒక రకంగా ఆర్డర్‌ జారీ చేశారు. ‘‘అలాగే సార్‌.. తప్పకుండా’’ అన్నట్టుంది రాధ. వెంటనే ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె కథ విని ‘‘చాలా బాగుంది సార్‌, తప్పకుండా చేస్తాను’’ అని తన అంగీకారం తెలిపారు.‘సంసార వీణ’లో శరత్‌బాబు, రెహమాన్‌ హీరోలుగా నటించారు.

‘రేపటి కొడుకు’ అని అదే టైటిల్‌ పెట్టేశాం

నేను దర్శకత్వం వహించిన మరో నవలా చిత్రం ‘రేపటి కొడుకు’. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి నవల ‘రేపటి కొడుకు’ ఆధారంగా ఇది రూపుదిద్దుకున్నా తెరమీదకు వచ్చేసరికి నవలలో చాలా మార్పులు, చేర్పులు చేశాం. ఇంటికి పెద్ద కోడలుగా జయసుధ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆమె భర్తగా చంద్రమోహన్‌, మరుదులుగా సుధాకర్‌, ‘శుభలేఖ’ సుధాకర్‌ నటించారు. మామ పాత్రను వేలు పోషించారు. ఆ ఇంటికి ఓ పనిమనిషి వస్తుంది. (ఆ పాత్రను వర్ధమాన నటి భాగ్యశ్రీ పోషించింది). ఆమె గర్భవతి అవుతుంది. దానికి కారకులు ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిలో ఒకరని తెలిసినా నోరు మెదిపి చెప్పలేని పరిస్థితి. బిడ్డకు నామకరణం చేసే రోజున ఏ పేరు పెట్టాలన్న చర్చ వస్తుంది. అప్పుడు జయసుధ ఒక అడుగు ముందుకు వేసి ‘‘అక్రమంగా కొడుకును కని, వాణ్ణి ‘నా కొడుకు’ అని ధైర్యంగా అంగీకరించి ముందుకు రాలేని వీడి తండ్రి ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ తండ్రి బయటకి రావాల్సిందే. అందుకే వీడికి ‘రేపటి కొడుకు’ అని పేరు పెడదాం’’ అని చెబుతుంది. ఆసక్తికరమైన పాయింట్‌తో రూపొందిన చిత్రానికి అదే పేరు పెట్టాం. ఛాయాగ్రాహకుడు డి.డి. ప్రసాద్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ‘సంసారవీణ’ చిత్రానికి పని చేశారు. ‘నాకు ఒక సినిమా చేయండి గురువుగారు’ అని అడిగేవారు. అందుకే ‘రేపటి కొడుకు’ చిత్రం ఆయనకు చేశాను. ‘కలికాలం’ బ్రహ్మండమైన హిట్‌ కావడంతో అందులో నటించిన నటీనటులు ‘రేపటి కొడుకు’లోనూ నటించారు. మంచి సినిమా, కానీ ఆడలేదు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...