Jul 6 2021 @ 20:29PM

‘నన్ను అవమానిస్తారా..’ అని జయసుధ అవార్డు తిరస్కరించారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 27)

ఆ మర్నాడు జయసుధకు ఫోన్‌ చేసి ఓకే చెప్పేశా. అలా జేకే కంబైండ్స్‌ బ్యానర్‌పై ‘కలికాలం’ చిత్రం పట్టాలెక్కింది. చాలాకాలం తర్వాత తను నటిస్తుండటం, సినిమా తీస్తుండటంతో ‘కలికాలం’ పాటల రికార్డింగ్‌కు పరిశ్రమలోని ప్రముఖులందరినీ పిలిచారు జయసుధ. 1991 జనవరి 17న ప్రసాద్‌ 70 ఎం.ఎం. థియేటర్‌లో జరిగిన పాటల రికార్డింగ్‌కు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబుగార్లు వచ్చారు. దాదాపు చిత్రపరిశ్రమంతా తరలి వచ్చిందా అనేంతస్థాయిలో ఎంతో కలర్‌ఫుల్‌గా పాటల రికార్డింగ్‌ జరిగింది. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. తిరుచానురు(అలివేలు మంగాపురం) కోనేరు ఎదురుగా ఉన్న ఓ మధ్యతరగతి ఇంట్లో ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించాం. ‘నవభారతం’ లో సాయికుమార్‌ అంతకుముందు నటించినా ‘కలికాలం’ సినిమాతో అతని కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పాలి. జయసుధ కొడుకుగా చాలా అద్భుతంగా నటించాడు. జయసుధ, ఆమె మామగా నటించిన వేలు నటనలో ఒకరికొకరు పోటీపడ్డారు. జయసుధ భర్తగా చంద్రమోహన్‌ నటించారు. ఇది సంగీత ప్రధానమైన చిత్రంకాదుగానీ, సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. వాటిల్లో ‘ఆరని ఆకలి కాలం.. కలికాలం’ అనే పాట సినిమాలో ఆరుసార్లు రిపీట్‌ అవుతుంది.

ఆయన కోపానికి మా సినిమా బలైంది

ఒకే సంవత్సరం(1991) మూడు చిత్రాలు.. ‘ఎర్రమందారం’, ‘మామగారు’, ‘కలికాలం’ విడుదలయ్యాయి. మూడూ హిట్టే. మరో విషయమేమిటంటే ‘ఎర్రమందారం’, ‘కలికాలం’ చిత్రాలు 1990లోనే సెన్సార్‌ పూర్తి చేసుకోవడంతో ఆ రెండు చిత్రాలను 1990లో, ‘మామగారు’ చిత్రాన్ని 1991లో నంది అవార్డుల కోసం పంపించాం. నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడ ఓ విషయం తప్పకుండా చెప్పాలి. చెన్నైలో కళాసాగర్‌ అని ఓ సాంస్కృతిక సంస్థ ఉండేది. ఆ సంస్థ ఏటా ఇచ్చే సినిమా అవార్డులకు చాలా విలువ ఉండేది. ప్రతిభావంతుల్ని గుర్తించి అవార్డ్‌ ఇచ్చి ప్రోత్సహించేది కళాసాగర్‌ సంస్థ. దానికి అధ్యక్షుడు నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డిగారు. ‘కలికాలం’ చిత్రానికి నాకు బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌ ఇచ్చారు. అందులో కథానాయికగా నటించిన జయసుధకు ఉత్తమనటిగా కాకుండా ఉత్తమ సహాయనటిగా అవార్డ్‌ ప్రకటించారు. ‘కలికాలం’లో నేను హీరోయిన్‌గా నటించాను. ఇస్తే ఉత్తమనటి అవార్డివ్వాలి. లేకపోతే మానెయ్యాలిగానీ, సహాయనటిగా అవార్డ్‌ ఇచ్చి నన్ను అవమానపరచడం ఏమిటి’ అని జయసుధ ఆ అవార్డ్‌ తిరస్కరించారు.


దాంతో ఎమ్మెస్‌రెడ్డిగారికి కోపం వచ్చింది. ‘తన నిర్ణయాన్ని జయసుధ తప్పుపడుతుందా?’ అని ఆగ్రహించారు. ఆయన బయటపడలేదుగానీ ఈ విషయం మనసులో పెట్టుకున్నారు. 1990 నంది అవార్డుల కమిటీకి రెడ్డిగారు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జయసుధ మీద కోపంతో ఆయన ‘కలికాలం’ సినిమాను చూడకుండా పక్కన పెట్టేశారు. దానికి ఒక్క అవార్డు కూడా రాకుండా చేశారు. అలా ఆయన కోపానికి మా సినిమా బలైంది. అయితే నేను దర్శకత్వం వహించిన ‘ఎర్రమందారం’ చిత్రానికి మాత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు తదితర అవార్డులు ఇచ్చారు. వృత్తిపరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ‘కలికాలం’.


పరువు పేరుతో పస్తులు పడుకునేస్థాయికి సంసారాలను చేజేతులా ఎలా దిగజార్చుకుంటారోనన్నది సినిమాలో ముఖ్యమైన పాయింట్‌. అలాగే పుట్టిన పిల్లలు స్వార్ధపరులుగా ఎదిగి, తమ తాత్కాలిక ప్రయోజనాలకు తల్లితండ్రుల్ని బలి చెయ్యడానికి కూడా ఎలా వెనుకాడరో సినిమాలో చూపించాం. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. చనిపోయాడనుకున్న తండ్రి తిరిగొచ్చి కొత్త సమస్యలు సృష్టించడంతో, ఆ తండ్రిని గదిలో కూర్చోపెట్టి ఆయన బతికుండగానే లోకం కోసం ఆయనకు తద్దినం పెట్టడం ప్రేక్షకుల్ని బాగా కదిలించింది.


అన్ని అంశాలూ చక్కగా కుదిరాయి. అందరూ బాగా చేశారు. అటువంటి సినిమాకు నంది అవార్డులు రాకపోవడం నిజంగా బాధాకరమే. ఆ వెలితి నాలో చాలాకాలం ఉంది. ఆ తర్వాత నన్ను ఎంతమందో అడిగారు ‘‘గురువుగారూ ‘కలికాలం’ లాంటి సినిమా మళ్లీ తీయండి’’ అని. ‘ఈ సినిమా తియ్యండి బాబూ అని ఎంతోమందిని అడిగాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. రిస్క్‌ అని భయపడి అడుగుముందుకు వెయ్యలేదు. ఇప్పుడు హిట్‌ అయిన తర్వాత అలాంటి సినిమా తీయండి అని అడగటంతో నాకు నవ్వు వచ్చింది’.‘కలికాలం’ వంద రోజుల వేడుకను కూడా జయసుధ ఘనంగా నిర్వహించారు. 1990 సెప్టెంబర్‌ 17న చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవిగారు, దాసరిగారు ముఖ్య అతిధులుగా వచ్చారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...